ఆ ఫ్లైట్ కోసం చంద్రుళ్లు ఇద్దరూ వెయిటింగ్

Update: 2016-11-23 07:41 GMT
నిజం చెప్పాలంటే.. హెడ్డింగ్ లో చెప్పినట్లుగా ఇద్దరు ముఖ్యమంత్రులే కాదు.. రిజర్వ్ బ్యాంకు అధికారులు.. బ్యాంకు అధికారులతో సహా.. చాలామందే ఎదురు చూస్తున్నారనే చెప్పాలి. నోట్ల రద్దు నిర్ణయం నేపథ్యంలో చిల్లర నోట్లకు పెద్ద ఇబ్బందిగా మారటం.. కేంద్రం తీసుకొచ్చిన రూ.2వేల నోటుకు రూ.100కు మధ్యలో మరే నోటు లేకపోవటంతో ప్రజలకు చిల్లర కష్టాలు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ రోజు ఏ రాజకీయ నాయకుడు బయటకు వెళ్లినా.. కరెన్సీ కష్టాలు.. చిల్లర కష్టాలు మినహా మరే మాట వినిపించని పరిస్థితి.

దేశంలో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కొత్త రూ.500 నోట్లు విడుదల అయినప్పటినీ..తెలుగు రాష్ట్రాలకు ఇంతవరకూ రాని పరిస్థితి. ఎప్పుడైతే రూ.500 నోట్లు విరివిరిగా మార్కెట్లోకి వస్తాయో చిల్లర కష్టాలు కొంతమేర తగ్గే వీలుంది. ఆర్ బీఐ నుంచి తెలుగు రాష్ట్రాలకు పంపిన మొత్తంతో కిందామీదా పడుతున్న బ్యాంకులు.. తమ దగ్గరున్న కరెన్సీ నిల్వలు ఈ నెల 24 వరకే వస్తాయని.. ఆ తర్వాత చేతులు ఎత్తేయటం మినహా మరో మార్గం లేదని తేల్చి చెప్పిన వైనంతో ఆర్ బీఐ ఒక్కసారి ఉలిక్కిపడింది.

యుద్ధప్రాతిపదికన రెండు తెలుగు రాష్ట్రాలకు రూ.500 నోట్లను పంపించాలని నిర్ణయించారు. ఇందుకు తగ్గట్లే ఏర్పాట్లు పూర్తి చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రూ.400 కోట్ల విలువైన రూ.500 నోట్లను ప్రత్యేక విమానంలో పంపే ప్రయత్నాల్ని పూర్తి చేశారు. అనుకున్నది అనుకున్నట్లుగా సాగితే.. ఈ రోజు (బుధవారం) మధ్యాహ్నం నుంచి ఏ సమయంలో అయినా హైదరాబాద్ కు చేరుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ భారీ మొత్తం మొదట హైదరాబాద్ లోని ఆర్ బీఐలో జమ అవుతుంది. అనంతరం వాటిని రెండు తెలుగు రాష్ట్రాలకు పంపుతారు. అనంతరం.. ప్రధాన కేంద్రాల నుంచి రెండు రాష్ట్రాల్లోని అన్ని బ్యాంకులకు సరఫరా అయ్యేలా చేస్తారు. కొత్త రూ.500 నోట్లు కానీ సీన్లోకి వస్తే.. మొత్తంగా పరిస్థితిలో మార్పు వస్తుందన్న భావన వ్యక్తమవుతోంది. అందుకే..  ఇద్ద‌రు చంద్రుళ్లు కొత్త రూ.500నోట్లు తీసుకొచ్చే ప్రత్యేక విమానం కోసం వెయిట్ చేస్తున్నారని చెప్పొచ్చు. కొత్త రూ.500 నోట్ల కానీ వస్తే.. రెండు తెలుగు రాష్ట్రాలలో నెలకొన్న చిల్లర సమస్య ఒక కొలిక్కి వచ్చే వీలుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News