తెలుగు రాష్ట్రాల సీఎంలను కలిపిన పెళ్లి.. ఎవరిదంటే?

Update: 2021-11-21 09:33 GMT
ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు అన్న సీన్ ఒకటి చోటు చేసుకుంది. ఒకప్పుడు పరస్పర అభినందనలు.. హగ్గులతో చాలా సన్నిహితంగా ఉన్నట్లు కనిపించిన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆ తర్వాత కలిసింది లేదు.. విభజన అంశాలు.. చర్చించాల్సిన ఇష్యూలు ఎన్నో ఉన్నా.. ఇద్దరికి ఎవరి రాజకీయం వారికి ముఖ్యం కావటం.. కలిసి కూర్చొని.. మనసు విప్పి మాట్లాడుకోవాలే కానీ గంటల్లో పరిష్కారమయ్యే అంశాలు సైతం.. అదే పనిగా నానబెడుతున్న సంగతి తెలిసిందే.

ఇటీవల కాలంలో ఇద్దరు ముఖ్యమంత్రులు కలవాల్సి ఉన్నప్పటికీ.. కలవటం సాధ్యంకాదన్నట్లుగా ఉన్న పరిస్థితుల్లో.. ఈ ఇద్దరు ప్రముఖుల్ని మళ్లీ కలిపే వేదిక ఏమిటన్న ఆసక్తి వ్యక్తమయ్యేది. అందుకు భిన్నంగా తాజాగా శంషాబాద్ దగ్గర్లోని ఒక కల్యాణ మండపంలో జరిగిన వివాహానికి ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకే వేదికను పంచుకున్నారు. తెలంగాణ రాష్ట్ర స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మనమరాలి పెళ్లి సందర్భంగా ఈ రోజు (ఆదివారం) జరిగిన పెళ్లికి ఇద్దరు ముఖ్యమంత్రులు హాజరయ్యారు.

ఇద్దరు ముఖ్యమంత్రులు ఎదురుపడినప్పుడు పరస్పరం నమస్కారాలు చేసుకోవటంతో పాటు.. పక్కపక్కనే కలిసి నడిచారు. కాసేపటికి ఇద్దరు ముఖ్యమంత్రులు పక్కపక్కనే కూర్చున్నారు. వారి పక్కనే కాసేపు స్పీకర్ పోచారం కూర్చొన్నారు. ఈ సందర్భంలో సీఎంలు కేసీఆర్.. జగన్మోహన్ రెడ్డిలు ఇద్దరు కాసేపు మాట్లాడుకోవటం కనిపించింది. అనంతరం ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి వధూవరులను ఆశీర్వదించారు.అనంతరం వారిద్దరితో కలిసి పోచారం కుటుంబం ఫోటోలు దిగారు.

ఇటీవల కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం చోటు చేసుకోవటం.. రెండు రాష్ట్రాలు పోటాపోటీగా ఫిర్యాదు చేసుకోవటం తెలిసిందే. ఈ సందర్భంగా వాడీవేడిగా విమర్శలు.. ప్రతివిమర్శలు చోటు చేసుకున్నాయి. అయినప్పటికీ. ఈ వేడిని తగ్గించేందుకు ఇద్దరు ముఖ్యమంత్రులు ఫోన్లో మాట్లాడుకున్నది లేదు. కలిసి భేటీఅయ్యింది లేదు. ఇందుకు బదులుగా ఏపీ.. తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య మాటల యుద్ధం మాదిరి జరిగింది. అలాంటిది.. ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు తాజాగా ఒక పెళ్లిలో హాజరు కావటం.. పక్కపక్కనే కూర్చొని మాట్లాడుకోవటం ఆసక్తికరంగా మారింది.


Tags:    

Similar News