కేసీఆర్ ఫ్యామిలీకి ఈసీ లెక్క చిక్కులు నిజమేనా?

Update: 2015-11-20 06:24 GMT
ఎన్నికల సందర్భంగా చేసే ఖర్చుకు సంబంధించి జాగ్రత్తగా ఉండాలి. ఎన్నికల్లో పోటీ సందర్భంగా అభ్యర్థులు ఇచ్చే లెక్క మాత్రమే కాదు.. వారికి షాడోగా ఎన్నికల సంఘం అధికారులు లెక్కలు వేస్తుంటారు. వారి లెక్కకు.. వీరి లెక్కకు మధ్య తేడా వస్తే ఇబ్బందే. ప్రస్తుతం అలాంటి ఇబ్బందే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆయన కుమార్తె..నిజామాబాద్ ఎంపీ కవిత ఎదుర్కొంటున్నారు. పార్టీ ఇచ్చిన మొత్తాన్ని లెక్క చూపించే విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ లెక్క తప్పుగా చూపించారన్న ఆరోపణ వ్యక్తమవుతున్న సమయంలోనే.. తాజాగా ఆయన కుమార్తె కవిత తప్పు లెక్క వ్యవహారం వార్తగా మారింది. అయితే.. ఇందులో పలు కోణాలు ఉన్నాయి. కవితను విమర్శిస్తున్నవారి కోణం నుంచి లెక్కల్నిచూస్తే.. వారు చెప్పినట్లుగా కవిత తప్పుచేయలేదన్న భావన కలగటం ఖాయం. మొత్తం గా ఈ ఇష్యూను సాపేక్షంగా చూస్తే..

ప్రస్తుతం కవిత ఎదుర్కొంటున్న ‘‘తప్పు లెక్క’’ ఇబ్బందిని సింఫుల్ గా చెప్పాలంటే.. ఆమె తాను చేసిన ఖర్చుగా చెబుతున్న దానికి.. ఎన్నికల అధికారి చెబుతున్న ఖర్చుకు మధ్య లెక్క సరిపోవటం లేదు. ఉదాహరణకు ఒక ర్యాలీ నిర్వహించటానికి కవిత లక్ష రూపాయిలు ఖర్చు అయ్యిందని పేర్కొంటే.. షాడో ఎన్నికల అధికారి.. తమ లెక్క ప్రకారం రూ.1.10లక్షలుగా చెబుతున్నారు. ఈ రెండింటి మధ్య లెక్క తేడా ఇప్పుడు వివాదంగా మారింది.

ఇలా వచ్చిన తేడా ఏ పదివేలో.. లేదంటే లక్షరూపాయిలు కాకుండా.. దాదాపు రూ.32.65లక్షలుగా ఉంది. దీంతో.. ఇప్పుడు ఈ లెక్క తేడాను ప్రశ్నిస్తున్నారు. సభలు.. ర్యాలీల కోసం తాను ఖర్చుచేసింది రూ.1.98లక్షలుగా చెబితే.. ఎన్నికల అధికారి రూ.2.23 లక్షలుగా చెబుతున్నారు (లెక్క కాస్త తేలిగ్గా అర్థమయ్యేందుకు వందల రూపాయిల్ని మినహాయించి పేర్కొంటున్నాం) ఇక.. స్టార్ క్యాంపెయినర్ ఖర్చు ఖాతా కింద కవిత రూ.8.30లక్షలు చూపిసతే.. ఎన్నికల అధికారి రూ.20.31లక్షలుగా చూపించారు. ప్రచార సామాగ్రి కోసం పైసా ఖర్చు చేయలేదని కవిత చెబితే.. ఎన్నికల అధికారి మాత్రం రూ.58వేలు ఖర్చు అయినట్లు పేర్కొన్నారు.

ఇక.. మీడియా ద్వారా చేసిన ప్రచారం కవిత లెక్క ప్రకారం రూ.10.04లక్షలు ఉంటే.. ఎన్నికల అధికారి లెక్క ప్రకారం రూ.29.86లక్షలుగా ఉంది. ప్రచారవాహనాల కోసం కవిత చెప్పిన లెక్క రూ.2.06లక్షలుగా ఉంటే.. ఎన్నికల అధికారి లెక్క మాత్రం రూ.97వేలుగా ఉండటం గమనార్హం.

మిగిలిన లెక్కలు ఎన్నికల అధికారి చెప్పిన దాంతో పోలిస్తే.. కవిత లెక్క తక్కువగా ఉంటే.. ప్రచార వాహనాల కోసం ఆమె పేర్కొన్న మొత్తం.. ఎన్నికల అధికారి చెప్పిన లెక్క కంటే ఎక్కువగా ఉంది. అంటే.. ఎన్నికల అధికారి లెక్కకు.. కవిత లెక్కకు మధ్య వ్యత్యాసం ఉందన్న విషయం అర్థమవుతుంది. నిజంగా కవిత తప్పుడు లెక్కలే చూపించారనే అనుకుంటే.. ప్రచార వాహనాల విషయంలో ఎన్నికల అధికారి లెక్క కంటే ఎక్కువగా ఎందుకు చెప్పినట్లు? అన్న ప్రశ్న ఉదయించక మానదు. ఈ విషయంలో కవిత లెక్క కరెక్ట్ అనుకుంటే.. మిగిలినవి కూడా కరక్టేనని చెప్పక తప్పదు. మొత్తంగా చూస్తే.. ఈ వివాదం సాంకేతికంగా మారుతుందే తప్పించి.. ఆమెకు ఎలాంటి సమస్యా ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News