కేసీయార్ నితీష్ ముచ్చట్లు : మోడీ టాపిక్ లేకుండానే... ?

Update: 2022-08-31 11:45 GMT
ఇద్దరు సినిమా వాళ్ళు కలిస్తే సినిమాల గురించి మాట్లాడుకుంటారు, అలగే ఇద్దరు రాజకీయ నాయకులు కలిస్తే మాట్లాడుకునేది కచ్చితంగా రాజకీయాల గురించే. కానీ అన్నీ  బయటకు చెప్పేయాలని లేదు. అక్కడే రాజకీయ వ్యూహాలకు పదును పెడతారు. చూడబోతే ఆ ఇద్దరూ మామూలు వాళ్ళు కాదు. ఒకరు తొడకొట్టి మరీ తెలంగాణా రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు. రెండు సార్లు ఎన్నికల్లో గెలిచి ఎనిమిదేళ్ళుగా సీఎం గా కొనసాగుతున్న కేసీయార్. మరొకరు గత రెండు దశాబ్దాలుగా సీఎం గా బీహార్ వంటి పెద్ద రాష్ట్రాన్ని పాలిస్తున్న నేత.

ఇపుడు ఈ ఇద్దరు నాయకులు కలుసుకున్నారు. ముచ్చట్లు పెట్టుకున్నారు. అయితే అదంతా ఇన్ సైడ్ కెమెరాగానే అంటున్నారు. ఇక కేసీయార్ వినయకచవితి రోజే ప్రత్యేక విమానం వేసుకుని మరీ బీహార్ వెళ్లారు. ఆయనకు ఎయిర్ పోర్టులో ముఖ్యమంత్రి నితీష్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ స్వాగతం పలికారు. ఇక సికింద్రాబాద్ అగ్నిప్రమాదంలో చనిపోయిన వలస కూలీల కుటుంబాలకు సాయం అందించేందుకు కేసీఆర్ బీహార్ వెళ్లారు కాబట్టి ఆ పనిని ఆయన పూర్తి చేశారు.

ఇక ఆ సందర్భంగా కేసీయార్ విజన్ గొప్పదని, ఆయన హయాంలో తెలంగాణాలో గ్రామీణాభివృద్ధి సాధ్యపడిందని నితీష్ కుమార్ అంటే నితీష్ గ్రేట్ లీడర్ అని కేసీయార్ అన్నారు. మిషన్ భగీరధ గొప్ప పధకం అని నితీష్ పొగిడారు. తాము తెలంగాణాలో అమలవుతున్న పధకలను అధ్యయనం చేస్తున్నామని వాటిని బీహార్ లో అమలు చేయబోతున్నామని నితీష్ చెప్పుకొచ్చారు.

ఇదంతా ఓపెన్ గా మీడియా ముఖంగా చెప్పుకున్న మాటలు. ఆ తరువాత ఇద్దరు నాయకులు ప్రత్యేకంగా సమావేశం జరిపారు. అపుడే జాతీయ రాజకీయాల గురించి చర్చకు వచ్చినట్లుగా చెబుతున్నారు. నితీష్ ఈ మధ్య దాకా ఎన్డీయేలో   ఉండి బయటకు వచ్చిన నాయకుడు. ఉత్తరాదిన మంచి పలుకుబడి ఉన్నబీసీ నేత. కేసీయార్ అయితే గత ఏడాదిగా మోడీతో కొట్లాడుతున్న నాయకుడు. ఆయన దేశంలో యాంటీ మోడీ కూటమి కోసం కృషి చేస్తున్నారు. ఇద్దరి టార్గెట్ ఇపుడు ఒక్కటే. ఇద్దరికీ ఒకరే ప్రత్యర్ధి. ఆయనే మోడీ.

మరి మోడీని ప్రధాని పదవి నుంచి ఎలా దించాలన్నదే వారి అజెండాగా ఉంటుంది. ఆ విషయంలో ఏ డౌటూ లేదు, కానీ దానికి సంబంధించిన రూట్ మ్యాప్ ఎలా ఉండాలో ఏమేమి చేయాలో దాని మీదనే ఇద్దరు నేతలూ చర్చించి ఉంటారని అంటున్నారు. పేరుకు వలస కూలీలకు సాయం అని కేసీయార్ బీహార్ కి వెళ్ళినా అసలు కధ మాత్రం మోడీకి వ్యతిరేకంగానే అని అంటున్నారు.

మరి ఈ ముచ్చట్ల గురించి ఈ ఇద్దరు నేతలలో ఎవరో ఒకరు బయటకు వచ్చి చెప్పాలి. మరి వారు ఇపుడే ఆ విషయాలను చెబుతారా లేక వ్యూహం ప్రకారమే ఇన్ కెమెరా మీటింగ్ పెట్టుకున్నారా అన్నది చూడాలి. ఏది ఏమైనా ఈ ఇద్దరు నేతల భేటీ అన్నది కేంద్రంలోని బీజేపీకి దడ పుట్టించేదే అన్నది వాస్తవం.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News