రెండు ప్రెస్ మీట్లు.. వేడెక్కిన తెలుగు రాజ‌కీయం

Update: 2018-03-04 04:27 GMT
వాతావ‌ర‌ణం ఒక్క‌సారిగా మారిపోయింది. వీకెండ్ అన్నంత‌నే రాజ‌కీయాలు ఒకింత నెమ్మ‌దిగా సాగుతుంటాయి. మిగిలిన రంగాల మాదిరే రాజ‌కీయాల‌కు క‌నిపించ‌ని క్యాలెండ‌ర్ ఒక‌టి ఉంటుంది. సోమ‌వారం కాస్త ఆల‌స్యంగా మొద‌లై బుధ‌.. గురువారాల్లో పీక్స్ కు వెళ్లి శుక్ర‌వారం లేదంటే శ‌నివారం మ‌ధ్యాహ్నానానికి నెమ్మ‌దిస్తాయి. ఇక‌.. ఆదివారం గురించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు.

కానీ.. ఈ వీకెండ్ అందుకు భిన్నంగా సాగింది. దీనికి కార‌ణం లేక‌పోలేదు. సోమ‌వారం నుంచి పార్ల‌మెంటు స‌మావేశాలు ప్రారంభం కానున్న నేప‌థ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల‌కు సంబంధించి కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. ఆ మ‌ధ్య‌న జేఎఫ్‌ సీ పేరుతో ఒక క‌మిటీని ఏర్పాటు చేసి.. రెండు రోజుల మేథోమ‌ధ‌నం జ‌ర‌ప‌టం.. విభ‌జ‌న హామీల మీద ఈ క‌మిటీ మ‌రింత లోతుల్లోకి ప‌రిశీలించి లెక్క తేలుస్తార‌ని ప‌వ‌న్ చెప్పారు.

ఇందుకు త‌గ్గ‌ట్లే.. పార్ల‌మెంటు స‌మావేశాల‌కు రెండు రోజుల ముందు ఆయ‌న ప్రెస్ మీట్ పెట్టారు. తాను ఏర్పాటు చేసిన జేఎఫ్‌ సీలో పాలుపంచుకున్న వారితో క‌లిపి ఆయ‌న ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సంద‌ర్భంగా ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుతో స‌హా ప్ర‌ధాని మోడీపై విమ‌ర్శ‌లు చేశారు.

ఎప్ప‌టిక‌ప్పుడు అనుభ‌వం పేరు చెప్పి బాబును వెన‌కేసుకొచ్చే ప‌వ‌న్.. ఈసారి అదే అనుభ‌వంపై పంచ్ వేశారు. అనుభ‌వం ఉన్న బాబు సైతం హోదా విష‌యంలో కన్ఫ్యూజ్ అయిపోతున్నారంటూ చుర‌క‌లు అంటించారు. అంతేనా.. విభ‌జ‌న నేప‌థ్యంలో ఇచ్చిన హామీల అమ‌లుకు సంబంధించి కేంద్రం ఇవ్వాల్సిన లెక్క‌ల మీద కూడా వివ‌రాలు వెల్ల‌డించ‌టం ద్వారా.. ఏపీకి ఎంత భారీగా హ్యాండ్ ఇచ్చార‌న్న విష‌యాన్ని చెప్ప‌క‌నే చెప్పేశారు.

ప‌వ‌న్ ప్రెస్ మీట్ జోరు ఓప‌క్క సాగుతున్న వేళ‌లోనే.. కేసీఆర్ సీన్లోకి వ‌చ్చేశారు. గ‌డిచిన మూడు రోజులుగా చ‌డీచ‌ప్పుడు చేయ‌ని ఆయ‌న‌.. ఈ రోజు పార్ల‌మెంటు పార్టీ స‌మావేశాన్ని నిర్వ‌హించ‌ట‌మే కాదు.. త‌న బ‌లాన్ని ప్ర‌ద‌ర్శిస్తూ.. వారంద‌రితో క‌లిసి ప్రెస్ మీట్ పెట్టేశారు.

ఈ సంద‌ర్భంగా ప‌లు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌. తుపాకీ శ‌నివారం ఉద‌యం చెప్పిన‌ట్లే.. జాతీయ రాజ‌కీయాల్లో తాను పాలు పంచుకోనున్న‌ట్లుగా చెప్ప‌ట‌మే కాదు.. దేవుడు మ‌న్నించి.. ఆరోగ్యం స‌హ‌క‌రిస్తే మూడునాలుగేళ్లు దేశానికి తాను చేయాల్సింది చేస్తాన‌ని చెప్పారు. మూడో కూట‌మి ఏంటి?  ఇదే ప్ర‌ధాన కూట‌మి అంటూ తాను ప్లే చేసే పాలిటిక్స్ ఎలా ఉంటాయ‌న్న విష‌యాన్ని త‌న మాట‌ల‌తో చెప్పేశారు.

కొంద‌రిని ట‌చ్ చేయ‌కూడ‌ద‌ని.. చేస్తే భ‌స్మ‌మైపోతారంటూ త‌న‌కున్న కాన్ఫిడెన్స్ ఎంత‌న్న విష‌యాన్ని కేసీఆర్ త‌న ప్రెస్ మీట్ లో చెప్ప‌క‌నే చెప్పేశారు. మోడీ మీద ఇద్ద‌రు తెలుగు నేత‌లు గంటల వ్య‌వ‌ధిలో పెట్టిన ప్రెస్ మీట్లు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ రాజ‌కీయాల్లోనూ స‌రికొత్త చ‌ర్చ‌కు తెర తీయ‌టం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News