పిక్ ఆఫ్ ది డే: పైకి నవ్వులు.. లోపల సెగలు.. రాష్ట్రపతి కోసం కేసీఆర్-గవర్నర్ కలిశారు.

Update: 2022-12-27 04:30 GMT
నోటితో పలకరించి.. నుదుటితో వెక్కిరించే జనాలు ఈ సమాజంలో ఎందరో ఉన్నారు. తమకు పడని వారి విషయంలో మొహమాటాలకు ఇలా చేస్తుంటారు. కేసీఆర్ కూడా అంతే. తనకు నచ్చని పడని వ్యక్తులను ఎంత దూరం పెట్టాలో అంతా పెడుతారు. వాళ్లకు చుక్కలు చూపిస్తుంటారు. రాజకీయంగా.. సామాజికంగా ఎదురుదాడి చేసి ఉక్కిరి బిక్కిరి చేస్తుంటారు. టీఆర్ఎస్ పుట్టినప్పటి నుంచి కేసీఆర్ వెంట ఉన్న ఆలె నరేంద్ర, విజయశాంతి నుంచి నేటి ఈటల రాజేందర్ వరకూ రాజకీయంగా ఎంత గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నారో మనం అంతా చూశాం.

ఇప్పుడు బీజేపీ అంటేనే ఒంటికాలిపై లేస్తున్న సీఎం కేసీఆర్.. ఆ బీజేపీ ఆడిస్తున్న గవర్నర్ తమిళిసైతో కయ్యానికి కాలుదువ్వాడు. తమిళిసై కూడా సై అనడంతో ఈ వార్ జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. తెలంగాణలో గవర్నర్ కు ప్రోటోకాల్ లేకుండా కేసీఆర్ చేయడం.. గవర్నర్ కూడా తెలంగాణ బిల్లులను చెత్తబుట్టలో పడేయడంతో వీరి మధ్య యుద్ధం పతాకస్థాయికి చేరింది.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికీ కూడా గవర్నర్ తమిళిసై ముఖం చూడడానికి కూడా ఇష్టపడడం లేదు. వీరి మధ్య విభేదాలు అంత తారాస్థాయికి ఉన్నాయి. రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య దూరం బాగా పెరిగింది. కేసీఆర్ పై ఢిల్లీ పెద్దలకు గవర్నర్ ఫిర్యాదు చేసింది. అయితే వీరిద్దరూ కొన్ని సందర్భాల్లో కలవాల్సి వస్తోంది. అదే ఖర్మ అంటే..

తాజాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం తెలంగాణకు వచ్చారు. దేశ ప్రథమ మహిళ రావడంతో కేసీఆర్ స్కిప్ చేయడానికి అవకాశం లేకుండా పోయింది. పైగా తెలంగాణలో రెండో రాష్ట్రపతి భవన్ బొల్లారంలో బస చేయనుండడంతో తప్పనిసరిగా కేసీఆర్ ఆహ్వానించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ క్రమంలోనే రాష్ట్రపతికి ఎయిర్ పోర్టులో గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ కలిసి స్వయంగా స్వాగతించారు. కడుపులో ఎన్ని కత్తులున్నా పైకి మాత్రం నవ్వును అరువు తెచ్చుకొని మరీ నవ్వుతూ మాట్లాడుకుంటూనే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ దృశ్యం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇద్దరు బద్ధ శత్రువులు ఇలా కలిసి సాగాల్సిన అరుదైన సందర్భం వైరల్ అవుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News