ఇచ్చిన డ‌బ్బులు ఓట్ల‌గా మార‌కుంటే ఎలా కేసీఆర్‌?

Update: 2018-05-12 05:10 GMT
కొత్త ప‌థ‌కం ఎలా ఉండాలి?  విన్నంత‌నే అరే.. మ‌నోళ్ల‌కు ఎందుకు ఈ ఐడియా రాలేదంటూ అసూయ‌తో ర‌గిలిపోయేలా చేయ‌ట‌మే కాదు.. కాస్త మార్పులు.. చేర్పులు చేసి వెనువెంట‌నే అమ‌లు చేయాల‌నిపించేలా ఉండాలి. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి తాజాగా లాంఛ్ చేసిన రైతుబంధు ప‌థ‌కం ఇలాంటి కోవ‌కే చెందుతుంద‌ని చెప్పాలి. తెలంగాణ రాష్ట్రంలో పంట‌లు వేసే రైతుల‌కు ఎక‌రాకు రూ.4వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందించ‌ట‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్న రైతుబంధు ప‌థ‌కంపై కేసీఆర్ భారీగానే ఆశ‌లు పెట్టుకున్న‌ట్లు చెబుతారు.

నేరుగా 60 ల‌క్ష‌ల వ‌ర‌కూ ప్ర‌యోజ‌నం చేకూర్చే ఈ భారీ ప‌థ‌కం కార‌ణంగా తెలంగాణ రాష్ట్ర ఖ‌జానాపై రూ.12వేల కోట్ల మేర అద‌న‌పు భారం ప‌డ‌నుంది. అయితే.. ఈ భారీ ఖ‌ర్చును లెక్క చేయ‌కుండా ముందుకెళుతున్న కేసీఆర్‌.. సార్వ‌త్రిక ఎన్నిక‌ల నాటికి తెలంగాణ ప్ర‌జ‌లు మ‌రింకేమీ ఆలోచించ‌కుండా త‌మ‌కు ఓట్లు వేయ‌టం త‌థ్య‌మ‌న్న భావ‌న‌లో టీఆర్ఎస్ నేత‌లు ఉన్నారు.

అయితే.. ఈ విష‌యంలో తెలంగాణ ప్ర‌జ‌లు కేసీఆర్‌కు షాకివ్వ‌టం ఖాయ‌మ‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. ప‌థ‌కాలు స్టార్ట్ చేసినంత మాత్రాన‌.. ల‌బ్థి పొందాం కాబ‌ట్టి ప్ర‌జ‌లు ఓట్లు వేసేస్తార‌న్నది రాంగ్ కాన్సెప్ట్ గా చెబుతున్నారు. రైతుబంధు ప‌థ‌క ల‌బ్థిదారుల్లో వంద మందిని ర్యాండ‌మ్ గా స‌ర్వే చేస్తే.. దీనిపై పెద‌వి విరిచేవారే క‌నిపిస్తున్న‌ట్లు చెబుతున్నారు. ల‌బ్థి పొందుతున్న‌ప్ప‌టికి కేసీఆర్ కు ఓటు వేసే విష‌యంలో తాము సానుకూలంగా లేమ‌న్న మాట‌ను ప‌లువురి నోట వ‌చ్చిన‌ట్లుగా చెబుతున్నారు.

కేసీఆర్ ఇస్తున్న మొత్తం.. ముఖ్య‌మంత్రి జేబులో నుంచి ఇవ్వ‌టం లేద‌ని.. తాము క‌ట్టిన ప‌న్నుల్లో నుంచి మాత్ర‌మే వ‌స్తున్నాయన్న మాట వింటే కేసీఆర్ లెక్క తేడా కొట్టే ప్ర‌మాదం పొంచి ఉంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. అదే స‌మ‌యంలో రైతు బంధు ప‌థ‌కం వ‌ల్ల ల‌బ్థి పొందే వారు ఎంత‌మందో దానికి రెట్టింపుగా కౌలు రైతులు ఉంటార‌ని..ఈ ప‌థ‌కం విష‌యంలో వారిలో తీవ్ర అసంతృప్తి వ్య‌క్త‌మ‌వుతుంద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు.

రైతుబంధు ప‌థ‌కం భూమి ఉన్న రైతుల‌కు నేరుగా ల‌బ్థి చేకూరుతుంద‌ని.. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో పొలాల్ని పండించే ప‌నిని రైతులు కాస్తా.. కౌలుకు ఇవ్వ‌టం తెలిసిందే. ఈ ప‌థ‌కం నేప‌థ్యంలో వాస్త‌వంగా క‌ష్ట‌ప‌డే కౌలు రైతుకు చేయిచ్చిన‌ట్లుగా ప్ర‌భుత్వ వైఖ‌రి ఉంద‌ని.. దీని కార‌ణంగా మేలు కంటే కీడే ఎక్క‌వ‌గా జ‌రుగుతుంద‌ని అంటున్నారు. రైతుబంధు ప‌థ‌కం ద్వారా ల‌బ్థిపొందిన రైతుల్లో ఎంత‌మంది ఓట్లు వేస్తార‌న్న‌ది ప్ర‌శ్న‌గా మారింద‌ని.. అదే స‌మ‌యంలో రైతుల‌కే త‌ప్పించి.. పంట‌లు పండించే కౌలురైతుల ఊసే లేద‌ని.. ఇది వారిలో అసంతృప్తికి గురి చేసి మూకుమ్మ‌డిగా ఓట్లు వేయ‌కుండా చేసే ప్ర‌మాదం పొంచి ఉంద‌ని చెబుతున్నారు.

అదే జ‌రిగితే వేల కోట్లు ఖ‌ర్చు పెట్టి మ‌రీ.. ఓట్లు వేయించుకోలేని పార్టీగా టీఆర్ఎస్ మారుతుంద‌న్న మాట వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో రైతుబంధు ప‌థ‌కం కేసీఆర్ ను ముంచుతుందా?  తేలుస్తుందా?  అన్న‌ది మ‌రికొద్ది నెల‌ల్లో జ‌రిగే ఎన్నిక‌ల ఫ‌లితాలు తేలుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News