వెంక‌న్నా... కేసీఆర్ వ‌చ్చేస్తున్నారు!

Update: 2017-01-23 04:35 GMT
తెలంగాణ‌ను ప్ర‌త్యేక రాష్ట్రంగా ఆవిర్భ‌వించేందుకు ఏకంగా 14 ఏళ్ల పాటు అలుపెర‌గ‌ని పోరు సాగించిన టీఆర్ ఎస్ అధినేత క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు... ఎట్ట‌కేల‌కు ఆ ల‌క్ష్యాన్ని సాధించేశారు. త‌న ల‌క్ష్యసాధ‌న కోసం ఆయ‌న పోరు సాగించ‌డంతో పాటు క‌నిపించిన దేవుళ్లంద‌రి వ‌ద్దా మోక‌రిల్లారు. క‌నిపించ‌ని దేవుళ్ల‌ను కూడా దూరంగా ఉండే ప్రార్ధించిన వైనం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే తిరుమ‌ల శ్రీవేంక‌టేశ్వ‌ర‌స్వామితో పాటు విజ‌య‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ‌ను కూడా ఆయ‌న స్మ‌రించుకున్నారు. మదిలోనే కోటి దండాలు పెట్టి... త‌న క‌ల‌ను సాకారం చేయండ‌ని వేడుకున్నారు. అంతేనా... త‌న క‌ల‌ను సాకారం చేస్తే... వారికి కానుక‌లు స‌మ‌ర్పించుకుంటాన‌ని కూడా మొక్కుకున్నారు.

అంద‌రి దేవుళ్ల ద‌య - ఆయ‌న అలుపెర‌గ‌ని పోరుతో ఎట్ట‌కేల‌కు తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రంగా ఏర్ప‌డింది. ఆ రాష్ట్రానికి తొలి ముఖ్య‌మంత్రిగా ప‌దవీ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఇది జ‌రిగి దాదాపుగా మూడేళ్లు కావ‌స్తోంది. ఈ క్ర‌మంలో ఆయా దేవుళ్ల‌కు చెల్లించాల్సిన మొక్కుల జాబితాను బ‌య‌ట‌కు తీసిన కేసీఆర్‌... వాటిని నెర‌వేర్చుకునేందుకు కొన్ని నెలల క్రిత‌మే కార్య‌రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే తెలంగాణ‌లోని ప‌లు దేవుళ్ల‌కు ఆయ‌న మొక్కులు చెల్లించారు. ఇక ఏపీలోని దేవుళ్ల మొక్కులే మిగిలి ఉన్నాయి. వాటిని కూడా తీర్చేందుకు కేసీఆర్ సిద్ధ‌మ‌య్యారు. ఇప్ప‌టికే స‌ద‌రు మొక్కుల ద్వారా వెంక‌న్న‌ - క‌న‌క‌దుర్గ‌మ్మ‌ల‌కు స‌మ‌ర్పించాల్సిన ఆభ‌ర‌ణాల‌ను ఆయ‌న తయారు చేయించారు. కోట్ల విలువ చేసే ఈ ఆభ‌ర‌ణాల‌ను జ్యువెల్ల‌రీ రంగంలో నిష్ణాతులుగా పేరుగాంచిన వారికి ప‌నిని అప్ప‌గించిన కేసీఆర్‌... వాటి త‌యారీని పూర్తి చేయించారు.

ఇక ఆ ఆభ‌ర‌ణాల‌ను వెంక‌న్న‌ - క‌న‌క‌దుర్గ‌మ్మ‌ల‌కు స‌మ‌ర్పించ‌మే త‌రువాయిగా మారింది. ఈ క్ర‌మంలో దేవుళ్ల మొక్కులు తీర్చుకునేందుకు షెడ్యూల్ కూడా ఖ‌రారు చేసుకున్న కేసీఆర్‌... నిన్న ఓ కీల‌క ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేశారు. ఈ నెల 30న తిరుమ‌ల‌తో పాటు విజ‌య‌వాడ‌కు వెళ్లాల‌ని ఆయ‌న నిర్ణ‌యించుకున్నారు. తిరుమ‌ల‌లో వెంక‌న్న‌కు ఆభ‌ర‌ణాలు స‌మ‌ర్పించిన త‌ర్వాత‌, విజ‌య‌వాడ‌లోని క‌న‌క‌దుర్గ‌మ్మ‌కు కూడా ఆభ‌ర‌ణాల‌ను ఆయ‌న స‌మ‌ర్పిస్తార‌ట‌. ఇందుకోసం ఇప్ప‌టికే ఏపీలోని ఆ రెండు ఆల‌యాల‌కు స‌మాచారం చేరిపోయింది. ఈ మొక్కుల చెల్లింపుతో తెలంగాణ కోసం కేసీఆర్ మొక్కిన మొక్కులు దాదాపుగా పూర్తి కానున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News