కేసీఆర్ రాజ‌కీయ చాణక్యంలో కీల‌క ఎపిసోడ్స్‌

Update: 2017-06-01 05:28 GMT
ఒక ప్ర‌భుత్వం మూడేళ్ల పాల‌న అంటే..  మొత్తం కాకున్నా.. కొంత‌మేర అయినా అసంతృప్తి ఉంటుంది. కానీ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ పాల‌న అందుకు భిన్నంగా క‌నిపిస్తుంది. అలా అని ఆయ‌న త‌ప్పులేమీ చేయ‌లేదా? ఊహించ‌నంత అభివృద్ధి చేశారా? ఇలాంటి నేత ఇప్ప‌టివ‌ర‌కూ అధికారంలోకి రాలేదా? లాంటి ప్ర‌శ్న‌లు వేసుకొని.. నిజాయితీతో మాట్లాడితే స‌మాధానాలు వేరుగా ఉంటాయి. కానీ.. అలా మాట్లాడే అవ‌కాశం ఇవ్వ‌కుండా.. అసంతృప్తి అన్న ఆలోచ‌న రాకుండా ఉండేలా జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌టంలోనే కేసీఆర్ రాజ‌కీయ చాణ‌క్యం క‌నిపిస్తుంది.

సుదీర్ఘ‌కాలం పాటు ఉద్య‌మ రాజ‌కీయాన్ని న‌డిపిన ఆయ‌న అధికారానికి దూరంగానే ఉన్నారు. ఆ మాట‌కు వ‌స్తే.. వ్య‌వ‌స్థ తీరు తెన్నులు.. పాల‌న‌లో అనుభ‌వం కూడా త‌క్కువే. అయితే.. వీట‌న్నింటి కంటే తిమ్మిని బ‌మ్మిని చేయ‌టం.. కొన్ని స‌మ‌స్య‌ల విష‌యంలో నిజాయితీగా నిర్ణ‌యాలు తీసుకోవ‌టం.. వ‌రాలు ఇచ్చే విష‌యంలో పెద్ద మ‌న‌సును ప్ర‌ద‌ర్శించ‌టం.. అల‌వోక‌గా భారీ నిర్ణ‌యాలు తీసుకోవ‌టం.. అసంతృప్తితో ఊగిపోయే వారిని సంతృప్తిలో ముంచెత్త‌టం లాంటివి కేసీఆర్ అమ్ముల‌పొదిలో అస్త్రాలుగా చెప్పాలి.

ఈ కార‌ణంతోనే.. కేసీఆర్ పాల‌న మీద విపక్షాలు.. కొన్ని ప్ర‌జాసంఘాలు.. మ‌రికొంద‌రు మేధావులు.. చాలా త‌క్కువ మంది మీడియా ప్ర‌తినిధులు విరుచుకుప‌డుతుంటారు. ఇక్క‌డే కేసీఆర్ విజ‌యం క‌నిపిస్తుంటుంది. అసంతృప్తి అనే క‌ర్ర‌ల మూట‌ను.. వ‌రాల పేరిట విడ‌దీసి.. ఒక్కొక్క క‌ర్ర‌కు ఒక్కో వ‌రంతో విరిచేసి.. క‌ర్ర‌ల మూట‌ను మాయం చేయ‌టంలో కేసీఆర్ త‌ర్వాతే ఎవ‌రైనా.

ద‌శాబ్దాలుగా కొన్ని రంగాల‌కు జ‌రుగుతున్న అన్యాయాల్ని కొన‌సాగించ‌కుండా.. ఆ విష‌యాల్లో వెనువెంట‌నే నిర్ణ‌యాలు తీసేసుకునే కేసీఆర్‌.. మ‌రికొన్ని విష‌యాల్లో అస్స‌లు ప‌ట్టించుకోని తీరు క‌నిపిస్తుంది. త‌మ డిమాండ్ల సాధ‌న కోసం త‌ర‌చూ రోడ్డు ఎక్కే వారిని రోడ్లు ఎక్క‌కుండా చేయ‌ట‌మే కాదు.. మ‌ళ్లీ నోరు తెరిచి మాట్లాడేందుకు అవ‌కాశం ఇవ్వ‌ని రీతిలో క‌డుపు నింపేసి పంపించ‌టం కేసీఆర్ కు మాత్ర‌మే సాధ్యం.

ఈ కార‌ణంతోనే.. మూడేళ్ల కేసీఆర్ పాల‌న‌లో తెలంగాణ రాష్ట్ర అప్పు 60 ఏళ్ల అప్పున‌కు ద‌గ్గ‌ర ద‌గ్గ‌ర‌గా వ‌చ్చిన‌ప్ప‌టికీ.. ఒక్క‌రంటే ఒక్క‌రు సైతం కేసీఆర్ ను నిల‌దీయ‌లేని ప‌రిస్థితి. అప్పులు పాల‌కులంద‌రూ చేసేవే అన్న భావ‌న‌కు ప్ర‌జ‌లు వ‌చ్చేలా చేయ‌టంలో కేసీఆర్ మాయాజాలం క‌నిపిస్తుంది. త‌ర‌చూ సంప‌న్న రాష్ట్రమ‌న్న మాట‌ను చెప్ప‌టం ద్వారా.. ధ‌నిక క్ల‌బ్బులో చేరిన ఆనందాన్ని కోట్లాది మందికి క‌లిగించే కేసీఆర్‌.. త‌మ వాస్త‌వ ప‌రిస్థితి తెలుసుకునే విష‌యంలో త‌ప్పులో కాలేసేలా చేయ‌టం ఆయ‌న‌కు మాత్ర‌మే సాధ్య‌మ‌ని చెప్పాలి.  

త‌న మూడేళ్ల పాల‌న‌లో త‌ప్పుల సంగ‌తి ప‌క్క‌న పెడితే.. కొన్ని నిర్ణ‌యాల‌తో ఆయ‌న ఎవ‌రూ ఊహించ‌లేనంత సానుకూల‌త‌ను మూట‌గ‌ట్టుకున్నారు. ప‌వ‌ర్ లో ఉండి.. ప్ర‌భుత్వం మీద అసంతృప్తి లేకుండా చేసుకోవ‌టం ఎలా? అన్న ప్ర‌శ్న‌కు తెలంగాణ‌లో కేసీఆర్ పాల‌న ఒక కేస్ స్ట‌డీగా ఉప‌యోగ‌ప‌డుతుంద‌న‌టంలో సందేహం లేదు.

ఇక్క‌డ కేసీఆర్ ను పొగిడే క‌న్నా.. ఆయ‌న పాల‌న‌లోని విల‌క్ష‌ణ‌త‌ను చెప్ప‌ట‌మే ఉద్దేశం. త‌న పాల‌న‌ త‌ప్పుల కుప్ప‌గా ఉన్న‌ప్ప‌టికీ.. సామాన్య ప్ర‌జానీకానికి అవేమీ క‌నిపించ‌కుండా చేయ‌ట‌మే కాదు.. అధికార‌ప‌క్షం మీద అంత‌కంత‌కూ ప్రేమ పొంగేలా చేయ‌టం సామాన్యమైన విష‌యం కాదు. అలాంటి అరుదైన ఫీట్ ను స‌క్సెస్ ఫుల్ గా కొనసాగిస్తున్నారు కేసీఆర్‌.

తాను ముఖ్య‌మంత్రి అయ్యాక‌.. జీతాల పెంపు కోసం డిమాండ్ చేసే ప‌లు వ‌ర్గాల వారికి ఆయ‌న పెంచిన జీతం లెక్క చూస్తే నోట మాట రాదంతే. అరకొర పెంపున‌కు కేసీఆర్ పూర్తి వ్య‌తిరేకం. ఆయ‌న కానీ ఒక ఇష్యూను టేక‌ప్ చేస్తే.. మ‌ళ్లీ నాలుగైదేళ్ల వ‌ర‌కూ నోట మాట రానంత భారీగా పెంచేస్తూ నిర్ణ‌యం తీసుకుంటారు. వినేందుకు ఇవ‌న్నీ అతిశ‌యోక్తులుగా అనిపించినా.. వాస్త‌వాల్ని చూపిస్తే కానీ కేసీఆర్ ఎంతటి వ్యూహ‌క‌ర్తో తెలుస్తుంది. తెలంగాణ‌లోని వివిధ వ‌ర్గాల‌కు చెందిన వారి వేత‌నాలు ఎంత భారీగా పెరిగాయ‌న్న‌ది చూస్తే..

+ అంగ‌న్ వాడీ కార్య‌క‌ర్త‌ల‌కు            రూ.4200 కాస్తా రూ.10,500 పెంపు

+ అంగ‌న్ వాడీ స‌హాయ‌కుల‌కు         రూ.2200 కాస్తా రూ.06,000 పెంపు

+ ఆశా వ‌ర్క‌ర్ల‌కు                        రూ.1500 కాస్తా రూ.06,000 పెంపు

+ వీఆర్ ఏల‌కు                          రూ.6500 కాస్తా  రూ.10,500 పెంపు

+ వీవోఏల‌కు                             రూ.1500 కాస్తా  రూ.05,000 పెంపు

+  ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల‌కు           రూ.10,900 కాస్తా  రూ.17,000 పెంపు

+  కాంట్రాక్టు లెక్చ‌రర్లకు                రూ.18,000 కాస్తా  రూ.27,000 పెంపు

+  ఫీల్డ్ అసిస్టెంట్లకు                     రూ.6,290 కాస్తా  రూ.10,000 పెంపు

+  పారిశుధ్య కార్మికుల‌కు              రూ.8,500 కాస్తా   రూ.14,000 పెంపు

+  డ్రైవ‌ర్లకు                              రూ.10,200 కాస్తా   రూ.15,000 పెంపు
Tags:    

Similar News