ఆర్టీసీలో మీరు వెతకాల్సిన బొక్కలు చాలానే ఉన్నాయ్ కేసీఆర్

Update: 2019-10-07 10:52 GMT
అప్పుడెప్పుడో వచ్చిన ఒక సినిమాలో రాజకీయ నాయకుడి పాత్రధారి.. ఆవేశంతో.. ఎన్ని ఉద్యమాలు చూడలేదు.. జై ఆంధ్రా.. జై తెలంగాణ ఉద్యమాల్నే తొక్కేశామంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తాడు. అప్పట్లో కాబట్టి సరిపోయింది కానీ.. ఇప్పుడు అలాంటి డైలాగ్ కానీ సినిమాలో ఉంటే ఎంత రచ్చ జరుగుతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఉండదు.
ఉద్యమాల్ని అంగీకరించటం.. సమ్మెల్ని స్వాగతించం.. ఆందోళనల్ని అణిచేస్తాం.. వ్యతిరేకతను వంగబెడదాం లాంటి మాటలు అహంకారానికి చిహ్నంగా కనిపిస్తుంటాయి. అలాంటి మాటలు అనే ముందు ఒకటికి నాలుగుసార్లు సరి చూసుకోవాల్సి ఉంది. ప్రభుత్వం ఆయా రంగాలకు చెందిన సంక్షేమాన్ని చూడాలే తప్పించి.. వాటిల్లోని తప్పుల్ని ఎత్తి చూపిస్తూ.. గురివిందలా మారకూడదు.

ఆర్టీసీ సమ్మె విషయంలో తనకు తెలీకుండా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యక్తిగత సవాలు స్థాయికి వెళ్లిపోయారా? అన్న సందేహం ఆయన మాటల్ని చూస్తే కలుగక మానదు. నిత్యం ఎవరో ఒకరితో పోలిక చెప్పటంతో పాటు.. సంపన్న తెలంగాణ.. ధనిక రాష్ట్రమని గొప్పలు చెప్పే పెద్ద మనిషి.. ఆర్టీసీ లాంటి సంస్థను ప్రభుత్వంలో కలిపేస్తే వచ్చే నష్టమేమిటి?

 ఆ మాటకు వస్తే.. ఆర్టీసీని ప్రభుత్వంలోకి తీసుకొని.. సమర్థవంతమైన అధికారికి దాని పగ్గాలు ఇచ్చేసి.. ఉద్యోగుల జీతాల విషయంలో పెద్ద మనసుతో వ్యవహరిస్తే జరిగే నష్టమేమీ ఉండదు. ఇన్ని ట్రావెల్ కంపెనీలు లాభాల బాటలో పయనిస్తూ.. తమ సంస్థల్ని అంతకంతకూ పెద్దవి చేసుకుంటున్న వేళ.. ఆర్టీసీని లాభాల బాట ఎక్కించటం ఏమైనా పెద్ద విషయమా? అంటే కాదనే చెప్పాలి.

ఆర్టీసీలో కార్మికుల జీతాల గురించి పెడబొబ్బలు పెడుతున్న ముఖ్యమంత్రి.. సంస్థలో భారీ జీతాలు తీసుకునే వారి విషయంలో ఎందుకు ఫోకస్ పెట్టరు?  సంస్థకు నష్టాలకు కారణమైన అంశాల మీద కేసీఆర్ లాంటి మేధావి  దృష్టి పెడితే లాభాలబాట పట్టదా? అంతదాకా ఎందుకు.. ఆర్టీసీకి ప్రభుత్వ బకాయిలు ఎందుకు సకాలంలో తీర్చరు?  ఇలాంటివెన్నో బొక్కలు పూడ్చి.. ఉమ్మడి రాష్ట్రంలో ఎవరూ చేయలేని బాగు ఆర్టీసీకి చేస్తే ఎవరు మాత్రం కాదంటారు?

ఎవరికి సాధ్యం కాని విద్యుత్ సంక్షోభాన్ని తీర్చేసిన కేసీఆర్ లాంటి నేతకు.. ఆర్టీసీని బాగు చేయటం పెద్ద విషయమేమీ కాదు. అయినా.. ఆర్టీసీ కార్మికులు కోరుకుంటున్నది ఏమిటి? ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపేయమంటున్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతల్లో ఆర్టీసీని చేర్చమంటున్నారు.సంస్థను బతికించమంటున్నారు. సంస్థ ఆస్తుల్ని కాపాడమంటున్నారు. వీటన్నింటితో పాటు జీతాలు పెంచమంటున్నారు. ఇవేమీ అసాధారణ.. అత్యాశతో కూడుకున్న డిమాండ్లు ఏమీ కావు కదా? ఉద్యమాన్ని గోకకూడని రీతిలో గోకితే ఏమవుతుందో తెలిసిన కేసీఆర్ లాంటి ఉద్యమ నేత ఇలా చేయటమా? అన్నదే అసలు ప్రశ్న.
Tags:    

Similar News