టికెట్లు రానోళ్లు ఫాంహౌస్ లో ఏం చేస్తున్న‌ట్లు?

Update: 2018-09-08 06:10 GMT
ముంద‌స్తు ఎన్నిక‌ల్లో భాగంగా రెండు రోజుల క్రితం ప్ర‌క‌టించిన 105 అభ్య‌ర్థుల్లో ఇద్ద‌రు సిట్టింగుల‌కు టికెట్ల‌ను నిరాక‌రించ‌టం తెలిసిందే. ఈ ఇద్ద‌రు నేత‌ల్లో ఒక‌రు ప్ర‌ముఖ సినీ న‌టుడు బాబు మోహ‌న్ అయితే.. మ‌రొక‌రు న‌ల్లాల ఓదెలు. అయితే.. టికెట్లు రానోళ్ల‌లో ఎక్కువ బ‌ద్నాం అయినది బాబు మోహ‌నే.

టికెట్లు పొందిన వారిలో ప‌లువురు ఓట‌మికి ద‌గ్గ‌రగా ఉన్నా.. వారిని అభ్య‌ర్థులుగా ప్ర‌క‌టించిన కేసీఆర్‌.. ఈ ఇద్ద‌రి విష‌యంలోనూ తీసుకున్న నిర్ణ‌యం డ్యామేజింగ్ గా ఉంద‌న్న మాట వినిపిస్తోంది. ఇద్ద‌రిలోనూ బాబు మోహ‌న్ కు సినిమా నేప‌థ్యం ఉండ‌టంతో ఆయ‌న పేరు మీడియాలో ఎక్కువ‌గా నానింది.

ఈ తీరుపై బాబు మోహ‌న్ అసంతృప్తితో ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. వ్య‌క్తిగ‌తంగా కేసీఆర్ తో మంచి సంబంధాలు ఉన్న‌ప్ప‌టికీ.. టికెట్లు ఇచ్చే  విష‌యంలో మాత్రం వంగ తోట సామెత‌కు త‌గ్గ‌ట్లే వ్య‌వ‌హ‌రించార‌ని చెప్పాలి. ఇదిలా ఉంటే.. తాజాగా టికెట్లకు నో చెప్పిన ఇద్ద‌రు (బాబు మోహ‌న్‌.. న‌ల్లాల ఓదెల) నేత‌ల్ని కేసీఆర్ ప్ర‌త్యేకంగా పాంహౌస్ కు పిలిపించుకున్నారు.

వారిద్ద‌రితో భేటీ అయిన ముఖ్య‌మంత్రి కేసీఆర్‌... ఇద్ద‌రునేత‌ల భ‌విష్య‌త్తుకు త‌న‌ది భ‌రోసా అని బుజ్జ‌గించిన‌ట్లుగా తెలుస్తోంది. సాంకేతిక అంశాల్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకునే ఇలాంటి నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా కేసీఆర్ వారికి చెప్పిన‌ట్లుగా చెబుతున్నారు. టికెట్లురానంత మాత్రాన పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్ మొత్తం పోయిన‌ట్లుగా భావించొద్ద‌ని.. వారి ఫ్యూచ‌ర్ ను తాను చ‌క్క‌దిద్దుతాన‌ని..అందుకు త‌నది పూచీ అని స్ప‌ష్టం చేసిన‌ట్లుగా తెలుస్తోంది. కేసీఆర్ అంత‌టోడు ఫాంహౌస్ కు పిలిపించుకొని మాట్లాడిన త‌ర్వాత భ‌రోసాగా ఉండాల‌న్న భావ‌న‌ను వ్య‌క్తం చేసిన‌ట్లుగా స‌మాచారం. మొత్తానికి టికెట్లు రానోళ్ల‌ను వ‌దిలేయ‌కుండా.. పార్టీకి వ్య‌తిరేకంగా మార‌కుండా చూడ‌టం.. వారి కార‌ణంగా ఎన్నిక‌ల్లో ఎలాంటి న‌ష్టం వాటిల్ల‌కుండా చూసే లెక్క‌లో భాగంగానే కేసీఆర్ ఈ ఇద్ద‌రు నేత‌ల్ని ఫాంహౌస్ కు పిలిపించుకొని మాట్లాడిన‌ట్లుగా చెబుతున్నారు.


Tags:    

Similar News