మోడీ ఇలాకాలో కేసీఆర్ ఫ్లెక్సీలు.. బ్యానర్లు

Update: 2022-02-17 04:40 GMT
ఆయుధం చేతిలో ఉండగానే సరిపోదు. దాన్ని సక్రమంగా.. ప్రభావవంతంగా ఎలా వాడాలన్న విషయం చాలామందికి తెలీదు. ఆ మాటకు వస్తే.. టాలెంట్ ఎంత ఉన్నా.. తమకున్న బలాల మీద పూర్తి అవగాహన ఉన్న వారు.. ఎవరి మీదా ఆధారపడరు. అంతేకాదు.. తమ శక్తి సామర్థ్యాల్ని సమయానికి అనుగుణంగా బయటపెట్టి అందరిని విస్మయానికి గురి చేస్తుంటారు. అలాంటి మైండ్ సెట్ ఉన్న అధినేతగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సుపరిచితులు.

ఆయన్ను పక్కాగా వ్యతిరేకిస్తారన్న చోట.. జైజేలు అందుకోసం.. వేలెత్తి చూపిస్తారన్న చోట.. వేనోళ్ల పొగిడించుకోవటం ఆయనకు మాత్రమే సాధ్యమని చెప్పాలి. ఏపీ విభజన తర్వాత..తెలంగాణ రాష్ట్రం ఏర్పడి.. ముఖ్యమంత్రిగా కేసీఆర్ పదవీ బాధ్యతలు చేపట్టిన మొదటి సంవత్సరంలో వచ్చిన పుట్టిన రోజు సందర్భంగా ఏపీలోని పలుచోట్ల ఆయన పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరగటం తెలిసిందే. అంతదాకా ఎందుకు.. ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వెళ్లిన వేళలో.. అలిపిరి మార్గంలో ఆయనకు స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు కావటం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఇటీవలే జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తానని చెప్పిన కేసీఆర్.. అందుకు తగ్గట్లే పావులు కదపటం తెలిసిందే. కేంద్రంలోని మోడీ సర్కారు చేస్తున్న తప్పుల్ని గురి చూసి కాల్చిన చందంగా ఆయన నోటి నుంచి వచ్చిన మాటలపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరగుతోంది. ఈ రోజు (గురువారం) సీఎం కేసీఆర్ పుట్టిన రోజు. ఆయన బర్త్ డే సందర్భంగా ఆయనకు విషెస్ తెలుపుతూ.. గుజరాత్ లోని సూరత్ పట్టణంలో కేసీఆర్ ఫ్లెక్సీలు పెద్దఎత్తున దర్శనమివ్వటం ఆసక్తికరంగా మారింది.

మోడీకి ఆయన పరివారానికి రాజకీయ చెక్ చెప్పేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్న వేళలో.. ఆయన్ను ఆకాశానికి ఎత్తేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు కావటం అందరిని ఆకర్షిస్తోంది. ఎక్కడ టచ్ చేస్తే మోడీ అండ్ కో ఉలిక్కిపడతారో.. అక్కడే టచ్ చేసిన వైనం చూస్తే.. కేసీఆర్ అండ్ కో వ్యూహరచన ఎంత పక్కాగా ఉందన్నది ఇట్టే అర్థం కాక మానదు. కేసీఆరా మజాకానా?

Tags:    

Similar News