23 నుంచి భూరిజిస్ట్రేషన్లు.. కాంట్రాక్ట్ లెక్చరర్లకు ఊరట..

Update: 2020-11-16 03:30 GMT
దుబ్బాకలో ఓటమి ఫలితం సీఎం కేసీఆర్ పై కాస్త గట్టిగానే పనిచేస్తున్నట్టు ఉంది. అందుకే ఇప్పుడు నష్టనివారణ చర్యలు చేపడుతున్నారు. దెబ్బతిన్న వ్యవస్థను గాడిలో పెట్టడానికి ట్రై చేస్తున్నారు. ఈ మేరకు ప్రజల ఆగ్రహాజ్వాలలు చల్లార్చేందుకు వరాల వాన కురిపిస్తున్నట్టు తెలుస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అందుకే జీహెచ్ఎంసీ ఎన్నికల ముందర కేసీఆర్ సార్ వరుసగా ప్రజాకర్షక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళుతున్నారు. మరి ఇవి ఫలిస్తాయా? లేదా అన్నది చూడాలి. కొద్దిరోజులుగా తెలంగాణలో ధరణి పేరిట ఆగిన భూ రిజిస్ట్రేషన్లను కేసీఆర్ పునరుద్దరిస్తున్నారు.

23నుంచి తెలంగాణలో వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు ఉంటాయని ఈ ప్రక్రియను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ప్రారంభిస్తారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఆదివారం ప్రగతిభవన్లో ధరణి పోర్టల్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ధరణి పోర్టల్ పై ఫీడ్ బ్యాక్ బాగుందన్నారు. చిన్న చిన్న సమస్యలు వచ్చినా అధికారులు వాటిని అధిగమించారన్నారు. ధరణి ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ఉండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు.

ధరణి ద్వారా ప్రజలు వ్యవసాయ భూములకు భరోసా దొరికిందని సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని.. మరో మూడు నాలుగు రోజుల్లో అన్ని రకాల సమస్యలు వందశాతం అధిగమిస్తామని తెలిపారు.

ఇక జూనియర్ కాంట్రాక్ట్ లెక్చరర్లపై వరాలు కురిపించారు. అర్హత ఉండి.. భర్తీకి అవకాశం ఉన్న ఇతర ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో కాంట్రాక్ట్ లెక్చరర్లకు అవకాశం కల్పించాలని కేసీఆర్ ఆదేశించారు. వారిని రెగ్యులరైజ్ చేయాలనే ప్రభుత్వం ప్రయత్నం కోర్టులో నిలిచిపోయిందని.. వారి జీతాలను రెట్టింపు చేశామని తెలిపారు.
Tags:    

Similar News