కేసీఆర్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వేళ ‘మా’ ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ ఓడటమా?

Update: 2022-03-02 23:30 GMT
సాధారణంగా ఏదైనా ఎన్నికలు జరిగి.. వాటి ఫలితాలు వచ్చిన తర్వాత గెలుపు.. ఓటమి మీద మాట్లాడటం కామన్. కానీ.. ఎన్నికలు ముగిసి.. దాని గురించి అందరూ మర్చిపోతున్న వేళ.. ఓటమి పాలైన వారి గురించి ఆసక్తికర చర్చ జరగటమే కాదు.. అంత తోపు.. ఇలాంటి పిల్ల ఎన్నికల్లో ఎలా ఓడిపోవటమా? అన్నదిప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటివరకు జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో అత్యంత వివాదాస్పదంగా.. ప్రతి అడుగు సంచలనంగా మారిన ఎన్నికలు ఏమైనా ఉన్నాయంటూ అది ఈ మధ్యన ముగిసిన ఎన్నికలే అని చెప్పాలి.

‘మా’ అధ్యక్షుడిగా ప్రకాశ్ రాజ్.. వర్సెస్ మంచు విష్ణు మధ్య ఎన్నికలు జరగటం.. అనూహ్యంగా మంచు విష్ణు విజయం సాధించటం తెలిసిందే. అయితే.. ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ వేళ.. చోటు చేసుకున్న పరిణామాల మీద ఫలితాలు వెల్లడైన తర్వాత పెట్టిన ప్రెస్ మీట్ లో వెల్లడి కావటం.. అవి కాస్తా సంచలనంగా మారటం తెలిసిందే. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉంటూ.. ఆయన జాతీయ రాజకీయాలకు చోదక శక్తిగా మారిన ప్రకాశ్ రాజ్ తీరు.. ఆయన గురించి మళ్లీ మాట్లాడుకునేలా చేస్తోంది.

కేసీఆర్ తో ఇంత సన్నిహిత సంబంధాలు ఉండి కూడా.. మా ఎన్నికల్లో ఓడిపోవటం ఏమిటి? కేసీఆర్ లాంటి అధినేతకు ఏ ఎన్నికల్ని ఎలా డీల్ చేయాలన్నది తెలుసు. నిజానికి ఆయన తలుచుకుంటే.. మా ఎన్నికల లెక్కను నిమిషాల్లో తేల్చేస్తారు కదా? అలాంటిది.. ప్రకాశ్ రాజ్ ఓటమి పాలు కావటం ఏమిటి? అన్న సందేహాలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. నిజానికి.. ‘మా’ ఎన్నికల వేళ.. ప్రకాశ్ రాజ్ కు మద్దతు ఇవ్వాలని మంత్రి కేటీఆర్ కొందరికి స్వయంగా ఫోన్లు చేసిన చెప్పినట్లుగా ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని అప్పట్లో ప్రకాశ్ రాజ్ ఖండించారు.

మరి.. తనకున్న పరిచయాలు.. తనకున్న బలాన్ని ఉపయోగించి ‘మా’ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించే విషయంలో ప్రకాశ్ రాజ్ ఎందుకు ఫెయిల్ అయ్యారన్న ప్రశ్న ఇప్పుడు అందరి మదిలో మెదులుతోంది. దీనికి సమాధానం వెతికే ప్రయత్నంలో పలువురితో మాట్లాడిన సందర్భంలో ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. అదేమంటే.. కేసీఆర్ తో అత్యంత సన్నిహిత సంబంధాలు కేసీఆర్ కు ఉన్నప్పటికి.. ఆయన్ను ఉపయోగించుకునే విషయంలో ప్రకాశ్ రాజ్ కు ఇష్టం లేదంటున్నారు.

నిజానికి ‘మా’ ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ ఎదుర్కొంటున్న ప్రతికూలతను గుర్తించిన కేసీఆర్.. తమ సహాయం ఏమైనా కావాలని అడిగారని.. అందుకు ప్రకాశ్ రాజ్ నో చెప్పినట్లు చెబుతున్నారు. సినిమా పరిశ్రమకు సంబంధించిన అంశంలోతన వ్యక్తిగత స్నేహాన్ని..రాజకీయాల్ని ఎంటర్ చేయటం ప్రకాశ్ రాజ్ కు ఇష్టం లేదని.. అందుకే సాయం చేస్తానని ముందుకు వచ్చిన కేసీఆర్ ను వారించినట్లు చెబుతున్నారు. ఎందుకిలా అంటే.. ప్రకాశ్ రాజ్ కు గెలుపు ముఖ్యం కాదు. విలువలు ముఖ్యం.

ఎవరినో ప్రభావితం చేసి.. దాంతో విజయాన్ని సాధించటాన్ని ఆయన తనకు తాను నైతికంగా ఓడిపోవటంగా భావిస్తారు. తన సొంత బలంతో.. తన వ్యక్తిగత ఛరిష్మాతో ఎన్నికల్లో గెలవాలన్నది ప్రకాశ్ రాజ్ ఆలోచనగా చెబుతారు. అందుకే.. ఆయన కేసీఆర్ సాయం తీసుకోలేదంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో విజయం తప్పించి మరింకేమీ వద్దని భావించే వారు ఓడిపోవటం.. ఏమైనా సరే.. గెలుపు మాత్రమే ముఖ్యమని భావించి.. అందుకోసం ఏమైనా చేస్తామన్నట్లుగా వ్యవహరించే వారు గెలవటం దేనికి సంకేతం?


Tags:    

Similar News