యూపీఏ అంతటి దుర్మార్గ చట్టం చేసిందా?

Update: 2016-03-22 04:41 GMT
నచ్చని విషయాన్ని సూటిగా చెప్పటమే కాదు.. అదెంత ప్రమాదకరమైనదో తెలుసా అన్నట్లు చెప్పటం అందరికి అంత బాగా రాదు. కానీ.. ఆ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మినహాయింపుగా చెప్పాలి. నచ్చని విషయాన్ని ఆయన సూటిగా చెప్పటమే కాదు.. తన వాదనకు చూపించే కారణాలు అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. తాజాగా ఆయన యూపీఏ సర్కారు నాడు చేసిన విద్యాహక్కు చట్టం ఎంత దారుణమైనదో చెప్పే ప్రయత్నం చేశారు. కేసీఆర్ వాదన వింటే.. నిజమే కదా? అని అనిపించటమే కాదు.. ఈ విషయాన్ని నాటి పాలకులు ఎందుకు ఆలోచించలేదన్న భావన కలగటం ఖాయం.

విద్యాహక్కు చట్టాన్ని తేవటాన్ని గొప్పగా చెప్పుకునే కాంగ్రెస్ అండ్ కో నేతలు.. కేసీఆర్ మాటల్ని విన్న తర్వాత.. ఆ చట్టం పేరు తలవటానికి ఏమాత్రం ఇష్టపడరన్న విషయం అర్థమవుతుంది. మరీ.. చట్టం గురించి కేసీఆర్ వాదనేంటో చదవండి.

‘‘విద్యాహక్కు చట్టం అంటూ యూపీఏ దుర్మార్గమైన చట్టాన్ని చేసి పోయింది. ఈ చట్టాన్ని అమలు చేసి.. ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తే 40 వేల మంది టీచర్లకు పని ఉండదు. కేంద్రంలో అధికారం మారిన ప్రతిసారీ విద్యకు సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త ప్రభుత్వం రాగానే వాటిని వదిలేయటం జరుగుతోంది. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు మోడల్ స్కూళ్లను తీసుకొచ్చి మూడు వేల మంది టీచర్లను నియమిస్తే.. మోడీ సర్కారు వచ్చి.. వాటి నిర్వహణ బాధ్యతను రాష్ట్రం మీద పడింది. అసలు విద్యాహక్కు చట్టం ఎంతవరకు ఉపయోగం అన్న విషయాన్ని అందరూ ఆలోచించాలి’’

‘‘ఈ చట్టంలో చెప్పినట్లుగా పేద విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లు ఇస్తే ప్రభుత్వ పాఠశాలలు ఏం కావాలి? దాని వల్ల 50 నుంచి 60 శాతం ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభావం పడుతుంది. రాష్ట్రంలో ఉన్న 3 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల్లో 1.5లక్షల మంది టీచర్లే. ఈ చట్టం కానీ అమలైతే 40 వేల మంది టీచర్లకు పని లేకుండా పోతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో తొమ్మిది మంది విద్యార్థులకు ఐదుగురు టీచర్లున్న పరిస్థితి. ప్రైవేటు విద్యా సంస్థల్లో 25 శాతం మందిని చేర్పించి.. ప్రభుత్వం వారికి ఫీజులు చెల్లిస్తే.. సర్కారీ స్కూళ్లకు ఎవరొస్తారు?’’ అంటూ వేస్తున్న సూటి ప్రశ్నలు విన్నప్పుడు.. యూపీఏ సర్కారు తప్పు చేసినట్లుగా అర్థం కాక మానదు.
Tags:    

Similar News