కేసీఆర్ ను అంత మాట అనేశారేంటి..?

Update: 2015-08-20 06:00 GMT
పరుషంగా మాట్లాడటం ఇప్పటి దూకుడు రాజకీయాల్లో మామూలే. కాకుంటే.. ఉన్నత స్థానాల్లోని వ్యక్తుల్ని విమర్శించే సమయంలో కాస్తంత ఆచితూచి మాట్లాడే మర్యాదకు నెమ్మదిగి తిలోదకాలు ఇచ్చేస్తున్నట్లుగా ఉంది. విమర్శలు చేయాలన్న ఆలోచన వచ్చేయటం తడవు వెనుకా ముందు చూసుకోకుండా మాట్లాడేయటం.. ఎంత మాట పడితే అంత మాట అనేయటం ఇప్పుడో అలవాటుగా మారిపోతోంది.

తెలంగాణ ఎంపీ (రాజ్యసభ సభ్యుడు) వీహెచ్ హనుమంతరావు వ్యవహారాన్నే చూస్తే.. ఆయన మిగిలిన పనులు ఏం చేసినా చేయకున్నా.. అవసరానికి మించి నోటికి పని చెప్పటం చేస్తుంటారన్న విమర్శ ఉంది. ఆయన మాదిరే తెలంగాణ కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి సైతం ఇదే రీతిలో వ్యాఖ్యలు చేస్తుంటారు. అప్పుడప్పుడు మాట్లాడినా మసాలా డోస్ పెంచి వ్యాఖ్యలు చేయటం ఆయనకు అలవాటే..  తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

రాష్ట్రంలో చీప్ లిక్కర్ పేరుతో సామాన్యులకు అందుబాటులో ఉండేలా తక్కువ ధరకే మద్యాన్ని అందించేందుకు తెలంగాణ అధికారపక్షం ప్రయత్నాలు చేస్తుండటం తెలిసిందే. దీనిపై విమర్శల బాణాన్ని ఎక్కు పెట్టిన జీవన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఛీప్ లిక్కర్ కు కేసీఆర్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తునారంటూ మండి పడ్డారు. రాష్ట్ర ఖజానాను నింపుకోవటానికి ముఖ్యమంత్రి చౌక మద్యాన్ని తీసుకొస్తున్నారని.. మహిళల నుంచి తీవ్ర వ్యతిరేక రావటం ఖాయమన్నారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని ఉద్దేశించి ఛీప్ లిక్కర్ కు బ్రాండ్ అంబాసిడర్ అనటంలో ఔచిత్యం జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నేతలకే తెలియాలి.
Tags:    

Similar News