చంద్రబాబు చర్చలు.. కేసీఆర్‌కు అలవాటు అయ్యాయా?

Update: 2015-07-02 08:49 GMT
ఓటుకు నోటు వ్యవహారం తెర మీదకు వచ్చినప్పుడు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరిస్థితి విచిత్రంగా ఉండేది. అపర మేధావి అన్న పేరున్న తనను ఓ ఆట ఆడుకుంటున్న తీరుతో ఆయన విపరీతమైన మధన పడేవారు. కాన్ఫిడెన్స్‌ కోసం అన్నట్లుగా నిత్యం తన వారిని చుట్టూ కూర్చోబెట్టుకొని చర్చల మీద చర్చలు జరిపేవారు.

ముఖ్యనేతలతో పాటు.. కీలక అధికారులతో గంటల కొద్దీ చర్చలు జరిపేవారు. పొద్దున్న వచ్చి గంటల తరబడి చర్చలు జరిపిన ఉన్నతాధికారులు సాయంతం అయ్యేసరికి మరోసారి చర్చలకు వెళ్లేవారు. ఇలా.. చర్చల మీద చర్చలు చేసే చంద్రబాబును చూసి చాలామంది జోకుల మీద జోకులు వేసుకునే పరిస్థితి.

ఓటుకు నోటు వ్యవహారంలో రోజుకో పరిణామం చోటు చేసుకోవటం.. ఒక చిక్కుముడి తీసేసరికి మరో చిక్కుముడి రెఢీగా ఉండటంతో విపరీతమైన ఒత్తిడిని చంద్రబాబు ఎదుర్కొన్నట్లుగా చెప్పేవారు. బయటకు పెద్దగా రాకుండా.. మీడియాకు ఏ మాత్రం అందుబాటులో ఉండకుండా రివర్స్‌ ప్లాన్‌ కోసం చాలానే కష్టపడాల్సి వచ్చింది. ఇందుకోసం ఆయన తన శక్తియుక్తులతో పాటు.. తనకున్న పరిచయాలు.. తన పరపతిని భారీగా ఉపయోగించాల్సి వచ్చిందని చెబుతారు.

అలా చర్చల మీద చర్చలు జరిపిన చంద్రబాబు.. ఒక ఫైన్‌ మార్నింగ్‌.. ఈ చర్చల చట్రం నుంచి బయటకు వచ్చేశారు. జిల్లా మీద జిల్లా తిరుగుతూ బిజీ..బిజీ అయ్యారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. చంద్రబాబు ఎప్పుడైతే చర్చలకు పుల్‌స్టాప్‌ పెట్టారో.. అప్పటి నుంచి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నతాధికారులతో భేటీ కావటం మొదలైంది.

రేవంత్‌రెడ్డికి హైకోర్టు బెయిల్‌ ఇచ్చిన రోజు అయితే.. ఆయన స్వల్ప జ్వరానికి గురై కూడా.. ఉన్నతాధికారులతో ఏకాంత చర్చలు జరిపినట్లు చెబుతారు. తాజాగా.. గురువారం ఉదయం ఏసీబీ డీజీ ఏకే ఖాన్‌తో సమావేశం అయిన కేసీఆర్‌.. సీరియస్‌ చర్చలు చేసినట్లు చెబుతున్నారు. చూస్తుంటే చంద్రబాబు చర్చల వ్యవహారం..ఇప్పుడు కేసీఆర్‌కు ఒక అలవాటుగా మారినట్లు కనిపిస్తోంది.

Tags:    

Similar News