వినయ విధేయ 'కల్వకుంట్ల రామ'

Update: 2018-12-19 08:55 GMT
మంత్రివర్గ కూర్పుపై కేసీఆర్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. వందశాతం వీరవిధేయులకే ఈసారి మంత్రి వర్గంలో చాన్స్ లభించే అవకాశం ఉంది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి వారం రోజులు గడుస్తున్నా మంత్రుల ఎంపికపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. తనయుడి పొలిటికల్ ఫ్యూచర్ కోసం కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ ఆలస్యం చేస్తున్నారనే చర్చ పార్టీలో నడుస్తోంది.

ఎన్నికల ఫలితాల అనంతరం తెలంగాణ 13న సీఎంగా కేసీఆర్, మంత్రిగా మహమూద్ అలీ ప్రమాణ స్వీకారం చేశారు. ఇక అప్పటి నుంచి మంత్రి వర్గ విస్తరణపై ఎన్నో ఊహగానాలు చక్కర్లు కొడుతున్నాయి. చివరకు 8మందితో మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని కేసీఆర్ ప్రకటించారు. అయితే ఆయన ప్రమాణ స్వీకారం చేసి వారం రోజులు గడుస్తున్నా ఆ అష్ట దిగ్గజాలను మాత్రం తేల్చలేదు.

ఫెడరల్ ఫ్రంట్ తెరపైకి తీసుకొచ్చి జాతీయ రాజకీయాలపై కేసీఆర్ దృష్టిసారించారు. దీంతో కేసీఆర్ తనయుడిని ముఖ్యమంత్రిగా చేస్తారనే టాక్ బలంగా వినిపిస్తుంది. అందుకే కేటీఆర్ నమ్మినోళ్లు మంత్రివర్గంలో ఉంటే సేఫ్ అని డిసైడయినట్లు సమాచారం. ఆ కోణంలోనే మంత్రివర్గ కూర్పు కోసం కసరత్తు జరుగుతోంది.

ఒకవైపు కేటీఆర్ కూడా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియామకం అయ్యాక జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు. వారం పదిరోజుల్లో ఉమ్మడి తెలంగాణ 10జిల్లాలను చుట్టి రానున్నారు. ఇదంతా కేసీఆర్ స్ట్రాటజీలో భాగమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఆయన జిల్లాల పర్యటన పూర్తయ్యే వరకు మంత్రి వర్గ విస్తరణ ఉండబోదని తెల్చేస్తున్నారు.

ఇప్పడే మంత్రులను ప్రకటిస్తే కేటీఆర్ జిల్లాల పర్యటనలో ఆయనకు అంత క్రెడిబిలిటీ ఉండకపోవచ్చని- ఆయా జిల్లా పర్యటనలో కేటీఆర్ కు వీరవిధేయులెవరో తేల్చి మరీ మంత్రి పదవులు కట్టబెట్టనున్నారని సమాచారం. దీంతో కేటీఆర్ కు అనుకూలంగా ఉన్న వ్యక్తులే క్యాబినెట్ చోటు దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయని పోలిటికల్ సర్కిల్ లో చర్చ జోరుగా సాగుతోంది.
    

Tags:    

Similar News