నిరూపిస్తే సీఎం పదవికి రాజీనామా -ముక్కు నేలకు రాయాలి: కేసీఆర్

Update: 2018-04-27 08:31 GMT
మిగిలిన ముఖ్య‌మంత్రుల‌కు భిన్నం తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌. రెగ్యుల‌ర్ గా బ‌య‌ట‌కు రాకుండా ఉండ‌టం.. మంత్రుల‌తోనూ.. ఎమ్మెల్యేల‌కు.. కీల‌క అధికారుల‌కు అందుబాటులో ఉండ‌ర‌న్న పేరు ప్ర‌ఖ్యాతులున్న కేసీఆర్‌.. ఒక్క‌సారి బ‌య‌ట‌కు వ‌చ్చి మైకు ప‌ట్టుకుంటే చాలు.. అప్ప‌టివ‌ర‌కూ మ‌న‌సులో ఉన్న ఆలోచ‌న‌ల్ని తుడిచి పెట్టేసేలా మాట్లాడ‌టంలో ఆయ‌న దిట్ట‌.

అలాంటి మేజిక్ ను మ‌రోసారి ప్ర‌ద‌ర్శించారు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌. తాము తాజాగా నిర్వ‌హిస్తున్న ప్లీన‌రీ దేశ రాజ‌కీయాల్ని ప్ర‌భావితం చేస్తుంద‌ని చెప్పిన త‌ర‌హాలోనే కేసీఆర్ తాజా ప్ర‌సంగం ఉంది. తొలుత తెలంగాణ‌లో త‌మ‌పై పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీ నేత‌ల‌పై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డిన కేసీఆర్‌.. టీపీసీసీ ర‌థ‌సార‌ధి ఉత్త‌మ్‌కు సూటి స‌వాలు విసిరారు.

ఈ మ‌ధ్య‌న ఆయ‌న చేస్తున్న బ‌స్సుయాత్ర సంద‌ర్భంగా ప్ర‌గ‌తిభ‌వ‌న్ లో 150 గ‌దులు ఉన్న‌ట్లుగా చెప్ప‌టాన్ని త‌ప్పు ప‌ట్టారు. 150 గ‌దులు కాదు.. 15 గ‌దుల కంటే ఎక్కువ చూపిస్తారా? అని స‌వాలు విసిరారు. ప్లీన‌రీ ఈ రోజు సాయంత్రం ఆరు గంట‌ల స‌మ‌యంలో ముగుస్తుంద‌ని.. ఎనిమిది గంట‌ల‌కు తాను ప్ర‌గ‌తిభ‌వ‌న్  వ‌ద్ద వెయిట్ చేస్తాన‌ని.. ఉత్త‌మ్ కుమార్ ఆయ‌న బృందం వ‌స్తే.. తాను ఇంటిని చూపిస్తాన‌న్నారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో 16వ గ‌ది చూపిస్తే తాను నేల‌కు ముక్కు రాస్తాన‌ని.. తొమ్మిది గంట‌ల క‌ల్లా గ‌వ‌ర్న‌ర్ వ‌ద్ద‌కు వెళ్లి త‌న ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని స‌వాల్ విసిరారు.

ఒక‌వేళ‌.. 16వ గ‌దిని ప్ర‌గ‌తిభ‌వ‌న్‌ లో చూపించ‌ని ప‌క్షంలో ఉత్త‌మ్ కుమార్ రెడ్డి నేల‌కు ముక్కురాస్తారా? అని సూటిగా ప్ర‌శ్నించారు. గతంలోనూ తాను ఇదే రీతిలో స‌వాల్ విసిరితే ఉత్త‌మ్ అడ్ర‌స్ లేర‌ని.. మ‌రి.. ఈ రోజైనా త‌న స‌వాల్‌కు ఉత్త‌మ్ స్పందిస్తారా? అని ప్ర‌శ్నించారు. తాజా స‌వాల్ తో ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో 15 రూముల‌కు మించి లేద‌న్న భావ‌న‌ను క‌లుగ‌జేయ‌టంలో కేసీఆర్ స‌క్సెస్ అయ్యార‌ని చెప్పాలి. మ‌రి.. దీనిపై ఉత్త‌మ్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Tags:    

Similar News