ఇద్దరు చంద్రులు కలుస్తున్నారు.. రాజకీయ ప్రకంపనలే...?

Update: 2022-10-11 08:42 GMT
చాలా కాలానికి ఒకే చోటకు ఇద్దరు చంద్రులు  కలుస్తున్నారు. వారే టీడీపీ అధినేత చంద్రబాబు, తెలంగాణా సీఎం కేసీయార్. ఈ ఇద్దరు నేతలూ యూపీ టూర్ చేయనున్నారు. సీనియర్ నేత, ఎస్పీ లీడర్ ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలకు కేసీయార్ వెళ్తున్న సంగతి తెలిసిందే. ఇపుడు చంద్రబాబు టూర్ కూడా అక్కడికే అని ఫిక్స్ అయింది.

ఇలా ఇద్దరు చంద్రులూ యూపీలో ములాయం అంత్యక్రియల సందర్భంగా ఒకే చోట కలుసుకుంటున్నారు  మాట. ములాయంతో చంద్రబాబుకు సుదీర్ఘమైన రాజకీయ అనుబంధం ఉంది. 1996లో యునైటెడ్ ఫ్రంట్ కి చంద్రబాబు జాతీయ కన్వీనర్ గా పనిచేశారు. ఆ సమయంలో ములాయంతో ఆయనకు మంచి రిలేషన్స్ ఏర్పడ్డాయి.

ఒక దశలో చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పినపుడు ములాయంతో ఎన్నో భేటీలు వేసిన సందర్భాలు ఉన్నాయి. ఇద్దరూ మంచి మిత్రులు. ఇద్దరి ఎన్నికల గుర్తు కూడా సైకిల్ కావడం విశేషం. దాంతో తన చిరకాల మిత్రుడు ములాయం మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నట్లుగా చంద్రబాబు సంతాప సందేశంలో పేర్కొన్నారు. ఇపుడు ఆయన యూపీకి వెళ్ళి మరి కడసారి అంజలి ఘటిస్తున్నారు.

కేసీయార్ విషయం తీసుకుంటే ఆయన గత కొంతకాలంగా జాతీయ రాజకీయాల మీద దృష్టి ఉంచారు. ఆయన ఈ మధ్యనే కొత్త పార్టీని ప్రకటించారు. దాంతో ఆ సమావేశానికి ములాయం కుమారుడు, ఎస్పీ అధినేత అఖిలేష్ రావాల్సి ఉంది. అయితే ములాయం హెల్త్ బాగాలేక రాలేకపోయారు అని టీయారెస్ వర్గాలు చెప్పాయి. ఇలా ఎస్పీ పార్టీ నేతలతో కేసీయార్ సరికొత్త అనుబంధం కొనసాగిస్తున్నారు.

దాంతో ములాయం మరణవార్త విన్న వెంటనే ఆయన కూడా సంతాపం ప్రకటించడమే కాదు ఆయకు చివరి వీడ్కోలు ఇవ్వాలని యూపీకి ప్రయాణం అయ్యారు. ఇక్కడ చెప్పుకోవలసిన ముచ్చట ఒకటి ఉంది. ఏంటంటే ఇద్దరు తెలుగు చంద్రులు ఏపీ సరిహద్దులు దాటేసి  యూపీలో చాలా కాలానికి కలుసుకుంటున్నారు అన్న మాట.

ఏపీని రెండుగా విడకొట్టిన తరువాత చంద్రబాబు కేసీయార్ ల మధ్య అసలు మాటలు లేవు. ఈ ఇద్దరూ కూడా వేరుగానే ఉంటూ వస్తున్నారు. అలాంటి ఈ ఇద్దరిని దివంగత నేత  ములాయం కలపబోతున్నారా అన్న చర్చ కూడా వస్తోంది. రాజకీయాల్లో ఏదీ అసాధ్యం కాదు. దాంతో జాతీయ పార్టీని స్థాపించి ఏపీలో కాలు పెడదామని చూస్తున్న కేసీయార్ కి చంద్రబాబు తో అవసరాలు పడ్డాయని అంటున్నారు.

మరి జాతీయ పార్టీ గురించి చంద్రబాబుతో కేసీయార్ అక్కడ ఏమైనాఏకాంత చర్చలు జరిపే వీలు ఉందా అన్న డౌట్లు అయితే అందరికీ ఉన్నాయట. ఏది ఎలా ఉన్నా ఇద్దరు చంద్రులూ ఒకే చోట కలిసిన తరువాత మాటా మాంతీ జరగకుండా ఉండదు కదా అన్నదే అంతా అంటున్నారు. మరి ఆ మాటా మంతీ రాజకీయాల మీద మళ్ళితే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలోనూ అది ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉంది అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News