మాట్లాడింది కేసీఆరేనా?

Update: 2018-09-02 16:49 GMT
ప్రగతి నివేదన సభ.. తెలంగాణలో అధికార టీఆరెస్ నిర్వహించిన ఈ సభ గురించి కొద్ది రోజులుగా ఒకటే హైప్. 25 లక్షల మందితో సభ నిర్వహించాలన్నది ప్లాన్. అందుకోసం భారీ ఏర్పాట్లు. పైగా... కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్తారన్న ప్రకటన కూడా ఈ సభలోనే చేస్తారని అంతా ఊహించారు. కానీ - కేసీఆర్ ఈ సభలో మాట్లాడిన తీరు చూసినవారంతా అసలు మాట్లాడింది కేసీఆరేనా? అంటూ ఆశ్చర్యపోతున్నారు.
           
కేసీఆర్ ప్రసంగమంటే ప్రత్యర్థులు ముందే సిద్ధమైపోతారు. తమ పరువు పోవడం ఖాయమని వారు డిసైడైపోతారు. ఆయన మాటల్లోంచి ఏది హెడ్డింగుల్లో పెట్టుకోవాలో అర్థంకానంతగా పదుల సంఖ్యలో హెడ్డింగు అంశాలు దొరుకుతాయి. కానీ.. ఈ సభలో కేసీఆర్ మాట్లాడింది విన్నవారంతా ఈయన కేసీఆరేనా అనుకోవడం కనిపించిందంటే ఆయన ఉపన్యాసం ఎంత చప్పగా సాగిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
           
సాధారణంగా కేసీఆర్ సభ ఉంటే.. సభ ముగిశాక ఆయన ప్రసంగం గురించి మాట్లాడుకుంటారు.. ఎక్కడలేని ఉత్సాహం శ్రేణుల్లో కనిపిస్తుంది. కానీ.. ఈ సభ తరువాత పార్టీ శ్రేణుల్లో కొత్త భయం మొదలైంది. ముఖ్యంగా జనం రాకపోవడం టీఆరెస్ నేతలను భయపెడుతోంది. ప్రగతి నివేదన సభ వచ్చే ఎన్నికల ఫలితాలకు ముందస్తు సూచనా అన్న చర్చ కూడా ఆ పార్టీలో మొదలైంది. స్వయంగా కేసీఆర్‌ లోనే ఉత్సాహం కనిపించకపోవడంతో టీఆరెస్ నేతలు - శ్రేణులు డీలా పడ్డారు. ఇంతవరకు ఏదో రకంగా గట్టెక్కుతామని ధీమాగా ఉన్నవారు కూడా ఇప్పుడు టెన్షన్ పడుతున్నారని టాక్.
Tags:    

Similar News