ఐటీ.... చంద్రబాబు పీకిందీ లేదు... : కేసీఆర్

Update: 2018-12-29 16:26 GMT
"సైబర్ టవర్స్ కట్టింది చంద్రబాబు కాదు. దానికి పునాది వేసింది కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎన్. జనార్ధనరెడ్డి"
"హైదరాబాద్ కు స్వాభావిక, భౌగోళిక అనుకూలతల వల్లే ఐటీ పరిశ్రమ తరలి వచ్చింది తప్ప చంద్రబాబు నాయుడి వల్ల కాదు "
" ఐటీ కంపెనీలకు చెందిన వారు హైదరాబాద్ తమకు అన్ని రకాలుగా అనుకూలం అని నాటి ప్రధాని రాజీవ్ గాంధీకి చెప్పారు. ఆ విషయాన్ని నాటి ముఖ్యమంత్రికి రాజీవ్ గాంధీ చెప్పారు. అంతే కాని చంద్రబాబు చేసింది ఏమీ లేదు "

ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు.... తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు. వారం రోజుల పాటు వివిధ రాష్ట్రాల్లోను, దేశ రాజధాని ఢిల్లీలోనూ పర్యటించి హైదరాబాద్ వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు విలేకరుల సమావేశంలో చంద్రబాబు నాయుడి పై నిప్పులు చెరిగారు. చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడినా అవన్నీ అబద్ధాలేనని, ఆయన నిలువెల్లా మోసం చేసే వ్యక్తి అని కల్వకుంట్ల చంద్రశేఖర రావు దుయ్య బట్టారు. " చంద్రబాబు నాయుడికి ఇంగ్లీషు రాదు. హిందీ రాదు. ఆయన కేవలం మేనేజర్ మాత్రమే. పాలనాదక్షుడు కాదు" అని నిప్పులు చెరిగారు.
 
తెలంగాణలో తాను ప్రవేశ పెట్టిన కల్యాణ లక్ష్మి, రైతుబంధు వంటి పథకాలను అన్ని రాష్ట్రాలు అమలు చేయాలనుకుంటున్నాయని కేసీఆర్ అన్నారు.  తాను ప్రవేశ పెట్టిన పారిశ్రామిక విధానాన్ని చంద్రబాబు నాయుడు కాపీ కొట్టారని, చంద్రబాబు నాయుడికి ఏమీ తెలియదు అనడానికి ఇది పెద్ద ఉదాహరణ అని కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నారు. తాను ప్రతిపాదించిన ఆర్ధిక మండలి గురించి చంద్రబాబు నాయుడికి కనీసం తెలియదని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాను తాము ఎప్పుడూ వ్యతిరేకించలేదని, నిజానికి తమ నాయకులు కే.కేశవరావు, లోక‌్‌సభ నిజామాబాద్ సభ్యురాలు కవిత కూడా  ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారని కేసీఆర్ చెప్పారు. " ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాకు నేను వ్యతిరేకం అంటున్నారు.రికార్డులు చూసుకుంటే ఎవరు వ్యతిరేకమో తెలుస్తుంది. ఏపీ అభివ్రద్ధికి ప్రత్యేక హోదా అవసరం అని చెప్పింది మేమే " అని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకంట్ల చంద్రశేఖర రావు స్పష్టం చేశారు.
    

Tags:    

Similar News