‘తెలివి తక్కువ శత్రువులు..’ ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి కేసీఆర్ చేసిన కామెంట్ ఇదీ.. కాంగ్రెస్ సీనియర్ నేత దానం నాగేందర్ టీఆర్ఎస్ లో చేరిక సందర్భంగా ప్రతిపక్ష కాంగ్రెస్ ను కేసీఆర్ పోల్చిన విధానం చాలా సృజనాత్మకంగా ఉంది.
అవును.. కేసీఆర్ స్ట్రాటజీ ప్రకారం ప్రతిపక్షం అంటే రాజమౌళి సినిమాలోని విలన్ గా స్ట్రాంగ్ గా ఉండాలి. అప్పుడే హీరో వెలుగులోకి వచ్చేది. విలన్ సాదాసీదా గా ఉంటే ఆ హీరోకు పేరు రాదు.. సినిమా ఆడదు.. స్టూడెంట్ నెం 1 చిత్రం నుంచి ఇప్పటి బాహుబలి వరకూ రాజమౌళి సినిమాల్లో విలన్లే హీరోలు. అందుకే కేసీఆర్ కూడా తన తెలంగాణలో బలమైన శత్రువులు లేరని భావిస్తున్నారు. వారు గట్టిగా ఉంటేనే తనకు పేరు వస్తుందని ఆ కామెంట్ చేశాడు. అయితే ఈ విలన్లు పెరగకుండా చాలా జాగ్రత్తగా తెరవెనుక మంత్రాంగం నడుపుతున్నాడు.
దానం నాగేందర్ టీఆర్ ఎస్ లో చేరడం అనూహ్య నిర్ణయం.. హైదరాబాద్ లో సీనియర్ నేతగా ఉన్న దానం.. వైఎస్ హయాంలో కేసీఆర్ ను ముప్పుతిప్పలు పెట్టారు. పరుష విమర్శలు చేశారు. కానీ ఇప్పుడు అదే కేసీఆర్ పంచన చేరారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు - మిత్రువులు ఉండరు.. కేవలం రాజకీయావసరాలే ఉంటాయని దానం నిరూపించారు. తిట్టిన నోటితోనే కేసీఆర్ ను పొగుడుతూ టీఆర్ఎస్ లో చేరారు. అంతేకాదు వెళ్లిపోతూ కాంగ్రెస్ లో సామాజిక న్యాయం లేదని.. బీసీలకు పదవులు ఇవ్వడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ లో రెడ్డీ రాజ్యం కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.వెళ్లిపోయేవారు ఎలాగూ తిడతారు కాబట్టి కాంగ్రెస్ నేతలు కూడా దానం వైఖరిపై కౌంటర్లు ఇచ్చారు.
కేసీఆర్ మరోసారి ఓ తాజా సర్వే విషయం చెప్పారు. ఇందులో 82 అసెంబ్లీ స్థానాల్లో 60శాతానికి పైగా ప్రజలు టీఆర్ ఎస్ పక్షాన నిలుస్తున్నారని.. మరికొన్ని స్థానాల్లో 50శాతానికి మద్దతు ఇస్తున్నారని తెలిపారు. టీఆర్ ఎస్ అభ్యర్థులు 50 వేలు - 60వేల మెజార్టీతో గెలుస్తారని చెప్పాడు.
ఇక ప్రతిపక్ష కాంగ్రెస్ ను ఉద్దేశించి కేసీఆర్ చెప్పిన విశ్లేషణ ఆకట్టుకుంది. ‘కాంగ్రెస్ నేతలకు మాట్లాడే తెలివి లేదు.. వాళ్లలాంటి తెలివి తక్కువ శత్రువు ఉండడం వల్ల తమ వాళ్లు కూడా మొద్దుబారిపోతున్నారు’ అని కేసీఆర్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ అన్నట్టే కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్నారు. కేసీఆర్ ను ఎదుర్కొనేందుకు ధీటుగా నిలబడడం లేదు. తమలో తామే కొట్టుకుంటూ కేసీఆర్ కు పోటీనివ్వడం లేదు. అందుకే కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉండడం వల్ల తమ నేతలు కూడా అలసత్వం ప్రదర్శిస్తున్నాడని కేసీఆర్ అంటున్నారు. దానం నాగేందర్ చేరిక కూడా కాంగ్రెస్ పార్టీలోని అసంతృప్తికి నిదర్శనంగా కేసీఆర్ పేర్కొన్నారు.
ఇక రైతుబంధు సహా రైతు బీమాతో తెలంగాణ కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. వచ్చే రబీలో కూడా రైతుబంధం సాయం చేసి ఆ ఊపులోనే ముందస్తు ఎన్నికలకు వెళుదామని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. టీఆర్ఎస్ కు సానుకూల పవనాలు ఉన్నప్పుడే పోతే గెలవడం సాధ్యమని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే వచ్చే నవంబర్ లో ముందస్తు ఎన్నికల ముచ్చట చెప్పారు. మరి ఇప్పటికే కుమ్ములాటలతో కొట్టుకుంటున్న కాంగ్రెస్ నేతలు కేసీఆర్ ముందస్తు ఆలోచనలను పసిగట్టి రెడీ అవుతారో లేదో చూడాలి.