మోడీకి అమిత్‌ షా తీరుపై కేసీఆర్ ఫిర్యాదు

Update: 2017-07-27 16:35 GMT
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ - బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ మ‌ధ్య ఉన్న అనుబంధం గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌సరం లేదు. సీనియ‌ర్ బీజేపీ నేత‌లు ఇద్ద‌రు ఒకరి మాట ఒక‌రు విన‌రు. ఒక‌రి గురించి మ‌రొక‌రికి చెప్పే సాహ‌సం ఏ నాయ‌కుడు చేయ‌లేరు. అది కూడా వ్య‌తిరేకంగా అంటే చాన్సే లేదు. కానీ తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆ సాహ‌సం చేశారు. తాజాగా ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర మోడీతో స‌మావేశం సంద‌ర్భంగా అమిత్ షా గురించి ప్ర‌ధానికి ఫిర్యాదు చేశార‌ట‌. ఈ విష‌యాన్ని కేసీఆర్ స్వ‌యంగా వెల్ల‌డించారు.

ఢిల్లీ ప‌ర్య‌టన‌లో ఉన్న సీఎం కేసీఆర్ ఈ సంద‌ర్భంగా అక్క‌డి మీడియా మిత్రుల‌తో ముచ్చ‌టిస్తున్న సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ‌కు కేంద్రం సాయంపై అమిత్‌షా లెక్క‌ల్నీ తానెందుకు విమ‌ర్శించానో మోడీకి చెప్పానని కేసీఆర్ ఈ సంద‌ర్భంగా వివ‌రించారు. తాము 50వేల కోట్లు కేంద్రానికి ఇస్తుంటే, తిరిగి త‌మ‌కు 24వేల కోట్లు కేంద్రం నుంచి అందుతోందని వివ‌రించిన‌ట్లు కేసీఆర్ తెలిపారు. వ‌చ్చే 2019 ఎన్నిక‌లు, బీజేపీ ప‌రిస్థితిపై కేసీఆర్ స్పందిస్తూ వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీకి ఇప్పుడున్నంత సంఖ్యాబ‌లం రాక‌పోవ‌చ్చున‌ని తెలిపారు.  ఆ పార్టీ ముందు అనేక ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతాయని అన్నారు. త‌మిళ‌నాడు, కేర‌ళ‌లో బీజేపీ ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లేదని కేసీఆర్ విశ్లేషించారు. క‌ర్ణాట‌క‌, ఒరిస్సాల్లో బీజేపీ బాగా ప్ర‌య‌త్నం చేస్తోంది,  గెలుపు సుల‌భం కాదని తెలిపారు. తెలంగాణ‌లో బ‌ల‌ప‌డే ప‌రిస్థితి లేదని కేసీఆర్ తెలిపారు. ఏపీలో వారి ప్రయ‌త్నాలు జ‌రుగుతున్నాయని అన్నారు. ఏ ఒక్క వ‌ర్గాన్ని ఆక‌ట్టుకునే ప‌థ‌కాలేవీ కేంద్రం ఇంత‌వ‌ర‌కు తేలేదని, ఈ విష‌యాన్ని నేరుగా మోడీకే చెప్పాన‌ని అన్నారు. డీమానిటైజేష‌న్ ఫ‌లితాలేమిట‌న్న‌ది ప్ర‌శ్నార్థ‌కంగా మిగిలిందని కేసీఆర్ తెలిపారు. బ్లాక్ మ‌నీ మ‌ళ్లీ మార్కెట్‌లోకి వ‌చ్చిందని కేసీఆర్ అన్నారు. రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారంపై దాని ప్ర‌భావం క‌న‌ప‌డ‌లేదని విశ్లేషించారు. బ్యాంకుల నుంచి బ‌య‌టికొచ్చిన డ‌బ్బు తిరిగి బ్యాంకుల‌కు రావ‌డం లేదని తెలిపారు.

అసెంబ్లీ సీట్ల పెంపుపై కేసీఆర్ స్పందిస్తూ...ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోడీ మాట‌ల‌ను బ‌ట్టి అసెంబ్లీ సీట్ల పెంపు జ‌ర‌గ‌క‌పోవ‌చ్చున‌ని వ్యాఖ్యానించారు. 2024లో ఎలాగు పెరుగ‌తాయి క‌దా అని మోడీ అన్నారని కేసీఆర్ చెప్పారు. ఇప్పుడిది చేసినా అయిదేళ్ల స‌మ‌యం ప‌డుతుంద‌న్నారని దీంతో...అంటే అప్ప‌టివ‌ర‌కు లేన‌ట్టేనా అని మోడీని అడిగాన‌ని కేసీఆర్ వివ‌రించారు. అయితే త‌మ‌కు కూడా ఇదేమి ప్రాధాన్యత కాదని కేసీఆర్ అన్నారు. అందుకే దీన్ని చివ‌రి అంశంగా ప్ర‌ధానికి ఇచ్చిన లేఖలో చేర్చామ‌ని పేర్కొన్నారు. ఆంధ్రవారు అభ‌ద్ర‌త‌తో ఉన్నార‌న్న ప్ర‌చారం ఇప్పుడు తొల‌గిపోయిందని కేసీఆర్ అన్నారు. హైద‌రాబాద్‌లో ఇప్పుడు ఆంధ్రావారే మాకు పెద్ద బ‌లంగా త‌యార‌య్యారని కేసీఆర్ చెప్పారు. ముస్లింలు సైతం అభ‌ద్ర‌త వీడి ప్ర‌ధాన స్ర‌వంతిలోకి క‌ల‌వాలని కేసీఆర్ సూచించారు. ప్ర‌భుత్వం వారికి అన్ని స‌దుపాయాలు, సౌక‌ర్యాలు క‌ల్పిస్తోందని వివ‌రించారు. కోదండ‌రాం జిల్లాల ప‌ర్య‌ట‌న‌పై కేసీఆర్ స్పందిస్తూ ప్ర‌జాస్వామ్యంలో ఎవ‌రైనా జిల్లాలు తిరిగి ప్ర‌చారం చేసుకోవ‌చ్చున‌ని వ్యాఖ్యానించారు. వెంక‌య్య‌నాయుడు ఉప‌రాష్ట్ర‌ప‌తిగా వెళ్ల‌డం మ‌న‌కు న‌ష్ట‌మేన‌ని కేసీఆర్ అన్నారు. ద‌క్షిణాది గొంతు వినిపించే అవ‌కాశం పోయిందని కేసీఆర్ మీడియాతో చెప్పారు. మ‌న స‌మ‌స్య‌లు సుల‌భంగా వినిపించే వెసులుబాటు పోయిందని వ్యాఖ్యానించారు. ఆ స్థాయి నాయ‌కుడు ఎద‌గ‌డం ఇప్ప‌ట్లో క‌ష్ట‌మేన‌ని కేసీఆర్ అన్నారు.

ఆర్థికాభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే నెంబ‌ర్ వ‌న్‌గా ఉంద‌ని తెలిపారు. 27శాతం జీడీపీతో తెలంగాణ ముందంజ‌లో ఉంద‌ని, దేశాన్ని పోషిస్తున్న ఆరు రాష్ట్రాల్లో తెలంగాణ ఒక‌టని వివ‌రించారు.  జీఎస్టీ తెలంగాణలో వంద‌శాతం అమ‌ల్లోకి వ‌చ్చిందని కేసీఆర్ తెలిపారు. జీఎస్టీతో తెలంగాణ రెవెన్యూ పెరుగుతోందని అన్నారు. అనేక మంది వ్యాపారులు జీఎస్టీ ప‌రిధిలోకి వ‌చ్చారని అన్నారు. పారిశ్రామిక విధానం వ‌ల్ల స్వ‌ల్ప‌కాలంలోనే 4వేల పైచిలుకు ప‌రిశ్ర‌మ‌లొచ్చాయని తెలిపారు. మొద‌టి ప‌దినెల‌లు అధికారుల కేటాయింపుల‌కే స‌రిపోయిందని గుర్తు చేశారు. గ‌త రెండేళ్లుగా  ఆర్థికంగా సాధికార‌త‌తో ప్రణాళిక‌లు ర‌చించుకోగ‌లిగామ‌న్నారు. మిష‌న్ భ‌గీర‌థ ఈ ఏడాది చివ‌రిక‌ల్లా పూర్త‌వుతుందని తెలిపారు. స్థానికంగా పంచాయితీల్లో పైపులైన్లు వేసుకునేందుకు మూడునెల‌లు ప‌ట్టొచ్చన‌ని కేసీఆర్ వివ‌రించారు.

రైతు స‌మ‌స్య‌ల‌పై కేసీఆర్ స్పందిస్తూ...వ్య‌వ‌సాయం త‌ప్ప వేరే ఆదాయం లేని నిరాశ‌లో ఉన్నారని అన్నారు. వారిని ఆదుకునేందుకు అన్ని చ‌ర్యలు తీసుకుంటున్నామ‌ని తెలిపారు. ఎక‌రాకు ఎనిమిదివేలు పెట్టుబ‌డి ఇస్తున్నామ‌ని తెలిపారు. న‌కిలీ విత్త‌నాల ప‌నిపడుతున్నామ‌ని సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. ఇక ప్ర‌స్తుతం హాట్ టాపిక్‌గా మారిన డ్ర‌గ్స్ కేసుల ద‌ర్యాప్తుపై సీఎం కేసీఆర్ స్పందిస్తూ న‌కిలీ విత్త‌నాలు, క‌ల్తీ వ‌స్తువులపై త‌నిఖీల చేస్తున్న‌ప్పుడే డ్ర‌గ్స్ తీగ క‌దిలిందని తెలిపారు. తీగ‌లాగితే ఇప్పుడు డొంకంతా క‌దులుతోందని,  అంత‌ర్జాతీయ మాఫియా కూడా బ‌య‌టికొస్తోందని అన్నారు. హైద‌రాబాద్‌-ముంబై- పుణె- కోల్‌క‌తా-అహ్మ‌దాబాద్ లాంటి న‌గ‌రాల్లో  డ్ర‌గ్స్ క‌ల్చ‌ర్ ఉందని కేసీఆర్ వెల్ల‌డించారు. పెట్టుబ‌డిదారులు గోల్ఫ్ కోర్ట్స్‌... ప‌బ్స్‌... నైట్ క‌ల్చ‌ర్ ఉందా అని అడుగుతున్నారని కేసీఆర్ వివ‌రించారు. అయినా డ్ర‌గ్స్‌ను రూపుమాపులానే కంక‌ణం క‌ట్టుకున్నామ‌ని సీఎం కేసీఆర్‌ తెలిపారు.  అకున్ స‌భ‌ర్వాల్‌కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి ద‌ర్యాప్తు చేయ‌మ‌న్నామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఎంత‌టి వారున్నా ఈ కేసుల్లో వ‌దిలేది లేదని స్ప‌ష్టం చేశారు.

రెవెన్యూ వ్య‌వ‌స్థ‌లో  ప్రక్షాళ‌న చేయ‌డం పెద్ద స‌వాల్ అని కేసీఆర్ అంగీక‌రించారు. త్వ‌ర‌లోనే కొత్త టెక్నాల‌జీతో గ్రామీణ వ్య‌వ‌సాయ భూముల‌న్నీ డిజిటైజ్ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. లంచాల‌కు ఆస్కారం లేకుండా ఆన్‌లైన్ వ్య‌వ‌స్థ తీసుకొస్తామ‌ని ప్ర‌క‌టించారు. న‌గ‌రాల్లోని భూములు క‌బ్జా కాకుండా ఇదే ర‌క‌మైన వ్య‌వ‌స్థ తీసుకురాబోతున్నామ‌ని తెలిపారు. తెలంగాణ‌లో అంద‌రికీ ప్ర‌భుత్వ ఉద్యోగాలు క‌ల్పించ‌డం సాధ్యం కాదని స్ప‌ష్టం చేశారు. ఇప్ప‌టికే 60వేల ఉద్యోగాల నోటిఫికేష‌న్ ఇచ్చాం, మ‌రో 40 వేలు నింపుతామ‌ని కేసీఆర్ ప్ర‌క‌టించారు. ప్ర‌భుత్వోద్యోగుల‌కు ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సు పెంచేది లేదని కేసీఆర్ తెలిపారు. ఉపాధి పొందే  మార్గాల‌ను సృష్టించ‌డమే ప్ర‌భుత్వాల  బాధ్య‌త అని అన్నారు. హైద‌రాబాద్ లో రోడ్లు, నాలాల బాగుకు 12వేల కోట్లు అవ‌స‌రమ‌ని అన్నారు. నాలాల‌పైన అడ్డంగా 6వేల‌కు పైగా నిర్మాణాలు చేశారని, వాటిని తొల‌గించ‌డం త‌ల‌కు మించిన భారంగా మారిందని వివ‌రించారు. మెట్రోరైలు మ‌రో మూడునాలుగు నెల‌ల టైం ప‌ట్టొచ్చున‌ని కేసీఆర్ తెలిపారు. మెట్రో లైన్ రూప‌క‌ల్ప‌న‌లో ఎయిర్‌పోర్డును అనుసంధానించ‌క‌పోవ‌డం పెద్ద పొర‌పాటు అని వ్యాఖ్యానించారు.
Tags:    

Similar News