16 ఎమ్మెల్సీల భ‌ర్తీపై కేసీఆర్ న‌జ‌ర్!

Update: 2019-02-04 06:43 GMT
ఎన్నిక‌లే ఎన్నిక‌ల‌న్న‌ట్లుగా తెలంగాణ రాష్ట్రంలో ప‌రిస్థితి నెల‌కొంది. కేసీఆర్ తీసుకున్న సాహ‌సోపేత‌మైన నిర్ణ‌యంతో షెడ్యూల్ కంటే ముందు అసెంబ్లీ ఎన్నిక‌లు నిర్వ‌హించ‌టం.. అవి పూర్తి అయిపోయిన వెంట‌నే.. పంచాయితీ ఎన్నిక‌ల ప్ర‌క్రియ ముగియ‌టంతో.. ఇప్పుడు అంద‌రి దృష్టి ఎమ్మెల్సీ భ‌ర్తీల పై దృష్టి ప‌డుతోంది. సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు మ‌రో రెండు నెల‌ల గ‌డువు ఉన్న నేప‌థ్యంలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీల భ‌ర్తీపై ఆయ‌న దృష్టి సారిస్తార‌ని చెబుతున్నారు. దీనికి త‌గ్గ‌ట్లే ముఖ్య‌మంత్రి కేసీఆర్ క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్లు చెబుతున్నారు.

శాస‌న‌మండ‌లికి వివిధ ప‌ద్ద‌తుల‌తో ఎమ్మెల్సీల‌ను ఎంపిక చేసుకోవ‌టం తెలిసిందే. తాజాగా జ‌రిగే ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ప్ర‌త్య‌క్ష‌.. ప‌రోక్ష ప‌ద్ద‌తిలో ఎంపిక చేయ‌నున్నారు. 16 ఖాళీల్లో (మార్చిలో ఖాళీ అయ్యే వాటిని క‌లుపుకొని) ఉపాధ్యాయ‌.. ప‌ట్ట‌భ‌ద్ర నియోజ‌క‌వ‌ర్గాల్లో మొద‌ట ఎంపిక చేస్తార‌ని.. త‌ర్వాత మిగిలిన ఖాళీల‌ను భ‌ర్తీ చేసే అవ‌కాశం ఉందంటున్నారు.

మొత్తం 16 స్థానాల్లో ఎమ్మెల్యేల కోటాలో ఏడు.. స్థానిక సంస్థ‌ల నియోజ‌క‌వ‌ర్గాల నుంచి ఐదు.. ఉపాధ్యాయ స్థానాల నుంచి రెండు.. ప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గం ఒక‌టి కాగా.. గ‌వ‌ర్న‌ర్ కోటాలో మ‌రొక‌రిని ఎంపిక చేయ‌నున్నారు. మ‌రి.. ఇంత‌మంది అభ్య‌ర్థుల ఎంపిక విష‌యంలో కేసీఆర్ ఏం చేయ‌నున్నారు?  ఆయ‌న మ‌న‌సులో ఎవ‌రున్నారు? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. రెండు ద‌శ‌ల్లో అభ్య‌ర్థుల ఎంపిక ఉంటుంద‌ని చెబుతున్నారు.

+ ఉపాధ్యాయ నియోజ‌క‌వ‌ర్గాల‌కు పాతూరి సుధాక‌ర్ రెడ్డి.. పూల ర‌వీంద‌ర్ ల పేర్లు ప్ర‌క‌టించే వీలుంది. ర‌ఘోత్త‌మ‌రెడ్డిని పీఆర్టీయూ అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించినా.. ఆయ‌న్ను త‌ప్పించాల‌న్న ఆలోచ‌న‌లో టీఆర్ఎస్ ఉంది.

+ ప‌ట్ట‌భ‌ద్రుల స్థానానికి పోటీ ఎక్కువ‌గా ఉంది. మాజీ ఎమ్మెల్సీ స‌త్య‌నారాయ‌ణ‌.. గ్రూపు 1 అధికారుల సంఘం అధ్య‌క్షుడు చంద్ర‌శేఖ‌ర్ గౌడ్‌.. గుర్తింపు పొందిన పాఠ‌శాల‌ల యాజ‌మాన్య సంగం రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్వి యాద‌గిరి శేఖ‌ర‌రావు.. స‌రోజినిదేవి కంటి ఆసుప‌త్రి మాజీ సూప‌రింటెండెంట్ ర‌వీంద‌ర్ గౌడ్ రేసులో ఉన్నారు.

+ ఎమ్మెల్సీగా ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్న రాష్ట్ర హోంమంత్రిమ‌హ‌మూద్ అలీకి మ‌రో ట‌ర్మ్ అవ‌కాశం ఇవ్వ‌టం ఖాయం. న‌ల్గొండ ఎంపీ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డికి అవ‌కాశం ల‌భించ‌నుంది.

+ ఎమ్మెల్యేల కోటాలో స్వామిగౌడ్ కు మ‌రోసారి అవ‌కాశం ల‌భించ‌నుంది. కాని ప‌క్షంలో మ‌రో ప‌ద‌విని ఇచ్చి.. ఎమ్మెల్సీగా త‌న రాజ‌కీయ కార్య‌ద‌ర్శి శేరి సుభాష్ రెడ్డి.. ప్ర‌త్యేక అధికారిక దేశ‌ప‌తి శ్రీ‌నివాస్ ల‌కు అవ‌కాశం ఇవ్వ‌నున్నారు. ఎమ్మెస్ ప్ర‌భాక‌ర్ ఎస్సీ కోటాలో.. మైనార్టీ విభాగంలో మ‌హ్మ‌ద్ స‌లీంకు అవ‌కాశం ఇవ్వాల‌న్న ఆలోచ‌న‌లో టీఆర్ఎస్ నాయ‌క‌త్వం ఉన్న‌ట్లు చెబుతున్నారు.

+ అసెంబ్లీ మాజీ స్పీక‌ర్ మ‌ధుసూద‌నాచారి.. మాజీ మంత్రి చందూలాల్ లు త‌మ‌కు ఎమ్మెల్సీ అవ‌కాశం ఇవ్వాల‌ని కోరుతున్నారు. మాజీ స్పీక‌ర్ గా వ్య‌వ‌హ‌రించిన సురేశ్ రెడ్డిని ఎమ్మెల్సీ చేయాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు చెబుతున్నారు. ఒక‌వేళ అదే జ‌రిగితే స్థానిక సంస్థ‌ల కోటా నుంచి కానీ ఎమ్మెల్యేల కోటా నుంచి ఆయ‌న‌కు పైకి లాగే వీలుంది. వీరే కాక మాజీ మంత్రి రాములు.. ఇత‌ర జిల్లాల‌కు చెందిన త‌క్క‌ళ్ల ప‌ల్లి ర‌వీంద‌ర్ రావు.. మండ‌ల శ్రీ‌రాములు.. నంద‌కిశోర్.. వ్యాస్ బిలాల్ పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. పారిశ్రామిక‌రంగం నుంచి సుధీర్ రెడ్డికి అవ‌కాశం ఇవ్వాల‌న్న మాట వినిపిస్తోంది.

+ వీరే కాక మాజీ మంత్రిగా వ్య‌వ‌హ‌రించిన మ‌హేంద‌ర్ రెడ్డి.. అయితే చేవెళ్ల లోక్ స‌భ సీటు.. కాదంటే ఎమ్మెల్సీ సీటు ఇవ్వటం ఖాయ‌మంటున్నారు. వ‌రంగ‌ల్ స్థానిక‌సంస్థ‌ల స్థానం నుంచి కేటీఆర్ స‌న్నిహితుడు.. పార్టీ కార్య‌ద‌ర్శి పోచంప‌ల్లి శ్రీ‌నివాస్ రెడ్డికి ఎమ్మెల్సీ ప‌క్కా అంటున్నారు. కేటీఆర్ ఇప్ప‌టికే అభ‌యం ఇచ్చిన‌ట్లుగా తెలుస్తోంది. మ‌హిళా కోటా నుంచి మాజీ ఎమ్మెల్యేలు.. స‌త్య‌వ‌తీ రాథోడ్‌..  క‌విత‌.. కోవా ల‌క్ష్మీలు ప్ర‌య‌త్నాలు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. వీరిలో సీఎం ఎవ‌రికి ఛాన్స్ ఇస్తార‌న్న‌ది తేలాల్సి ఉంది.

Tags:    

Similar News