బాబు మీద కేసీఆర్ కు ఎంత నమ్మకమంటే..

Update: 2016-10-22 06:09 GMT
ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ శుక్రవారం విజయవాడకు వెళ్లారు. అధికారిక కార్యక్రమం కోసం ఆయన అక్కడకు వెళ్లినా.. అంతకు మించి ఏపీ ముఖ్యమంత్రితో ఆయన సుదీర్ఘంగా భేటీ కావటం అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించింది. దాదాపు రెండున్నర గంటలకు పైనే ఏకాంతంగా జరపటం అందరూ ఆసక్తిగా చూసేలా చేసింది. ఇంతకీ.. గవర్నర్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఏం మాట్లాడారు? అన్న సంశయం తొలిచేసింది.

సమావేశానికి సంబంధించిన అంశాలన్ని మొత్తంగా వివరించనప్పటికీ.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక విషయాన్ని మాత్రం స్పష్టంగా వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కోరినట్లుగా సచివాలయంలో తమకు కేటాయించిన భవనాల్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తామని.. సోదర రాష్ట్రంతో ఇచ్చి పుచ్చుకునే ధోరణిని ప్రదర్శించాలన్న వైఖరిని వెల్లడించారు. గవర్నర్ తో భేటీ ముగిసిన తర్వాత చంద్రబాబే స్వయంగా సచివాలయాన్ని అప్పగించే విషయాన్ని వెల్లడించటం గమనార్హం.

ఇదిలా ఉంటే.. ఇది జరుగుతున్న వేళకు కాస్త అటూఇటుగా.. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సహచర మంత్రివర్గ సభ్యులతో మాట్లాడిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. కొత్త సచివాలయాన్ని ఎలా నిర్మించాలన్న అంశంపై తన మనసులోని ఆలోచనల్ని పంచుకున్నారు. ఇప్పుడున్న వేళ.. సచివాలయాన్ని కొత్తగా ఎందుకు నిర్మించాల్సిన అవసరం ఉందన్న విషయంపై తన వాదనను సమర్థంగా వినిపించారు.

అయితే..సచివాలయాన్ని నిర్మించటానికి ఏపీ సర్కారు తనకు కేటాయించిన సచివాలయాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. మరి.. ఆ విషయంలో ఏపీ ప్రభుత్వం నుంచి అధికారిక సమాచారం బయటకు రాక ముందే.. కేసీఆర్ తన మంత్రి వర్గ సభ్యులతో సచివాలయ నిర్మాణంపై ధీమాగా మాట్లాడటం చూసినప్పుడు అనిపించేది ఒక్కటే. మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. ఏపీకి కేటాయించిన సచివాలయ భవనాల్ని తమకు తిరిగి ఇచ్చే విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందిస్తారన్న అంశంపై కేసీఆర్ కు నమ్మకం ఉన్నట్లుగా కనిపించక మానదు.

ఈ కారణంతోనే.. ఏపీకి కేటాయించిన భవనాల్ని తిరిగి ఇచ్చే విషయంపై ఏపీ సర్కారు తన అభిప్రాయాన్ని చెప్పే ముందే.. కేసీఆర్ లో కొత్త సచివాలయాన్ని తాను అనుకున్నట్లు పూర్తి చేస్తామన్న విశ్వాసం ఉండటం గమనార్హం. ఇదంతా చూసినప్పుడు అనిపించేది ఒక్కటే.. తాను పెట్టిన (ఏపీకి ఇచ్చిన సచివాలయాన్ని తెలంగాణకు తిరిగి ఇచ్చేయటం) ప్రపోజల్ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించటం ఖాయమన్న భరోసా ఉన్నట్లు కనిపించక మానదు. కేసీఆర్ మీద బాబుకు ఎలాంటి నమ్మకం ఉందో తెలీదు కానీ.. కేసీఆర్ కు మాత్రం చంద్రబాబు మీద చాలానే నమ్మకం ఉన్న విషయం తాజా ఉదంతం చెప్పకనే చెబుతుందని చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News