111 కాద‌ట 113లో గెలుపు ఖాయ‌మ‌ట‌

Update: 2017-05-29 04:51 GMT
కాన్ఫిడెన్స్ ఉండ‌టం త‌ప్పు లేదు. కానీ.. ఓవ‌ర్ కాన్ఫిడెన్స్‌తోనే ఇబ్బంది. తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ లో ఈ వైఖ‌రి చాలా ఎక్కువ‌గా క‌నిపిస్తోంద‌న్న మాట ప‌లువురి నోట బ‌లంగా వినిపిస్తోంది. ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు నిర్వ‌హించినా త‌మ పార్టీకి తిరుగులేని రీతిలో అధికారం ద‌ఖ‌లు ప‌డుతుంద‌న్న‌ది కేసీఆర్ ఉవాచ‌. ఇటీవ‌ల ఆయ‌న 119 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో స‌ర్వే నిర్వ‌హించ‌టం.. 111 స్థానాల్లో అధికారిక టీఆర్ఎస్ పార్టీ విజ‌యం సాధించ‌టం త‌థ్య‌మ‌న్న విష‌యం తేలింద‌ని కేసీఆర్ స్వ‌యంగా పేర్కొన‌టం తెలిసిందే.

ఈ స్థాయి గెలుపు సాధ్య‌మేనా? అన్న‌ది కేసీఆర్ స‌ర్వే ముచ్చ‌ట విన్న ప్ర‌తి ఒక్క‌రి మ‌న‌సులో మెదిలే సందేహంగా చెప్పొచ్చు. రాజ‌కీయాల్లో అసాధ్య‌మైన‌దంటూ ఏదీ ఉండ‌దు. ఇందుకు నిలువెత్తు నిద‌ర్శ‌నంగా ఆ మ‌ధ్య జ‌రిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌లుగా చెప్పొచ్చు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మోడీ ప్ర‌భ‌తో దేశ వ్యాప్తంగా తిరుగులేని రీతిలో విజ‌యం సాధించిన వేళ‌.. విజ‌యం మ‌త్తు బీజేపీకి నిండుగా ఆవ‌రించిన వేళ‌లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఢిల్లీ ఓట‌ర్లు ఇచ్చిన తీర్పుతో క‌మ‌ల‌నాథుల‌కు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది.

ఢిల్లీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మెజార్టీ సీట్ల‌ను సొంతం చేసుకొని ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌టం ఖాయ‌మ‌న్న ధీమాను ప్ర‌ద‌ర్శించిన బీజేపీ అధినాయ‌క‌త్వానికి ఢిల్లీ ఓట‌ర్లు ఇచ్చిన షాక్ అంతా ఇంతా కాదు. ఇక్క‌డ చెప్పేదేమంటే.. గెలుపు గురించి రాజ‌కీయ పార్టీలు స‌వాల‌చ్చ అనుకుంటాయి. కానీ.. తుది తీర్పు ఇచ్చేది మాత్రం ఓట‌ర్ల‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. ఈ ఎన్నిక‌ల ఫ‌లితాలు రాజ‌కీయ పార్టీల‌కే కాదు.. మీడియా సంస్థ‌ల‌కు పెద్ద గుణ‌పాఠాన్ని ఇచ్చింది. పైకి క‌నిపించే దానికి.. అంతిమంగా వ‌చ్చే ఫ‌లితానికి మ‌ధ్య అంత‌రాన్ని భారీగా చూపించిన ఈ ఎన్నిక త‌ర్వాత‌.. రాజ‌కీయాల్లో ఎప్పుడేమైనా జ‌రుగుతుంద‌న్న విష‌యాన్ని స్ప‌ష్టం చేసింది.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల అనుభ‌వాన్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే.. కేసీఆర్ స‌ర్వే చెప్పే విష‌యాలు అసాధ్య‌మైన‌వి ఎంత‌కూ కాదు. కానీ.. గ‌డిచిన మూడేళ్ల కేసీఆర్ పాల‌న‌లో తెలంగాణ ప్ర‌జ‌లు మొత్తంగా కేసీఆర్ వెంట ఉన్నార‌ని చెప్ప‌టం స‌రైన‌ది కాదు. ఆయ‌న‌పై వ్య‌తిరేక‌త కొంత ఉంది. అయిన‌ప్ప‌టికీ.. నేటికీ తెలంగాణ చాంఫియ‌న్ గా టీఆర్ ఎస్ ను పేర్కొన‌క త‌ప్ప‌దు. అలా అని కేసీఆర్ చెప్పిన‌ట్లుగా ఎన్నిక‌ల ఫ‌లితాలు ఏక‌ప‌క్షంగా వెలువ‌డే అవ‌కాశం ఉంద‌నుకోవ‌టం అత్యాశే అవుతుంది. చైత్యన్యాల పోరుగ‌డ్డ తెలంగాణ‌లో ప్ర‌జ‌లు చాలా యాక్టివ్ గా ఉంటార‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు. ఇలాంటి చోట 119 స్థానాల‌కు 111 స్థానాలు సొంతం చేసుకుంటామ‌ని చెప్ప‌టం అతి విశ్వాస‌మే అవుతుంది.

తాజాగా గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌ను క‌లిసిన సంద‌ర్భంగా ఆయ‌న‌తో మాట్లాడిన సీఎం, స‌ర్వే ఫ‌లితాల మీద త‌న అభిప్రాయాన్ని చెప్ప‌ట‌మే కాదు.. ఒక‌ద‌శ‌లో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని ఆయ‌న‌కు చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. మొత్తం 119 స్థానాల‌కు.. 111 స్థానాల్లో టీఆర్ఎస్ గెలుపు త‌థ్య‌మ‌న్న‌ది ఎలానో వివ‌రించిన కేసీఆర్‌.. ఒక ద‌శ‌లో టీఆర్ఎస్ గెలుపుకు అవ‌కాశం ఉన్న స్థానాల సంఖ్య‌ను మ‌రో రెండు పెంచి 113గా చెప్ప‌టం విశేషంగా చెప్పాలి. అయితే.. ఈ స‌మాచారం అధికారికంగా బ‌య‌ట‌కు రాన‌ప్ప‌టికీ.. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం 113 సీట్ల గెలుపు గురించి గ‌వ‌ర్న‌ర్ తో చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది.

గ‌వ‌ర్న‌ర్ తో కేసీఆర్ తాజా మాట వింటే ఆయ‌న కాన్ఫిడెన్స్ కు ముచ్చ‌ట ప‌డాల్సిందే. త‌న మాట‌ల‌తో ప్ర‌తిప‌క్షాల్లో భ‌యాన్ని పెంచ‌ట‌మే కాదు.. ఒత్తిడిలో ఉక్కిరిబిక్కిరి అయ్యేలా చేయ‌టం కేసీఆర్ కు మాత్ర‌మే సాధ్య‌మ‌ని చెప్పాలి. గ‌వ‌ర్న‌ర్ కు కేసీఆర్ చెప్పిన‌ట్లుగా 119 సీట్ల‌లో 113 సీట్ల గెలుపు లెక్క కాస్త ఆస‌క్తిక‌రంగా ఉంటుంద‌న్న‌ట్లే. ఎందుకంటే కేసీఆర్ చెప్పిన‌ట్లుగా 113 స్థానాల్లో విజ‌యం సాధించ‌టాలంటే.. పాత‌బ‌స్తీలో మ‌జ్లిస్ అడ్డాగా ఉన్న ఏడు స్థానాల్లో ఒక‌టి టీఆర్ ఎస్ ఖాతాలోకి రావాల్సి ఉంటుంది. అంతేనా.. తెలంగాణ‌లోని మిగిలిన రాజ‌కీయ పార్టీలేవీ ఖాతాలు తెరిచే అవ‌కాశమే ఉండ‌ద‌న్న మాట‌. ఆయా పార్టీల ముఖ్య‌నేత‌లు ఎవ‌రూ ఎన్నిక‌ల బ‌రిలో గెలిచే అవ‌కాశం లేద‌న్న విష‌యాన్ని తాను చేయించిన స‌ర్వే స్ప‌ష్టం చేసిన‌ట్లుగా చెప్ప‌టం కాస్తంత అతిశ‌యోక్తిగా ఉంద‌న‌టంలో సందేహం లేదు.

 ఇక‌.. గ‌వ‌ర్న‌ర్ తో చెప్పిన 113 స్థానాల మాట వింటే.. ఈ స‌ర్వే ఫ‌లితాలు ప్రతిప‌క్షాల్ని డిఫెన్స్ లో ప‌డేసి.. డిప్రెష‌న్ లో ప‌డేయాల‌న్నది కేసీఆర్ వ్యూహ‌మా అన్న‌ది ఇప్పుడు సందేహంగా మారుతోంది. 111 సీట్ల‌ను గెలుచుకుంటామ‌న్న కేసీఆర్ మాట‌కు భ‌గ్గుమ‌న్న విప‌క్షాలు.. తాజాగా 113 సీట్ల మాట‌కు మ‌రెంత ర‌గిలిపోతారో? ఈ ఫ‌లితాల మాట‌పై కేసీఆర్‌కు మిత్రుడైన మ‌జ్లిస్ ఎలా రియాక్ట్ అవుతుంద‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. మిత్రుడికి సైతం మంట పుట్టే మాట చెప్పిన కేసీఆర్ తీరు ఇప్పుడు తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ గా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News