కేసీఆర్ డెడ్‌లైన్ ఫ‌లితం ఇస్తోందా...ఆర్టీసీ కార్మికుల్లో మార్పు?

Update: 2019-11-04 05:55 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌క‌టించిన‌ డెడ్‌లైన్ ఆర్టీసీ కార్మికుల్లో క‌ల‌వ‌రానికి కార‌ణ‌మ‌వుతోందా? `మూడు రోజుల్లోగా విధుల్లో చేరండి లేదంటే..రూట్లు ప్రైవేటీక‌రిస్తాం` అనే ప్ర‌క‌ట‌న వారిలో వ‌ణుకు పుట్టిస్తోందా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. శ‌నివారం రాత్రి కేసీఆర్ విలేక‌రుల స‌మావేశం అనంత‌రం...ప‌రిస్థితుల్లో మార్పు వ‌చ్చింది. ఆదివారం ఉదయం నుంచే వివిధ డిపోలకు డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బంది వ‌చ్చి.. సమ్మె విరమించి విధుల్లో చేరేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ సమ్మతి పత్రాలను డిపో మేనేజర్లకు అందజేశారు.


సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌తో ఆదివారం ఉదయం కామారెడ్డి డిపోకు చెందిన డ్రైవర్ సయ్యద్ అహ్మద్ యూనిఫాంలో వచ్చి విధుల్లో చేరారు. డిపో మేనేజర్ అందుబాటులో లేకపోవడంతో డీవీఎం గణపతిరాజుకు సమ్మతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..సమ్మెవల్ల సామాన్య పేదకార్మిక కుటుంబాలే తీవ్రంగా నష్టపోతున్నాయని అన్నారు. విధుల్లో చేరకుండా తనపై యూనియన్ నేతలు ఒత్తిడి తెచ్చారని, కానీ.. ప్రాణాలకు తెగించి వచ్చానని చెప్పారు. యూనియన్ నాయకులంతా వారి సొంతలాభం కోసం వేలమంది కార్మికులను రోడ్డుకీడ్చారని ఆగ్రహం వ్యక్తంచేశారు. విలీనం సాధ్యంకాదని తెలిసినప్పటికీ ఇంకా సమ్మె పేరుతో కార్మికసంఘాలు తాత్సారం చేయడం వల్ల తమ జీవితాలు రోడ్డున పడుతున్నాయంటూ ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలుచేస్తున్న సీఎం కేసీఆర్.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే పరిస్థితి ఉంటే చేసేవారని అభిప్రాయపడ్డారు.

హైద‌రాబాద్‌లోని పెద్దఅంబర్‌పేట మున్సిపాల్టీ పరిధిలోని బండ్లగూడ ఆర్టీసీ డిపొలో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఎం సుశీల (స్టాఫ్ నంబర్ 213029) ఆదివారం విధులకు హాజరయ్యారు. స్వచ్ఛందంగా సమ్మెను విరమించుకుని బేషరతుగా విధులకు హాజరవుతానంటూ డిపో మేనేజర్ బాబునాయక్‌కు సమ్మతి పత్రం అందించారు. దానిని స్వీకరించిన డీఎం.. ఆమెను విధుల్లోకి తీసుకున్నారు. ఉప్పల్ డిపో ఫైనాన్స్ అసిస్టెంట్ మేనేజర్ కేశవకృష్ణ (స్టాఫ్ నంబర్ 201805)), మేడ్చల్ డిపో కండక్టర్ కే సత్యనారాయణ (213046) ఆయా డిపో మేనేజర్లకు సమ్మతి పత్రాలు అందించి, విధుల్లో చేరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల డిపోకు చెందిన ఒక కార్మికుడు విధుల్లో చేరేందుకు దరఖాస్తు చేసుకోగా.. డిపోమేనేజర్ శ్రీనివాస్ ఆయనను వెంటనే విధుల్లోకి తీసుకున్నారు. వరంగల్ రీజినల్ కార్యాలయంలో సూపరింటెండెంట్ (అసిస్టెంట్ మేనేజర్ క్యాడర్) గా పనిచేస్తున్న రాంమోహన్, వరంగల్ 1డిపో అసిస్టెంట్ మేనేజర్ సూర్యప్రకాశ్, వరంగల్-2 డిపో అసిస్టెంట్ మేనేజర్ వీరన్న, నర్సంపేట డిపో సూపర్‌వేజర్ శ్రీహరి, హన్మకొండ డిపో సూపర్‌వైజర్ రవీంద్ర.. తాము డ్యూటీలో చేరుతున్నట్టు డిపో మేనేజర్లకు లేఖలు అందించి.. విధులకు హాజరయ్యారు.

సమ్మె ప్రారంభించి 30 రోజులు కావస్తున్నా.. ఎలాంటి ఫలితం లేకపోవటం, సీఎం కేసీఆర్ స్ప‌ష్ట‌త‌తో కూడిన హెచ్చ‌రిక చేసిన నేప‌థ్యంలో కార్మికులు ఉద్యోగాల్లో చేరేందుకు సిద్ధపడుతున్నార‌ని స‌మాచారం. ఇదిలాఉంటే ఉద్యోగాల్లో చేరేందుకు ఆర్టీసీ కార్మికులు వస్తుండటంతో డిపోల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేశారు. విధుల్లో చేరే కార్మికులకు ఎవరైనా ఆటంకం కలిగించినా, అడ్డుకున్నా క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విధుల్లో చేరే కార్మికులకు పూర్తి భద్రత కల్పిస్తున్నారు. నిర్భయంగా ఉద్యోగాల్లో చేరే స్వేచ్ఛ ఆర్టీసీ ఉద్యోగులకు ఉన్నదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.
Tags:    

Similar News