ఫాంహౌస్ వ‌దిలేసి.. ఢిల్లీలో క‌స‌ర‌త్తేంది?

Update: 2018-12-26 09:56 GMT
తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ప‌దే ప‌దే రెండు విష‌యాల్ని ప్ర‌స్తావించేవారు. కాంగ్రెస్‌కు సంబంధించి ఏ నిర్ణ‌యం తీసుకోవాల‌న్న ఢిల్లీలోనేన‌ని.. ఇంకెన్నాళ్లు ఢిల్లీ గులాంగిరి అంటూ మండిప‌డ్డారు. పొర‌పాటున బాబుతో క‌లిసిన కూట‌మికి ఓటు వేస్తే.. తెలంగాణ‌ను అమ‌రావ‌తి నుంచి కంట్రోల్ చేస్తార‌ని.. తెలంగాణ పైస‌లు అమ‌రావ‌తికి వెళ‌తాయ‌న్న మాట‌ను చెప్పారు.

ఆ మాటల ప్ర‌భావ‌మో.. తెలంగాణ సెంటిమెంట్ మ‌హిమ కానీ.. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా 88 స్థానాల్లో గులాబీ కారు దూసుకెళ్లింది. ఎన్నిక‌ల వేళ‌.. ఢిల్లీ.. అమ‌రావ‌తి బూచి చూపించిన కేసీఆర్‌..ఈ రోజున మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌కు సంబంధించిన క‌స‌ర‌త్తును దేశ రాజ‌ధానిలో కూర్చొని చేస్తున్న‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి.

మ‌రి.. కూట‌మి గెలిస్తే.. ఢిల్లీ డిసైడ్ చేస్తుంద‌ని చెప్పి మ‌రీ.. ప్ర‌జ‌ల మ‌న‌సుల్ని త‌న వైపున‌కు తిప్పుకున్న కేసీఆర్‌.. ఇప్పుడీ రోజున తెలంగాణ‌లోని త‌న ఫాంహౌస్ ను వ‌దిలేసి.. ఢిల్లీలో కూర్చొని క‌స‌ర‌త్తు చేసుడేంది? అన్న‌ది క్వ‌శ్చ‌న్ గా మారింది.  ఎన్నిక‌ల వేళ‌.. స‌వాలచ్చ మాట‌లు చెబుతాం.. అన్నింటిని అలా సీరియ‌స్ గా తీసుకుంటామా? అంటే జ‌వాబు చెప్ప‌లేం.

ఏ మాట‌కు ఆ మాటే.. కేసీఆర్ ను చూసి నేర్చుకోవాల్సింది చాలానే ఉంది. ఏ బూచి చూపించి ఓట్లు దండుకున్నారో.. ఇప్పుడదే చోట కూర్చొని తెలంగాణ‌కు సంబంధించిన కీల‌క నిర్ణ‌యాలు తీసుకునే స‌త్తా కేసీఆర్‌కు మాత్ర‌మే సొంత‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News