బీజేపీతో యుద్ధమే.. డిక్లేర్ చేసిన కేసీఆర్.. ఎంతవరకు నమ్మొచ్చు?

Update: 2020-11-19 06:00 GMT
ఎప్పుడేం మాట చెబితే.. ఎలాంటి పొలిటికల్ రియాక్షన్ వస్తుందన్న విషయంపై గులాబీ బాస్ కేసీఆర్ కు ఉన్నంత అవగాహన తెలుగు రాష్ట్రాల్లో మరెవరికి లేదని చెప్పాలి. తాజాగా జరుగుతున్న గ్రేటర్ ఎన్నికల వేళ.. దూకుడు ప్రదర్శిస్తున్న బీజేపీకి చెక్ పెట్టేందుకు అవసరమైన సామాగ్రిని కేసీఆర్ సిద్దం చేసుకుంటున్నారు. అందులో భాగంగా తొలి స్టేట్ మెంట్ వచ్చేసింది. కేంద్రం తీరుపై తీవ్రఆగ్రహాన్ని ప్రదర్శిస్తూ.. బీజేపీతో యుద్ధమేనని ప్రకటించి సంచలనంగా మారారు. గ్రేటర్ ఎన్నికల వేళ.. బీజేపీ విశ్వసనీయత మొత్తం మోడీ చుట్టూనే తిరుగుతుంది.

మరి.. అలాంటి మోడీకే మంట పుట్టేలా మాట్లాడితే ఎలా ఉంటుంది? ఇప్పుడు కేసీఆర్ సరిగ్గా ఆ వ్యూహాన్నే తెర మీదకు తీసుకొచ్చారు. పార్టీ నేతలతో భేటీ అయిన కేసీఆర్.. ఈసారి జాతీయ రాజకీయాల మీద.. కేంద్ర ప్రభుత్వం తీరుపైనా నిప్పులు చెరిగారు. జాతీయ స్థాయిలో బీజేపీ విధానాల్ని.. మోడీ ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగట్టేందుకు కూటమి కడతానని ప్రకటించిన ఆయన.. అందులో భాగంగా కమ్యునిస్టులు మొదలు పలు పార్టీ నేతలతో మాట్లాడుతున్నట్లు వెల్లడించారు.

ఇందులో భాగంగా డిసెంబరు రెండో వారంలో ప్రాంతీయ పార్టీల నేతలతో కలిసి హైదరాబాద్ లో సమావేశాన్ని నిర్వహిస్తానని చెప్పారు. కేసీఆర్ తాజా వ్యాఖ్యలతో గ్రేటర్ ఎన్నికల్లో తమ ప్రధాన ప్రత్యర్థి బీజేపీ అన్న విషయాన్ని స్పష్టం చేశారని చెప్పాలి. మోడీ ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేసిన ఆయన.. ఇప్పటికే తాను పలువురు ప్రాంతీయ పార్టీ నేతలతో మాట్లాడానని.. వారంతా తన మాటలకు సానుకూలంగా స్పందించారన్నారు.

ఈ సందర్భంగా తాను మాట్లాడిన నేతల వివరాల్ని వెల్లడించారు. కుమారస్వామి.. శరద్ పవార్.. మమత.. కేజ్రీవాల్.. పినరాయ్ విజయన్.. స్టాలిన్.. అఖిలేశ్.. నవీన్ పట్నాయక్ ఉన్నట్లు చెప్పారు. మిగిలిన పార్టీ నేతలతో తాను త్వరలోనే మాట్లాడనున్నట్లు చెప్పారు. మన దేశ జీడీపీ శ్రీలంక.. బంగ్లాదేశ్ కంటే తక్కువగా ఉందని.. ఇదే కొనసాగితే నేపాల్ కంటే కూడా తక్కువగా వెళతామన్నారు.

దేశానికి సంపదనను సృషించాల్సిపోయి అమ్ముతున్నారని.. బీజేపీపై యుద్ధమేనని.. ఏడేళ్లుగా హైదరాబాద్ లో శాంతి భద్రతల సమస్య రాలేదని.. ఇప్పుడు అందుకు భిన్నంగా బీజేపీ కుట్రలు చేస్తుందన్నారు. విన్నంతనే ఘాటుగా ఉన్న కేసీఆర్ మాటల్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉందా? అంటే.. అవునని చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే.. తన ప్రయోజనాలకు ఇబ్బంది కలిగిన ప్రతిసారీ.. మోడీ మీదా.. కేంద్ర సర్కారు మీద విమర్శలు చేసే కేసీఆర్.. తర్వాత చప్పుడు చేయకుండా ఉండిపోవటాన్ని మర్చిపోకూడదు.

జాతీయస్థాయిలో కొత్త జట్టు కడతామని కేసీఆర్ చెప్పిన మాట ఇదే తొలిసారి కాదు. ఏడాదిన్నర క్రితం జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఇదే విషయాన్ని ప్రస్తావించటం.. ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక మళ్లీ ఆ ఊసు ఎత్తకపోవటాన్ని మర్చిపోలేం. గులాబీ నేతలు అంచనా వేస్తున్నట్లుగా వందకుపైగా సీట్లు తమ ఖాతాలో పడినా..90కి ఏ మాత్రం తగ్గకపోయినా కేంద్రంపై వార్ విషయంలో కేసీఆర్ కాస్త ఆలోచిస్తారని చెబుతున్నారు. మాటల్లో కనిపించే దూకుడు చేతల్లో చేసి చూపించాల్సిన అవసరం లేదన్న విషయం.. కేసీఆర్ గురించి తెలిసిన వారంతా చెప్పేదే. సో.. ఏం జరుగుతుందన్నది గ్రేటర్ ఫలితం డిసైడ్ చేస్తుందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News