కేసీఆర్ ఢిల్లీ టూర్ భారీ స‌క్సెస్ అంట‌..ఎలానంటే?

Update: 2018-08-06 05:38 GMT
ప్ర‌భుత్వం ఏం చెబితే దాన్ని అడ్డంగా న‌మ్మేయ‌టం.. వారు విడుద‌ల చేసిన ప్రెస్ నోట్ శిలాశాస‌నంగా మారిపోయి.. దాన్నే ప్ర‌సాదంగా భావించి కీర్తించే ద‌రిద్ర‌పు రోజులు రెండు తెలుగు రాష్ట్రాల్లో అంత‌కంత‌కూ ఎక్కువ అవుతున్నాయి. పాత్రికేయంలో ప్రాధ‌మిక‌మైన‌.. ఎప్పుడు.. ఎందుకు.. ఎక్క‌డ‌.. ఎలా? లాంటి ప్ర‌శ్న‌లు వేయ‌టం వ‌దిలేసి.. అధికార పార్టీకి భ‌జ‌న చేసేలా మీడియా సంస్థ‌లు మారిపోతున్న ప‌రిస్థితి.

అధికార‌ప‌క్షంపై ఇంత‌లా ఆడిపోసుకుంటారేంట‌న్న చిరాకును కొంద‌రు ప్ర‌ద‌ర్శిస్తుంటారు. కానీ.. అలాంటి వారంతా మ‌ర్చిపోయే అంశం.. మీడియా ప్ర‌తిప‌క్ష పాత్ర‌ను పోషించాల‌న్నది. త‌మ‌ను నిత్యం పొగ‌డాల‌ని.. ఆకాశానికి ఎత్తేయాల‌ని.. ఇంద్రుడు.. చంద్రుడు లాంటి ఉప‌మానాల‌తో ఉద‌ర‌గొట్టాలే కానీ.. సూటి ప్ర‌శ్న‌.. సునిశిత విమ‌ర్శ అస్స‌లు వ‌ద్దంటే వ‌ద్ద‌నే తీరు అంత‌కంత‌కూ ఎక్కువ అవుతోంది.

తాజాగా  తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ముచ్చ‌టే చూద్దాం. ఆయ‌న మూడు రోజుల ఢిల్లీ టూర్ సంద‌ర్భంగా ఏం సాధించారో ఎవ‌రికీ తెలీదు. త‌న టూర్ సంద‌ర్భంగా విలేక‌రుల స‌మావేశాన్ని నిర్వ‌హించింది లేదు. కానీ.. ప్రెస్ నోట్ మాత్రం భారీగా విడుద‌లైంది. కేసీఆర్ దౌత్యం ఫ‌లించింద‌ని.. ఉద్యోగ నియామ‌కాల‌కు సంబంధించిన ఆటంకాలు తొలిగిపోతున్నాయ‌ని.. రాష్ట్రంలో కొత్త జోన‌ల్ సిస్టంకు కేంద్రం ఓకే చెప్పేసిన‌ట్లుగా చెబుతున్నారు.

రెండు.. మూడు రోజుల్లో దీనికి సంబంధించిన అధికారిక ఉత్త‌ర్వుల‌ను కేంద్రం విడుద‌ల చేయ‌నున్న‌ట్లుగా చెబుతున్నారు. ఉమ్మ‌డి రాష్ట్రంలో ఆరు జోన్లు ఉంటే.. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత 5..6 జోన్లు తెలంగాణ‌కు వ‌చ్చాయి.

తెలంగాణ‌లో పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు మ‌రింత ద‌గ్గ‌ర చేసేందుకు వీలుగా జిల్లాల్ని పున‌ర్ వ్య‌వ‌స్థీక‌రించ‌టం తెలిసిందే. 10 జిల్లాలు కాస్తా 31 జిల్లాలుగా చేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. దీంతో.. ఉద్యోగ నియామ‌కాలు కొత్త జిల్లాల ప్ర‌కారం చేయాల్సి వ‌చ్చింది, ఇందులో భాగంగా ఏడు జోన్లు.. రెండు మ‌ల్టీజోన్లను ఏర్పాటు చేశారు.

రాష్ట్ర కేడ‌ర్ ను పూర్తిగా ర‌ద్దు చేయ‌టంతో పాటు.. స్థానిక యువ‌త‌కే 95 వాతం ఉద్యోగాలు ద‌క్కేలా మార్పులు చేశారు. కొత్త జోన‌ల్ వ్య‌వ‌స్థ‌కు అసెంబ్లీలో ఆమోదం తెలిపి.. కేంద్ర హోంశాఖ‌కు పంపారు. రాజ్యాంగంలోని 371డి అధిక‌ర‌ణ ప్ర‌కారం.. కొత్త జోన‌ల్ వ్య‌వ‌స్థ‌ను ఆమోదిస్తూ రాష్ట్రప‌తి తాజా ఉత్త‌ర్వులు జారీ చేయాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. అయితే.. దీన్ని ఆమోదించాల్సిన కేంద్రం.. త‌న‌కు అల‌వాటైన రీతిలో ఆపేసింది. దీంతో.. ఈ అంశాన్ని క్లియ‌ర్ చేసుకోవ‌టానికి న‌డుం బిగించిన కేసీఆర్‌.. ప్ర‌ధాని మోడీతో స‌హా ప‌లువురు కేంద్ర‌మంత్రుల్ని క‌లిశారు.

రాష్ట్రానికి సంబంధించి ప‌లు అంశాల్ని ప్ర‌ధాని మోడీతో మాట్లాడేందుకు కేసీఆర్ ఢిల్లీకి వెళ్ల‌టం తెలిసిందే. లోగుట్టుగా మాట్లాడుకున్న మాట‌లు ఇవేనంటూ ప‌లు అంశాలు తెర మీద‌కు వ‌స్తే.. దీనికి భిన్నంగా జోన‌ల్ వ్య‌వ‌స్థ‌కు ప్ర‌ధాని మోడీ ఓకే అన్న‌ట్లుగా ప్రెస్ నోట్ బ‌య‌ట‌కు వ‌చ్చి.. కేసీఆర్ గొప్ప‌త‌నాన్ని పొగిడేయ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. ఏమైనా.. కేసీఆర్ ను ఎత్తేయ‌ట‌మే ల‌క్ష్యంగా ప్ర‌భుత్వ యంత్రాంగ‌మే కాదు.. మీడియా కూడా అదే ప‌నిలో ఉండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.
Tags:    

Similar News