కేసీఆర్ ఢిల్లీ టూర్ ముహుర్తం డిసైడ్ అయ్యింది

Update: 2018-03-25 04:58 GMT
ఒక రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఢిల్లీకి వెళ్ల‌టం కూడా వార్తేనా? అంటే.. వాస్త‌వానికి అంత ఆస‌క్తిక‌ర‌మైన వార్త కాదు. కానీ.. ప్ర‌త్యేక ప‌రిస్థితుల నేప‌థ్యంలో కేసీఆర్ ఢిల్లీ టూర్ డేట్ ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. జాతీయ రాజ‌కీయాల్లో కీల‌క‌భూమిక పోషించాల‌ని త‌పిస్తున్న కేసీఆర్‌.. అందుకు త‌గ్గ‌ట్లే కార్యాచ‌ర‌ణ‌ను సిద్ధం చేసుకుంటున్నారు.

ఇప్ప‌టికే ప‌శ్చిమ‌బెంగాల్ కు వెళ్లి ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీతో భేటీ కావ‌టం తెలిసిందే.ఈ ప‌ర్య‌ట‌న అంత సానుకూల‌త వ్య‌క్తం కాలేద‌న్న మాట జోరుగా వినిపిస్తోంది. కాంగ్రెస్‌.. బీజేపీయేత‌ర కూట‌మికి సంబంధించి కీల‌క‌మైన పునాది త‌న ప‌శ్చిమ‌బెంగాల్ టూర్ తో మొద‌లైంద‌ని కేసీఆర్ చెప్పినా.. అంత సీన్ లేద‌న్న విష‌యం ఆ త‌ర్వాత చోటు చేసుకున్న ప‌రిణామాల‌తో పాటు.. మ‌మ‌తా బెన‌ర్జీ తీసుకున్న నిర్ణ‌యాలు చెప్ప‌క‌నే చెప్పేస్తున్నాయి.

బీజేపీకి వ్య‌తిరేకంగా జాతీయ స్థాయిలో జ‌ట్టు క‌డుతున్న వారికి మ‌ద్ద‌తు ప‌లుకుతూ.. తాను కూడా ఆ స‌మావేశానికి వ‌స్తాన‌ని చెప్ప‌టం ద్వారా కేసీఆర్ తోనే క‌లిసి న‌డ‌వాల‌న్న నియ‌మం ఏదీ దీదీ పెట్టుకోలేద‌న్న విష‌యం స్ప‌ష్ట‌మైంద‌ని చెప్పాలి. ఇలాంటి వేళ‌.. మ‌రిన్ని రాష్ట్రాల్లో ప‌ర్య‌టించి.. చివ‌ర్లో ఢిల్లీకి వెళ్లాల‌న్న ప్లాన్ ను కేసీఆర్ చేశారు. కానీ.. అందుకు భిన్నంగా చిన్న‌పాటి ఛేంజ్ చేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు.

తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు ముగిసిన వెంట‌నే ఢిల్లీకి వెళ్ల‌నున్నారు. వ‌చ్చే నెల (ఏప్రిల్ 3) ఢిల్లీకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 2న ఢిల్లీలో ప‌ద‌వీ విర‌మ‌ణ చేస్తున్న రాజ్య‌స‌భ స‌భ్యుల‌కు వీడ్కోలు స‌మావేశం ఉంది. ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యేందుకు ప‌లువురు జాతీయ పార్టీల నేత‌లు ఢిల్లీకి వ‌స్తున్నారు. అదే స‌మ‌యంల ఏప్రిల్ 4న కొత్త స‌భ్యుల ప్ర‌మాణ‌స్వీకార కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుంది. దీంతో.. ఒకే టూర్లో రెండు ముఖ్య‌మైన కార్య‌క్ర‌మాలు..  జ‌రుగుతుండ‌టంతో జాతీయ స్థాయికి చెందిన ప‌లువురు నేత‌లు ఢిల్లీకి వ‌స్తున్నారు.

దీంతో.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి సైతం ఢిల్లీ టూర్ ప్లాన్ చేసుకుంటున్నారు. అంద‌రూ ఢిల్లీలో ఉండేవేళ తాను కూడా ఢిల్లీ వెళితే.. వీలైనంత మందిని క‌ల‌వ‌టం.. వారితో త‌మ భావాల్ని షేర్ చేసుకోవ‌టానికి అవ‌కాశం ల‌భిస్తుంద‌ని కేసీఆర్ భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. దీంతో..

అంద‌రూ ఢిల్లీలో అందుబాటులో ఉండే అవ‌కాశం ఉండ‌టంతో కేసీఆర్ త‌న ఢిల్లీ టూర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. మ‌రో కార‌ణం కూడా ఆయ‌న్ను ఇప్ప‌టికిప్పుడు ఢిల్లీకి వెళ్లేలా చేస్తుంద‌ని చెబుతున్నారు. రాజ్య‌స‌భ‌కు కొత్త‌గా ఎన్నికైన త‌న ముగ్గురు స‌భ్యుల ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వానికి హాజ‌ర‌య్యేందుకు కేసీఆర్ ఆస‌క్తిని ప్ర‌ద‌ర్శిస్తున్నారు. దీనికి స‌ముచిత‌మైన కార‌ణం లేక‌పోలేదు.

ఇప్ప‌టివ‌ర‌కూ కేసీఆర్ పార్టీకి కేవ‌లం ముగ్గురు రాజ్య‌స‌భ స‌భ్యులు మాత్ర‌మే ఉండేవారు. మూడు.. అంత‌కంటే త‌క్కువ మంది స‌భ్యులున్న పార్టీని అద‌ర్ కేట‌గిరి కింద ఉంచుతారు. అదే స‌మ‌యంలో నాలుగు అంత‌కంటే ఎక్కువ నేరుగా పార్టీగా గుర్తిస్తారు. తాజాగా పెరిగి బ‌లంలో టీఆర్ఎస్ కు ఆరుగురు స‌భ్యులయ్యారు. దీంతో పార్టీగా గుర్తింపు ల‌భించ‌నుంది. అంతేకాదు..ఆ పార్టీని మొద‌టి వ‌రుస‌లో కూర్చునే అవ‌కాశం ఉంది.

ఈ నేప‌థ్యంలో కేసీఆర్ త‌మ రాజ్య‌స‌భ స‌భ్యుల ప్ర‌మాణ‌ స్వీకారోత్స‌వానికి హాజ‌ర‌య్యేందుకు సుముఖ‌త వ్య‌క్తం చేసిన‌ట్లుగా చెబుతున్నారు. ఆ మాత్రం ద‌ర్జా ప్ర‌ద‌ర్శించాల‌ని కేసీఆర్ భావించ‌టం త‌ప్పేం కాదు క‌దా?ఒక ప‌ట్టాన ఢిల్లీ వెళ్లేందుకు ఇష్ట‌ప‌డ‌ని కేసీఆర్‌.. తాజా ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వం సంద‌ర్భంగా ల‌భించే గౌర‌వాన్ని పొంద‌టానికి.. అధికార ద‌ర్జాను ప్ర‌ద‌ర్శించేందుకే ఢిల్లీ వెళుతున్నార‌న్న మాట కొంద‌రి నోట వినిపిస్తుండ‌టం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News