చుండూరులో డైలాగులతో అదరగొట్టేసిన కేసీఆర్.. మరి వీటికి ఆన్సర్ ఏమిటి?

Update: 2022-10-31 05:10 GMT
మాటలతో ఎంతటివారినైనా తన దారికి తెచ్చుకునే సత్తా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సొంతం. ఆయన మాటల మేజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన అనుకోవాలే కానీ.. అణాకాణికి కూడా పనికి రాని వ్యక్తిని సైతం అనూహ్యంగా అందలానికి ఎక్కించగలరు. తనతో పెట్టుకున్నోడు ఎవరైనా సరే.. ఎంతటి వారైనా సరే.. వారి సంగతిని మాటల్లోనే తేల్చేసే గుణం కేసీఆర్ సొంతం.

తమ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేల్ని డబ్బులు ఎర చూపించి.. తమ పార్టీలోకి చేర్చుకోవాలన్న బీజేపీ మధ్యవర్తుల వ్యవహారం బయటకు రావటం.. దీనికి సంబంధించిన ఆడియోలు విడుదలయ్యాయి. ఇలాంటివేళలో మునుగోడు నియోజకవర్గం పరిధిలోని చుండూరులో కేసీఆర్ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఎప్పటిలానే ఆయన తన రాజకీయ ప్రత్యర్థులని తన మాటలతో ఉతికి ఆరేసినంత పని చేశారు.

అయితే.. ఇక్కడ వచ్చిన చిక్కేమంటే.. కేసీఆర్ చెప్పిన మాటల్ని యథాతధంగా బుర్రలోకి ఎక్కించేసుకుంటే.. ఆయన చెప్పినవన్ని నిజాలుగానే కనిపిస్తాయి. కానీ.. తర్కం అనే చిన్న అంశాన్ని పట్టుకొని కేసీఆర్ మాటల్ని వింటే బుర్రకు తట్టే డౌట్లు బోలెడుగా కనిపిస్తాయి. అలాంటి వేళలోనే.. ఆయన మాటల్లోని డొల్లతనం ఇట్టే కనిపిస్తుందన్న మాట వినిపిస్తోంది. శాంపిల్ గా ఆయన నోటి నుంచి వచ్చిన మాటల్ని చూస్తే.

కేసీఆర్ మాట... పెట్రోల్.. డీజిల్ ధరలు పెంచింది ఎవరు?

- కేంద్రంలోని మోడీ సర్కారు పెంచింది. మరి.. చేతిలో ఉన్న పన్నుల శాతాన్ని తగ్గించి తెలంగాణ న్రజలు కాసింత ఉపశమనాన్ని కలిగించొచ్చు కదా? అందులోకి తెలంగాణ ధనిక.. సంపన్న రాష్ట్రం కదా? ఆ మాత్రం పెద్ద మనసు కేసీఆర్ కు ఎందుకు రావట్లేదు. ఎంతసేపటికి కేంద్రం గురించి మాట్లాడే కేసీఆర్.. తన చేతిలో ఉన్న పన్ను తగ్గింపు గురించి ఎందుకు మాట్లాడరు?

కేసీఆర్ మాట.. బీజేపీ ఢిల్లీ బ్రోకర్లు తెలంగాణ ఆత్మగౌరవాన్నే కొందామని వచ్చి.. చంచల్ గూడ జైల్లో ఉన్నారు.

నిజమే.. ఎమ్మెల్యేల్ని కొనే వారు ఎవరైనా సరే.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొన్నట్లే అనుకుంటే.. మరి.. ఎర వేసిన నలుగురు ఎమ్మెల్యేల్లో ముగ్గురు ఎమ్మెల్యేలు ఏ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు? మరి.. వారు తమ పదవులకు రాజీనామా చేసి టీఆర్ఎస్ లోకి చేరారా? లేదంటే.. టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారేనా? కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచిన వారే కదా? మరి.. వారిని కొనుగోలు చేసిన టీఆర్ఎస్ పార్టీ.. దానికి నాయకత్వం వహించిన కేసీఆర్ ఏమనాలి?

కేసీఆర్ మాట.. రాష్ట్రంలో పండిన ధాన్యం కొనాలని కేంద్రాన్ని అడిగితే కొనలేదు. కానీ.. రూ.100 కోట్లతో ఎమ్మెల్యేలనను కొనడానికి దుర్మార్గులు వచ్చారు.

-  ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయమని అడిగితే చేయలేదని అంటున్న కేసీఆర్.. రూ.100 కోట్లతో ఎమ్మెల్యేలను కొనాలన్న ప్లాన్ తో వచ్చారని చెబుతున్నారు. మరి.. అంత భారీగా కొనుగోలు చేయటానికి వచ్చినోళ్లు అడ్వాన్సుగా ఎంత మొత్తాన్ని తీసుకొచ్చారు? ఇంతకీ ఆ మొత్తం ఎక్కడ ఉంది? అదేమీ లేకుండా రూ.100 కోట్ల ఆరోపణలు ఎలా బయటకు వచ్చాయి?
కేసీఆర్ మాట.. ఎంపీలు.. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాలను కూల్చాలని చూస్తున్నారు.

-  అదే నిజమని అనుకుందాం. మరి.. తెలంగాణ వచ్చినప్పుడు తెలంగాణలో టీడీపీ.. కాంగ్రెస్.. బీజేపీ.. సీపీఎం.. సీపీఐ.. బీజేపీ.. వైసీపీ కూడా ఉండేవి. మనారి.. 2018 ఎన్నికల నాటికి వైసీపీ పూర్తిగా మాయమైతే.. మిగిలిన పార్టీల సంగతి అందరికి తెలిసిందే. 2014లో ఉన్న పార్టీలకు.. 2018 నాటికి తెలంగాణలో ఉన్న పార్టీలునన ఎన్ని? వాటిల్లో ఉన్న నేతలు ఎందరు? ఇప్పుడు ఆ నేతల్లో ఎంతమంది ఉన్నారు? తెలంగాణ అధికారపక్ష్ంలో ఎంతమంది ఉన్నారు? అసలు తెలంగాణ వచ్చిన తర్వాత మాయమైన పార్టీలు.. ఆచూకీ లేకుండాపోయిన పార్టీల మాటేమిటి? అలా ఎందుకు జరిగింది? అన్న విషయాన్ని కేసీఆర్ మాటల నేపథ్యంలో కాస్తంత గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. కాదంటారా?


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News