ఆయ‌న మంత్రి ప‌ద‌వికి ఎస‌రు..? అపాయింట్ మెంట్ కూడా ఇవ్వ‌ని సీఎం!

Update: 2021-04-09 04:42 GMT
త్వ‌ర‌లో తెలంగాణ‌లో మంత్రివ‌ర్గ పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ జ‌ర‌గ‌బోతోందనే ఊహాగానాలు వినిపిస్తున్న విష‌యం తెలిసిందే. నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక త‌ర్వాత ఈ విష‌య‌మై కేసీఆర్ దృష్టి పెట్ట‌బోతున్నార‌ని, మొత్తం ముగ్గురిని సాగ‌నంప‌బోతున్నార‌నే ప్ర‌చారం కూడా సాగుతోంది. అయితే.. ఆ ముగ్గురు ఎవ‌రు అనే విష‌యంలో ర‌క‌ర‌కాల పేర్లు తెర‌పైకి వ‌స్తున్నాయి. తాజాగా.. ఓ మంత్రి వ్య‌వ‌హారం తీవ్ర చ‌ర్చ‌కు దారితీయ‌డంతో ఆయ‌న ప‌ద‌వి ఉంటుందా? ఊడుతుందా? అనే చ‌ర్చ సాగుతోంది.

ఇటీవ‌ల ఓ మంత్రి రియ‌ల్ట‌ర్ ను బెదిరించార‌నే వార్త గుప్పుమంది. అంతేకాదు.. మంత్రి బెదిరించార‌ని చెబుతున్న ఆడియో కూడా స‌ర్క్యులేట్ అవుతోంది. అయితే.. ఈ విష‌యం అటూ ఇటూ తిరిగి ముఖ్య‌మంత్రి వ‌ద్ద‌కు సైతం వెళ్లింద‌ని, దీనిపై సీఎం సీరియ‌స్ గా ఉన్నార‌ని ప్ర‌చారం సాగుతోంది. అయితే.. ఈ విష‌య‌మై కేసీఆర్ కు వివ‌ర‌ణ ఇచ్చేందుకు ప్ర‌య‌త్నించార‌ట స‌ద‌రు మంత్రి. కానీ.. సీఎం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వ‌లేద‌ని తెలుస్తోంది. ఓ సారి ఎర్ర‌వ‌ల్లిలోని ఫాం హౌస్ కు, మ‌రోసారి ప్ర‌గ‌తి భ‌వ‌న్ కు వెళ్లార‌ని, కానీ.. సీఎంను క‌లిసే ఛాన్స్ రాలేద‌ని స‌మాచారం. క‌నీసం స‌ద‌రు మంత్రిని లోనికి కూడా పిల‌వలేద‌ని, దీంతో.. బ‌య‌టి నుంచే వెళ్లిపోయార‌ని తెలుస్తోంది.

ఇదిలాఉంటే.. గ‌తంలోనూ స‌ద‌రు మంత్రిపై ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. భూ క‌బ్జాల‌తోపాటు అధికారుల‌ను బెదిరిస్తున్నార‌ని కూడా ప్ర‌చారం సాగింది. తాజాగా.. రియ‌ల్ట‌ర్ ను బెదిరించార‌న్న ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో సీఎం కేసీఆర్ ఆగ్ర‌హంగా ఉన్నార‌నే ప్ర‌చారం సాగుతోంది. ఈ క్ర‌మంలో ఆయ‌న మంత్రి ప‌ద‌వికూడా ఊడిపోయే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. ఈ మేర‌కు కేసీఆర్ డిసైడ్ అయ్యార‌ని, అందువ‌ల్లే ఆయ‌న‌కు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వ‌లేద‌ని చెబుతున్నారు.

ఈ నెల 27న పార్టీ ఆవిర్భావ దినోత్స‌వాన్ని ఘ‌నంగా నిర్వ‌హించిన త‌ర్వాత మంత్రి వ‌ర్గ ప్ర‌క్షాళ‌న‌పై సీఎం నిర్ణ‌యం తీసుకుంటార‌ని తెలుస్తోంది. దీంతో.. మంత్రి ప‌ద‌వి ఆశిస్తున్న‌వారు త‌మ ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసిన‌ట్టు తెలుస్తోంది. వీరిలో కౌన్సిల్ చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి, ఖ‌మ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి, జ‌డ్చెర్ల ఎమ్మెల్సీ ల‌క్ష్మారెడ్డి, హ‌న్మ‌కొండ ఎమ్మెల్యే దాస్యం విన‌య్ భాస్క‌ర్ తోపాటు బాల్క సుమ‌న్ కూడా రేసులో ఉన్న‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. అయితే.. కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ  క‌విత‌ను, మ‌రో ఎమ్మెల్సీ సుర‌భి వాణిని కేబినెట్లోకి తీసుకునే అవ‌కాశం కూడా ఉంద‌ని ప్ర‌చారం సాగుతోంది. మ‌రి, ఏం జ‌రుగుతుంద‌న్న‌ది చూడాలి.
Tags:    

Similar News