అన్నా.. వరదొస్తే మీ ఇల్లు మునుగుతుందేమో..?

Update: 2015-12-15 05:02 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి చాలా సునిశితంగా ఉంటుంది. అన్ని విషయాల్ని ఆసక్తిగా పరిశీలిస్తుంటారు. ఆ మధ్యలో ఇద్దరు చంద్రుళ్లు భేటీ అయిన సందర్భంలో.. ఏపీ రాజదానికి అమరావతి ప్రాంతం అనువని చెప్పటమే కాదు.. వాస్తుకోణంలో ఎలాంటి లబ్థి చేకూరుతుందో వివరించటం తెలిసిందే. అలాంటి కేసీఆర్.. చంద్రబాబు నాయుడి ఇంటికి వెళితే.. అన్ని సంగతులు చూడకుండా ఉంటారా? అయుత చండీయాగానికి ఆహ్వానించటం కోసం సోమవారం బెజవాడ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏపీ సీఎం బాబును.. కేసీఆర్ ఆసక్తికరమైన ప్రశ్నను సంధించారు.

వరద వస్తే.. చంద్రబాబు ఇల్లు మునుగుతుందేమోనన్నది కేసీఆర్ సందేహం. దీనికి సముచితమైన కారణం లేకపోలేదు. హెలికాఫ్టర్ లో ఉండవల్లిలోని బాబు ఇంటి సమీపంలో హెలికాఫ్టర్ లో దిగిన కేసీఆర్.. ఆకాశం నుంచి చూసినప్పుడు కృష్ణా నది నిండుగా ఉన్నట్లుగా అనిపించింది. ఇప్పుడే ఇలా ఉంటే.. వర్షాలు.. భారీ వర్షాలు కురిసి.. వరద ఎక్కువగా ఉనప్పుడు సంగతేంటన్న సందేహం కలిగింది. అదే విషయాన్ని బాబు దగ్గర ప్రస్తావిస్తూ.. ‘‘అన్నా.. నేను హెలికాఫ్టర్ లో వస్తూ చూశాను. మీ ఇంటి వద్ద నదిలో నీళ్లు నిండుగా ఉన్నట్లు అనిపించింది. ఈ కాలంలోనే ఇలాఉంటే.. వరదల్లాంటివి వస్తే మీ ఇల్లు మునగవా?’’ అని ప్రశ్నించారు.

దీనికి బాబు సమాధానం చెబుతూ.. అలాంటి ఇబ్బంది ఉండదని.. ఆ జాగ్రత్తలు తీసుకున్నట్లు వెల్లడించారు. పై నుంచి చూసినప్పుడు నది నిండుగా ఉన్నట్లు అనిపిస్తుందని.. కానీ అది నిజం కాదంటూ.. ‘‘వీటీపీఎస్ థర్మల్ విద్యుత్తు కేంద్రం అవసరాల కోసం నదిలో ఆ మాత్రం నీటి మట్టం ఉండాలి. లేకుంటే.. వీటీపీఎస్ ఆగిపోతుంది. గడిచిన వందేళ్లలో వచ్చిన వరద లెక్క తీసి.. అత్యధికానికి యాభై శాతం ఎక్కువ  వరద వచ్చినా సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నాం’’ అని వివరించటంతో కేసీఆర్ సమాధాన పడ్డారు. విషయాల్ని తనదైన కోణంలో చూసే కేసీఆర్ కు.. బాబు ఇంటి మీద వచ్చిన సందేహం లోతైనదే.
Tags:    

Similar News