కేసీఆర్ కు త‌ల‌కొట్టేసే అవ‌మానాలెన్నో!

Update: 2017-05-20 05:53 GMT
రాజ‌కీయ నాయ‌కుడు క‌ర‌డుగ‌ట్టినట్లు ఉంటారంటారు. భావోద్వేగాలు అధికంగా ఉండే మ‌నిషి ముఖ్య‌మంత్రి అయితే రాష్ట్రానికి క‌లిగే ప్ర‌యోజ‌నం ఎంత‌న్న‌ది కేసీఆర్‌ ను చూస్తే ఇట్టే అర్థ‌మ‌వుతుంది. ఉద్య‌మ నాయ‌కుడు కావ‌టం.. తాను అమితంగా ప్రేమించే రాష్ట్రాన్ని.. రాష్ట్ర ప్ర‌జ‌ల్ని త‌క్కువ చేసిన‌ట్లుగా మాట్లాడార‌న్న భావ‌న సైతం త‌న‌ను ఎంత భ‌గ‌భ‌గ‌లాడేలా చేస్తుందో తెలుసా? అంటూ కేసీఆర్ మాట‌ల్ని విన్న‌ప్పుడు ముచ్చ‌ట వేస్తుంది.

త‌న‌కు ఎదురైన అవ‌మానాల గురించి.. త‌ల కొట్టేసిన సంద‌ర్భాల గురించి చెప్పుకొచ్చిన ఆయ‌న మాట‌లు విన్న‌ప్పుడు.. క‌లిగే భావ‌న ఒక్క‌టే. కేసీఆర్ కానీ ఫీల్ అయితే.. తెలంగాణ రాష్ట్రానికి మంచి జ‌ర‌గ‌టం ఖాయ‌మ‌నిపిస్తుంది. ఎందుకంటే.. ఒక్క‌సారి మాట ప‌డిన‌ట్లుగా ఫీల్ అయితే.. ఆ ఇష్యూను సెట్ చేసేంత‌వ‌ర‌కూ నిద్ర పోని గుణం అంద‌రి ముఖ్య‌మంత్రుల‌కు ఉండ‌దు. తాను సింగ‌పూర్ లో ప‌ర్య‌టించిన సంద‌ర్భంగా అక్క‌డి పోలీసు ప్ర‌ధాన కార్యాల‌యానికి వెళ్లాన‌ని.. అక్క‌డి ప్ర‌తినిధి మాట్లాడుతూ.. "మిస్ట‌ర్ రావు.. మా దేశంలో మ‌హిళ‌లు అర్థ‌రాత్రి రోడ్ల‌పై తిరిగి.. స్వేచ్ఛ‌గా ఇంటికి చేరుకోగ‌ల‌రు. మీ తెలంగాణ‌లో ఇది సాధ్య‌మేనా?" అని అడిగారు అని చెప్పారు. తాను త‌ప్పించుకోలేక‌.. ఆ దిశ‌గా ప్ర‌య‌త్నాలు చేస్తున్నామ‌ని.. చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని చెప్పాన‌ని.. ఆ స్ఫూర్తితోనే తాను షీ టీమ్స్ ను ఏర్పాటు చేసిన‌ట్లుగా వెల్ల‌డించారు.

స్వాతి ల‌క్రా నేతృత్వంలో షీ టీమ్స్ అద్భుతంగా ప‌ని చేస్తున్న‌ట్లుగా చెప్పిన కేసీఆర్ మ‌రో ఉదంతాన్ని ప్ర‌స్తావించారు. నాస్కామ్ ప్ర‌తినిధుల‌తో ఒక మీటింగ్ జ‌రిగిన‌ప్పుడు నకిలీ స‌ర్టిఫికెట్లు.. ఇంజ‌నీరింగ్ కాలేజీల మీద చ‌ర్చ జ‌రిగింద‌ని.. దేశ వ్యాప్తంగా వంద న‌కిలీ స‌ర్టిఫికెట్లు వ‌స్తుంటే.. ఒక్క హైద‌రాబాద్ నుంచే 80 వ‌స్తున్నాయ‌ని.. అందుకు క్యాంప‌స్ రిక్రూట్ మెంట్లు నిలిపివేస్తామ‌ని చెప్పార‌న్నారు. "వారి మాట‌లు త‌ల కొట్టేసినంత‌గా బాధ ప‌డ్డా. అవ‌మానంగా భావించా. ఆ త‌ర్వాతే న‌కిలీల‌పై చ‌ర్య‌లు తీసుకున్నాం" అని చెప్పారు. రాజ‌కీయంగా ప్ర‌త్య‌ర్థుల్ని క‌ట్ట‌డి చేయ‌టంలో కేసీఆర్ అనుస‌రించే తీరు అభ్యంత‌ర‌క‌రంగా ఉండొచ్చు. కానీ.. రాష్ట్రం విష‌యంలో ఆయ‌న తీరు మాత్రం కాస్త భిన్న‌మ‌ని చెప్పాలి. ద‌ళ‌స‌రిగా మారిన చ‌ర్మంతో సున్నితత్వం అంటూ క‌నిపించ‌ని పాల‌కులు ఉన్నట్లుగా చెప్పే చోట‌.. కేసీఆర్ లాంటి సున్నిత మ‌న‌స్కుడు ముఖ్య‌మంత్రి స్థానంలో ఉండ‌టం తెలంగాణ‌కు కొంత‌మేర లాభం జ‌రుగుతుంద‌న‌టంలో సందేహం లేద‌నే చెప్పాలి. నిజానికి.. దేశ రాజ‌కీయాల్లోకి ఈ త‌ర‌హా నాయ‌కుల అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News