ఈసీని లాగి త‌ప్పించుకోవాల‌నుకుంటున్నారా?

Update: 2021-10-26 11:30 GMT
తెలంగాణ‌లో రాజ‌కీయ వేడిని ర‌గిల్చిన హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్ర‌చారానికి అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ వ‌స్తార‌ని.. త‌మ అభ్య‌ర్థి త‌ర‌పున ప్ర‌చారం చేసి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతార‌ని.. పార్టీ విజ‌యానికి ఆయ‌న ప్ర‌చారం కీలకంగా మారుతుంద‌ని భావించిన టీఆర్ఎస్ పార్టీ నాయ‌కులకు ఇప్పుడు నిరాశే ఎదురైంది. కేసీఆర్ ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్ర‌చారానికి ఆయ‌నే వెళ్ల‌డం లేద‌నే విష‌యం దాదాపుగా స్ప‌ష్ట‌మైంది. టీఆర్ఎస్ ప్లీన‌రీ సంద‌ర్భంగా ఈ ఉప ఎన్నిక నేప‌థ్యంలో బ‌హిరంగ స‌భ ఏర్పాటు విష‌యంలో కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఇచ్చిన ఆదేశాల‌పై ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేసిన కేసీఆర్‌.. తాను హుజూరాబాద్ ప్ర‌చారానికి వెళ్ల‌డం లేద‌ని పేర్కొన‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

టీఆర్ఎస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి ఈట‌ల రాజేంద‌ర్ రాజీనామా చేసిన‌ప్ప‌టి నుంచే హుజూరాబాద్‌పై కేసీఆర్ ప్ర‌త్యేక దృష్టి సారించార‌నే వార్త‌లు వ‌చ్చాయి. ఈ ఉప ఎన్నిక‌లో ఎలాగైనా బీజేపీ నుంచి పోటీ చేస్తున్న ఈట‌ల‌ను ఓడించి త‌న పంతం నెగ్గించుకోవాల‌ని కేసీఆర్ చూస్తున్న‌ట్లు వ్యాఖ్య‌లు వినిపించాయి. అందుకే ఆ నియోజ‌క‌వ‌ర్గంలోని ఇత‌ర పార్టీల ముఖ్య నేత‌లను గులాబీ గూటికి చేర్చుకోవ‌డం ప్ర‌యోగాత్మ‌కంగా ద‌ళిత బంధును ఆ నియోజ‌క‌వ‌ర్గంలోనే ప్రారంభించ‌డం లాంటివ‌న్నీ ఈ ఎన్నిక‌లో విజ‌యం కోస‌మే కేసీఆర్ చేశార‌నే అభిప్రాయాలున్నాయి. ఈ ఎన్నిక‌లో గెలుపు కోసం అంత‌లా ప‌రిత‌పిస్తున్న కేసీఆర్ ఇప్పుడు ఈసీని మ‌ధ్య‌లో లాగి ప్ర‌చారానికి వెళ్ల‌నంటూ త‌ప్పుకోవ‌డం విడ్డూరంగా ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెప్తున్నారు.

క‌రోనా నేప‌థ్యంలో ఎన్నిక‌ల ప్ర‌చారం విష‌యంలో ఎన్నిక‌ల సంఘం మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల చేసింది. కేవ‌లం తెలంగాణ‌లో అనే కాదు ఏపీలోని బ‌ద్వేలు ఉప ఎన్నిక కోసం కూడా ఇవే నిబంధ‌న‌లు అమ‌లు చేస్తోంది. అంత‌కుముందు బెంగాల్ ఎన్నిక‌ల్లోనూ ఇవే నిబంధ‌న‌లు అనుస‌రించింది. వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో బ‌హిరంగ స‌భ‌ల‌పై ఆంక్ష‌లు విధించింది. దీంతో ప్ర‌ధాని మోడీనే బెంగాల్‌లో బహిరంగ స‌భ ఆలోచ‌న‌ను విర‌మించుకున్నారు. అలాంటిది ఇప్పుడు ఈసీ రాజ్యం ప‌రిధిని దాటి ప్ర‌వ‌ర్తిస్తుంద‌ని స‌భ పెట్టొద్ద‌ని చెప్ప‌డం ఏమిటీ? ద‌ళిత బంధు ప‌థ‌కం నిలిపేయ‌డం ఏ మాత్రం గౌర‌వం కాద‌ని కేసీఆర్ మండిప‌డ‌డం విచిత్రంగా ఉంద‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పైగా చిల్ల‌ర‌మ‌ల్ల‌ర ప్ర‌య‌త్నాలు మానుకోవాల‌ని ఒక ముఖ్య‌మంత్రిగా ఆయ‌న ఈసీని హెచ్చ‌రించారు.

ఈ నేప‌థ్యంలో కేసీఆర్ కావాల‌నే ఈసీని లాగి హుజూరాబాద్ ప్ర‌చారం నుంచి త‌ప్పించుకున్నారనే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. అక్క‌డ ఈట‌ల‌దే విజ‌య‌మ‌నే రిపోర్ట్ ఆయ‌న‌కు చేరింద‌ని ఎన్ని ర‌కాలుగా ప్ర‌య‌త్నించిన టీఆర్ఎస్ గెలుపు అసాధ్య‌మ‌ని తేలింద‌ని అందుకే ఇప్పుడు ఈసీ పేరు చెప్పి కేసీఆర్ వెన‌క్కి త‌గ్గారని విశ్లేష‌కులు అంటున్నారు. దుబ్బాక‌లోనూ బీజేపీ విజ‌యాన్ని ముందుగానే ప‌సిగ‌ట్టిన కేసీఆర్ అక్కడ ప్ర‌చారానికి వెళ్ల‌లేద‌ని ఇప్పుడు హుజూరాబాద్‌లోనూ అదే ఫాలో అవుతున్నార‌ని చెప్తున్నారు. మ‌రోవైపు హుజూరాబాద్‌లో ద‌ళిత బంధు ప‌థకాన్ని ఈసీ వాయిదా వేయ‌డంపై హైకోర్టులో విచార‌ణ జ‌రిగింది. ఉప ఎన్నిక షెడ్యూల్ వ‌చ్చిన త‌ర్వాత‌నే ద‌ళిత బంధు విధివిధానాల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం జారీ చేసిందని అందుకే వాయిదా వేశామ‌ని ఈ నియోజ‌క‌వ‌ర్గం మిన‌హా రాష్ట్రమంతా ఆ ప‌థ‌కాన్ని అమ‌లు చేసుకోవ‌చ్చిన చెప్పామ‌ని హైకోర్టుకు ఈసీ తెలిపింది. ప్ర‌తిప‌క్షాల వ‌ల్లే ద‌ళ‌త బంధు వాయిదా ప‌డింద‌ని టీఆర్ఎస్ ప్ర‌చారం చేసుకుంటుంద‌ని ఈ నేప‌థ్యంలో ఎవ‌రి ఫిర్యాదుతో ఈ ప‌థ‌కాన్ని వాయిదా వేశారో చెప్పాల‌ని కాంగ్రెస్ నేత జ‌డ్స‌న్ త‌ర‌పు న్యాయ‌వాది వాద‌న‌లు వినిపించారు. ద‌ళిత బంధు కొత్త ప‌థ‌కం కాద‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం వాద‌న‌లు వినిపించింది. అన్ని వ‌ర్గాల వాద‌న‌లు విన్న కోర్టు తీర్పును వాయిదా వేసింది.





Tags:    

Similar News