కొడుకు ఆలింగనం కూతురు హారతి ఫ్యామిలీ సెల్ఫీ

Update: 2016-02-06 06:20 GMT
గ్రేటర్ ఎన్నికల్లో ఎప్పుడూ లేని విధంగా టీఆర్ ఎస్ తన ప్రభంజనాన్ని చాటటమే కాదు.. గ్రేటర్ చరిత్రలో ఇంతటి అద్భుత విజయం మళ్లీ సాధ్యమేనా? అన్న చందంగా హైదరాబాదీయులు తీర్పు నివ్వటం తెలిసిందే. గ్రేటర్ లోని 150 డివిజన్లలో 99 డివిజన్లు అధికారపార్టీ సొంతమైతే.. విపక్షాలకు 1.. 2.. 4 సీట్లకే పరిమితమైతే.. తెలంగాణ అధికారపక్షానికి మిత్రపక్షంగా (పోలింగ్ సందర్భంగా తన్నుకున్న సంగతి వేరే విషయం) వ్యవహరించిందని టీఆర్ ఎస్ అధినేత ఒకటికి రెండుసార్లు ప్రస్తావించిన మజ్లిస్ 44 డివిజన్లను సొంతం చేసుకోవటం తెలిసిందే.

ఇంత భారీవిజయం అనంతరం టీఆర్ ఎస్ పార్టీ మొత్తం ఆనందోత్సాహాల్లో మునిగిపోయింది. దసరా.. దీపావళి ఒకేసారి కలిసి వస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో అంత సంతోషంగా పండగ చేసుకున్నారు. ఈ సంబరాలకు సంబంధించిన ఫోటోలు వేలాదిగా వచ్చాయి. కానీ.. వీటిల్లో మూడు ఫోటోలు మాత్రం అందరి దృష్టిని కట్టిపడేశాయి.

అందులో ఒకటి.. తండ్రిని ఆలింగం చేసుకున్న మంత్రి కేటీఆర్ ఫోటో అందరికి విపరీతంగా ఆకట్టుకుంది. గ్రేటర్ ఎన్నికల్ని తన భుజస్కందాల మీద మోసి.. మొత్తం తానై వ్యవహరించిన మంత్రి కేటీఆర్.. ఈ అద్భుతవిజయం తర్వాత తండ్రిని కలిసిన సందర్భంలో తన ఆనందాన్ని.. ఈ ఆలింగనంతో ప్రదర్శించారు. నిజానికి తండ్రి కొడుకులిద్దరూ ఇంత దగ్గరగా చూపించే ఫోటో లేదనే చెప్పాలి. గ్రేటర్ ఎన్నికల ఫలితాల్ని చాలా మీడియా సంస్థలు.. ‘‘నాన్నకు ప్రేమతో’’ అంటూ క్యాప్షన్లు పెట్టటం తెలిసిందే.

ఇక.. రెండు ఫోటో.. కేసీఆర్ కుమార్తె కవిత తీసిన సెల్ఫీ. ఇందులో కేసీఆర్ సతీమణి.. కేటీఆర్.. ఆయన సతీమణి.. కుమార్తె ఉన్నారు. వీరితో కూడిన ఫోటో కాస్త అరుదుగా ఉండేదని చెప్పక తప్పదు. ఇక.. మూడో ఫోటో కేసీఆర్ కుమార్తె కవిత.. తండ్రికి తిలకం పెట్టి హారతి ఇచ్చిన ఫోటో. గ్రేటర్ ఎన్నికల్లో వచ్చిన గ్రేట్ విక్టరీకి సింబల్ గా నిలిచిన ఈ మూడు ఫోటోలు భవిష్యత్తులో ఒక తీపి గురుతుగా నిలిచిపోతాయనటంలో సందేహం లేదు.
Tags:    

Similar News