సీఎంను..బోకుగాడు అని తిడ‌తారా..కేసీఆర్ ఫైర్

Update: 2019-03-28 05:27 GMT
ఇందుమూలంగా యావ‌న్మందికి తెలియ‌జేయున‌ది ఏమ‌న‌గా.. సోష‌ల్ మీడియాలో ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా కామెంట్లు చేసే వారు ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకోవాల్సిన స‌మ‌యం వ‌చ్చేసింది. ఏదైనా పోస్టును చూసిన వెంట‌నే.. వెనుకా ముందు చూసుకోకుండా ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా కామెంట్లు చేసే వారు త‌మ కామెంట్ల విష‌యంలో ఒక‌టికి రెండుసార్లు చెక్ చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. ఎందుకంటే.. సోష‌ల్ మీడియాలో మీరు పెట్టే పోస్టును సీఎం కేసీఆర్ చూడొచ్చు. ఆయ‌న చ‌ద‌వొచ్చు.

ఏంది?  మేం ఫేస్ బుక్ లో పోస్టు పెడితే.. సీఎం కేసీఆర్ చూస్తారా?  అన్న డౌట్ అక్క‌ర్లేదు. తాజాగా మంచిర్యాల జిల్లాకు చెందిన రైతు శ‌ర‌త్‌.. త‌న‌కు జ‌రిగిన అన్యాయం గురించి ఫేస్ బుక్ లో ఒక పోస్ట్ పెట్టారు. త‌న తాత‌ల నుంచి త‌మ‌కు సంక్ర‌మించిన ఏడు ఎక‌రాల భూమిని వేరే వారికి రెవెన్యూ అధికారి ప‌ట్టా ఇచ్చారు. దీనిపై రైతు శ‌ర‌త్ పోరాడుతున్నాడు. అయినా స‌మ‌స్య తీర‌లేదు.. దీనిపై ఒక పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ కు స్పందిస్తూ ప‌లువురు కామెంట్స్ పెట్టారు. ఇలా పెట్టిన వారిలో ఒక‌రు సీఎం కేసీఆర్ ను బోకుగాడు అంటూ తిట్టారు.

రైతు స‌మ‌స్య త‌న దృష్టికి వ‌చ్చిన వెంట‌నే స్పందించిన కేసీఆర్‌.. వెంట‌నే అత‌డికి ఫోన్ చేసి.. యుద్ధ ప్రాతిప‌దిక‌న అత‌డి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా రెండు సార్లు మాట్లాడ‌టం ఒక ఎత్తు అయితే.. త‌మ మాట‌ల్లో స‌ద‌రు రైతు పెట్టిన పోస్ట్ కు నెటిజ‌న్ ఒక‌రు త‌న‌ను బోకుగాడు అంటూ తిట్ట‌టంపై కేసీఆర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఒక సీఎంను అనే మాటేనా? ఇది అంటూ ప్ర‌శ్నించారు. పోస్టు పెట్ట‌టం పెద్ద విష‌యం కాద‌ని.. రాత రాసేట‌ప్పుడు కాస్త జాగ్ర‌త్త‌గా రాయాల‌ని.. జిమ్మేదార్ గా ఉండాల‌న్నారు.

మ‌నం రాసే రాత గురించి ఎవ‌రు ప‌ట్టించుకుంటారని కొంద‌రు అనుకోవ‌చ్చు. కానీ.. అది త‌ప్ప‌న్న విష‌యాన్ని తాజా ఎపిసోడ్ తో కేసీఆర్ స్ప‌ష్టం చేశార‌ని చెప్పాలి. త‌న‌ను బోకుగాడంటూ తిట్టేసిన నెటిజ‌న్ గురించి ఇవాళ అయితే ఉడుక్కున్న ముఖ్య‌మంత్రి రేపొద్దున చ‌ర్య‌లు కూడా తీసుకోవ‌చ్చు. అయినా.. సీఎం చ‌ర్య‌లు తీసుకుంటారో లేదో త‌ర్వాత‌.. మ‌న వ‌ర‌కు మ‌నం బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించాల్సిన అవ‌స‌ర‌మైతే ఉంద‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు. మిగిలిన సీఎంల‌తో పోలిస్తే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ప్ర‌తి విష‌యాన్ని డేగ క‌న్ను అన్నింటిపైన వేసి ఉంచుతార‌న్న విష‌యం తాజా ఎపిసోడ్ తో స్ప‌ష్ట‌మైంద‌ని చెప్పక త‌ప్ప‌దు. 
Tags:    

Similar News