అధికారులకు కేసీఆర్ తాజా టార్గెట్ అదిరింది

Update: 2016-04-22 04:57 GMT
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకోవటం తెలిసిందే. ఏదైనా విషయం మీద ఫోకస్ చేస్తే.. దాని లోతుల్లోకి వెళ్లి మరీ లెక్క తేల్చే ఆయన తాజాగా వివాదాస్పద భూములపై దృష్టి సారించారు. భారీగా చేపట్టిన అభివృద్ధి  కార్యక్రమాల్ని విజయవంతంగా పూర్తి చేయాలంటే పెద్ద ఎత్తున నిధులు అవసరమన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఇందుకు తగ్గట్లే భూముల విక్రయం ద్వారా భారీగా ఆదాయాన్ని బడ్జెట్ లో చూపించిన విషయాన్ని మర్చిపోకూడదు. అయితే.. భూముల అమ్మకాలు అంత తేలిక కాదన్న విషయాన్ని గుర్తించిన తెలంగాణ ముఖ్యమంత్రి హైదరాబాద్.. రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి వివాదాస్పద భూముల లెక్కల్ని అధికారుల చేత తెప్పించుకున్నారు.

ఈ జాబితాను చూసిన కేసీఆర్ కు షాక్ తగిలినంత పనైంది. ఎందుకంటే.. వివాదాస్పద భూములుగా గుర్తించి వాటిని అమ్మకాలు జరిపితే వేలాది కోట్ల రూపాయిలు ఖజానాకు చేరే అవకాశం ఉంది. అయితే.. ఇవన్నీ కోర్టుల్లో ఉండటాన్ని గమనించిన కేసీఆర్ అదికారులకు ఒక టార్గెట్ పెట్టారు. కోర్టు వివాదాల్లో ఉన్న భూముల విషయంలో గెలవాలన్న లక్ష్యాన్ని నిర్దేశించటంతో పాటు..  ప్రభుత్వం వినియోగించకుండా ఖాళీగా ఉన్న భూముల్ని వెంటనే వేలం వేయాలని ఆదేశించారు. వివాదాల్లో ఉన్న భూముల విషయంలో ప్రత్యేక దృష్టిని సారించి.. కోర్టుల్లో గెలిచేలా వాదనలు వినిపించాలన్న ఆదేశాలతో పాటు.. వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించి వేలం వేసి ఆదాయాన్ని పెంచాలన్న లక్ష్యాన్ని నిర్దేశించారు. మరి.. తెలంగాణ ముఖ్యమంత్రి తాజా లక్ష్యాన్ని తెలంగాణ అధికారులు ఏ మాత్రం విజయవంతం అవుతారో చూడాలి. కేసీఆర్ ప్లాన్ వర్క్ అవుట్ అయితే మాత్రం తెలంగాణ ఖజానాకు కాసులే కాసులని చెప్పక తప్పదు.
Tags:    

Similar News