2 ల‌క్ష‌ల కోట్లు...ఇదే కేసీఆర్ బ‌డ్జెట్‌

Update: 2018-02-23 06:22 GMT
భారీత‌నానికి పెట్టింది పేర‌యిన తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌రో భారీ రికార్డుకు సిద్ధ‌మ‌య్యారు. ఏకంగా రెండు ల‌క్ష‌ల కోట్ల బ‌డ్జెట్‌ కు రెడీ అయ్యారు. అధికార పార్టీ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం తెలంగాణ ప్రభుత్వం రానున్న ఆర్థిక సంవత్సరానికి కావాల్సిన బడ్జెట్‌ కసరత్తులో బిజీ అయ్యింది. కొద్దిరోజులుగా ఆర్థికశాఖ... శాఖలవారీగా వచ్చిన ప్రతిపాదనలపై దృష్టి సారించింది. ప్రపోజల్స్‌ పై సమీక్ష చేపట్టింది. అన్ని శాఖల నుంచి వచ్చిన అంచనాల మొత్తం దాదాపు 2లక్షల కోట్లకుపైగానే ఉన్నట్టు తెలుస్తోంది. దీనిని రంగాల వారీగా కూర్పు చేయాల్సిన అవసరం ఉందని... అయితే సీఎం ప్రాధాన్యతలనుసారం వెళ్లాల్సి ఉన్నందున ఆయన గ్రీన్‌ సిగ్నల్‌ కోసం ఎదురు చూస్తోంది. మొత్తంగా రూ.2 ల‌క్ష‌ల కోట్లు ఉండ‌నున్న‌ట్లు స‌మాచారం.

సాధారణంగా గత బడ్జెట్‌ కంటే దాదాపు 15శాతం అధికంగా పెంచడం ఆనవాయితీగా వస్తోంది. అందులో తెలంగాణ రాష్ట్రం ప్రారంభం నుంచి మిగులు రాష్ట్రంగా.. ధనిక రాష్ట్రంగా ప్రచారంలోకి తీసుకొచ్చారు. వాస్తవానికి పాత బడ్జెట్‌ లో కేటాయింపులు చేసిన ఏశాఖ నిధులనైనా... తను అనుకున్న వాటికే అధికంగా దారి మళ్లించారు. దీనికి ఒక్క ఎస్సీ - ఎస్టీ సబ్‌ ప్లాన్‌ కు కేటాయించిన నిధులు - చేసిన ఖర్చే ప్రత్యక్ష ఉదాహరణ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అందుకు ముందున్న పథకాలను రద్దు చేసి.. కొత్త పథకాలకు శ్రీకారం చుట్టింది. ఎన్ని పథకాలు సృష్టించినా సరే నిధులలో ఎక్కువ శాతం నీటి పారుదల - మిషన్‌ భగీరథలవైపే దారి మళ్లించారు. ఆర్థిక సంవత్సరం ముగింపుకు వచ్చే నాటికి పెన్షన్లు కూడా రెండుమూడు నెలలకు ఒకసారి ఇస్తున్న పరిస్థితి ఉంది. ఇతర అభివృద్ధి పనులు - కాంట్రాక్ట్‌ పనుల బిల్లులు చెల్లించలేదు. దీంతో పనులు నిలిపివేస్తామని కాంట్రాక్టర్లు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. ఉద్యోగుల జీతభత్యాలు - పెన్షన్లు- సర్కార్‌ ఖర్చుల వంటి నాన్‌ ప్లానింగ్‌ వంటివి తప్ప.. మిగతావేమీ పూర్తిస్థాయిలో అమలు కాలేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఫీజు రీఎంబర్స్‌ మెంట్‌ లో మొత్తం బకాయిపడ్డ నిధులు చెల్లించలేదు. భూసేకరణలకు పరిహారం చెల్లించకపోవడం - ఉద్యోగాల కల్పన వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వలేదన్న ఆరోపణలున్నాయి.దీన్ని స‌రిదిద్దే విధంగా తాజా కేటాయింపులు ఉండనున్న‌ట్లు తెలుస్తోంది.

వచ్చే బడ్జెట్‌ లో సంక్షేమ పథకాలకు దాదాపు 90వేల కోట్లు కేటాయించే అవకాశముంది. మిషన్‌ భగీరథ - పంచాయతీరాజ్‌ కలిపి 25వేల కోట్లు - నీటిపారుదల రంగానికి 30వేల కోట్లు కేటాయించే అవకాశముంది. వ్యవసాయరంగానికి 25వేల కోట్లు కేటాయించాలన్న యోచనలో ప్రభుత్వం ఉంది. ఇక ఈసారి తెలంగాణ ప్రభుత్వం కొత్తగా మహిళా బడ్జెట్‌ ను ప్రవేశపెట్టాలని చూస్తోంది. వచ్చిన ప్రతిపాదనలన్నింటిని కూర్పుచేసే పనిలో ఆర్థికశాఖ అధికారులు బిజీబిజీగా ఉన్నారు. రానున్న బడ్జెట్‌ అంతా ఎన్నికల కోణంలోనే ఉండబోతోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ బడ్జెట్‌ లో నిరుద్యోగులు - యువతను టార్గెట్‌ చేస్తూ ఉండబోతుందన్న ప్రచారం జరుగుతోంది.

Tags:    

Similar News