మైనార్టీల మీద ఫోక‌స్ చేయ‌నున్న కేసీఆర్‌

Update: 2018-07-04 07:58 GMT
బావమ‌రిది.. బావ‌మ‌రిదే.. పేకాట‌.. పేకాటే అన్న‌ట్లుగా ఉంటుంది తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీరు. రానున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌న బ‌లాన్ని భారీగా పెంచుకోవాల‌ని భావిస్తున్న ఆయ‌న‌.. విప‌క్షాల‌కుఏ మాత్రం అవ‌కాశం ఇవ్వ‌కూడ‌ద‌ని భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటే ఫ‌లితాలు త‌న‌కు అనుకూలంగా వ‌స్తాయ‌న్న విష‌యం మీద ఆయ‌న దృష్టి సారిస్తున్నారు.

తెలంగాణ‌లో కీల‌క‌మైన మైనార్టీల ఓట్ల‌ను సొంతం చేసుకోవ‌టం కోసం ఆయ‌న ప‌క్కా వ్యూహాన్ని సిద్ధం చేసిన‌ట్లుగా చెబుతున్నారు. మైనార్టీలు త‌మ‌కు వ్య‌తిరేకం కాకుండా ఉండేందుకు వీలుగా మ‌జ్లిస్ కు మిత్రుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఆయ‌న‌.. ఏ మాత్రం అవ‌కాశం చిక్కినా మిత్రుడి సీట్ల‌లో ఒక‌ట్రెండు సీట్ల‌ను సొంతం చేసుకోవాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు చెబుతున్నారు.

అదే స‌మ‌యంలో మైనార్టీల మ‌న‌సుల్ని దోచుకునేందుకు.. త‌మ‌దైన ఓటుబ్యాంకును పెంచుకునేందుకు వీలుగా కేసీఆర్ వ్యూహాలు ర‌చిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా రానున్న బ‌డ్జెట్ లో మైనార్టీల‌కు నిధుల కేటాయింపు పెంచ‌టంతో పాటు.. షాదీ ముబార‌క్ లాంటి ప‌థ‌కాల‌పై మ‌రింత ప్ర‌చారాన్ని పెంచాల‌ని భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

అదే స‌మ‌యంలో మైనార్టీ నేత‌ల‌కు ప‌ద‌వుల కేటాయింపు విష‌యంపైనా దృష్టి సారించాల‌న్న ఆలోచ‌న‌లో కేసీఆర్ ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. ఇప్ప‌టికే న‌లుగురు మైనార్టీల‌కు ఎమ్మెల్సీ స్థానాల్ని కేటాయించిన కేసీఆర్‌..మ‌రో ఎనిమిది మందిని నియ‌మిత ఛైర్మ‌న్లుగా అపాయింట్ చేశారు.

రాష్ట్ర పార్టీ క‌మిటీలో ప‌ది మందికి చోటు క‌ల్పించిన కేసీఆర్‌.. ముస్లింల‌కు రిజ‌ర్వేష‌న్ల‌ను 4 శాతంనుంచి 12 శాతానికి పెంచేందుకు అసెంబ్లీలో చ‌ట్టం చేసి మ‌రీ కేంద్రానికి పంప‌టం ద్వారా ముస్లింల‌కు మేలు చేసేందుకు వీలుగా కేసీఆర్ ఎన్ని ప్ర‌య‌త్నాలు చేయాలో అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్న సంకేతాల్ని పంపించార‌ని చెప్పాలి.

ఈసారి మైనార్టీ బ‌లం ఎక్కువ‌గా ఉన్న స్థానాల్లో మైనార్టీ అభ్య‌ర్థుల్ని బ‌రిలోకి దించ‌టం ద్వారా ల‌బ్థి పొందాల‌ని భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు. రానున్న రోజుల్లో మ‌రో రెండు కార్పొరేష‌న్ల ఛైర్మ‌న్ ప‌ద‌వుల్ని సైతం మైనార్టీల‌కు అప్ప‌జెప్పాల‌న్న ఆలోచ‌న‌లో కేసీఆర్ ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. మైనార్టీ ఓటుబ్యాంకును టోకుగా కొల్ల‌గొట్టేందుకు కేసీఆర్ ఇప్ప‌టి నుంచే వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News