ప్రభుత్వ ఉద్యోగులకు.. ఎమ్మెల్యేకు షాకిచ్చేలా కేసీఆర్ నోట మాట

Update: 2020-03-30 04:02 GMT
యధాలాపంగా అన్నారా? లేక.. ముందస్తు జాగ్రత్తతో అన్నారా? లేక ఇంకేదైనా వ్యూహం ఉందా? అన్నది అర్థం కాని రీతిలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నోటి నుంచి వచ్చిన ఒక మాట ఇప్పుడు ఎమ్మెల్యేలు.. ప్రభుత్వ ఉద్యోగులు ఉలిక్కిపడేలా చేసిందని చెప్పాలి. తాజాగా మీడియాతో మాట్లాడిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం బాగోలేదన్నారు. అయినప్పటికీ.. రైతులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూస్తామని చెప్పటమే కాదు.. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పండిన వరి.. మొక్కజొన్న మొత్తాన్ని ప్రభుత్వమే కొనేస్తుందని.. ఆఖరి కిలో వరకూ తెలంగాణ ప్రభుత్వమే కొనుగోలు చేసి.. చెక్కులు పంపిణీ చేస్తామని చెప్పారు.

కాకుంటే.. ఒక క్రమ పద్ధతిలో ఈ ప్రక్రియ సాగుతుందని.. వారం ఆలస్యమైనా రైతులు ఆగమాగం కావాల్సిన అవసరం లేదని.. అందరి పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని.. ఇంతవరకూ ఎప్పుడూ లేని రీతిలో పౌరసరఫరాల శాఖకు రికార్డు స్థాయి బడ్జెట్ కేటాయించామని.. దానికి సంబంధించిన పత్రం మీద సంతకం చేసినట్లుగా చెప్పారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలోనూ కేటాయించనంత భారీ మొత్తాన్ని కేటాయించామని.. రైతులు పండించిన పంట కొనుగోలు సమయంలో డబ్బులు ఇచ్చేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం బాగోలేదని.. రాష్ట్రానికి ప్రధాన ఆదాయవనరుగా ఉండే ఎక్సైజ్ శాఖ మందగమనంలో ఉండటమే కాదు.. లాక్ డౌన్ తో భారీగా లాస్ ఎదుర్కొంటున్నట్లు చెప్పారు.కేంద్రం నుంచి తెలంగాణకు రూ.12వేల కోట్లు రావాల్సి ఉందని.. మార్చి 15 నుంచి ఎక్సైజ్.. పెట్రోల్.. జీఎస్టీ సహా అన్ని బంద్ అయినట్లుగా చెప్పారు. ఈ సందర్భంగా రానున్న నెలలో చెల్లించాల్సిన ఎమ్మెల్యేల జీతాల్ని బంద్ పెట్టాల్సి వస్తుందేమోనన్న ఆయన.. ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత పెట్టాల్సి ఉంటుందన్న వ్యాఖ్య చేశారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆదుకుంటామన్న భరోసా ఇచ్చే ముఖ్యమంత్రి.. ఎమ్మెల్యే జీతాలు.. ప్రభుత్వ ఉద్యోగుల జీతాల మీద ప్రత్యేక వ్యాఖ్యలు చేయటం ద్వారా వారిని కలవరపాటుకు గురి చేశారని చెప్పాలి.

‘ఎవరూ అతీతులు కాదు. ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్రంలో భాగం కాదా?  కష్టం వస్తే అందరం పంచుకోవాలి కదా? ఇది లగ్జరీ పీరియడ్ కాదు. మనం ఇబ్బందుల్లో ఉన్నాం. విపత్తు వచ్చినప్పుడు ఎదుర్కోవాలి కదా. కొన్ని రోజులు చూసుకొని నడవాలి కదా? అందరూ తగ్గించుకోవాలి. తప్పదు కదా. గండం గట్టెక్కే వరకూ అందరం ఊపిరి బిగపెట్టుకొని కాంప్రమైజ్ కావాలి. కరువు వచ్చినప్పుడు ఉన్నంతలో అందరం తింటాం. ఇది కూడా అంతే’’ అన్న మాటల్ని చూస్తే.. ఎమ్మెల్యే జీతాలు ఉండవన్న సంకేతాన్ని ఇచ్చినట్లుగా చెబుతున్నారు. అదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లోనూ కోత తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తానికి కరోనా ప్రభావం అటు తిరిగి ఇటు తిరిగి తమ మీద పడినట్లుగా ఎమ్మెల్యేలు.. ప్రభుత్వ ఉద్యోగులు ఫీల్ అవుతారేమో?

Tags:    

Similar News