జీతాల్లో కోత: ఉద్యోగులకు షాకిచ్చిన కేసీఆర్‌

Update: 2020-03-31 03:40 GMT
కరోనా వైరస్‌ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు షాకిచ్చారు. కరోనా వైరస్‌ కట్టడికి లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో మార్చిలో రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం భారీగా తగ్గడంతో కేసీఆర్‌ పత్యామ్నాయ చర్యలు చేపట్టారు. ఆదాయం రాకపోవడంతో ఏంటి పరిస్థితి? ఏం చేద్దామని ఉన్నతాధికారులతో కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రగతి భవన్‌లో సోమవారం ఉన్నత స్థాయి సమావేశం జరిపి సమాలోచనలు చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల చెల్లింపులపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మార్చి నెలకు సంబంధించి ఏప్రిల్‌ లో చెల్లించనున్న వేతనాలు, పెన్షన్లపై భారీ కోత పడనుంది. పలు ఉద్యోగ వర్గాల వేతనాలు ఇలా ఉండనున్నాయి.

ముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్‌ చైర్‌పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల జీతాల్లో 75 శాతం కోత విధించాలని నిర్ణయించారు.
- అఖిల భారత సర్వీస్‌ అధికారులు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ లాంటి వారి వేతనాల్లో 60 శాతం కోత విధించనున్నారు.
- ఇక మిగతా కేటగిరీలకు చెందిన ఉద్యోగుల అందరి వేతనాల్లో 50 శాతం కోత పెట్టాలని సమావేశంలో నిర్ణయించారు.
- ఇక నాలుగో తరగతి, ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల్లో 10 శాతం కోత పెట్టాలని ఖరారు చేశారు.
- ఉద్యోగుల జీతాలతో పాటు పెన్షన్లలో కూడా కోత విధించారు. అన్ని రకాల రిటైర్డ్‌ ఉద్యోగుల పెన్షన్లలో 50 శాతం కోత పెట్టాలని నిర్ణయించారు.
- నాలుగో తరగతి రిటైర్డ్‌ ఉద్యోగుల పెన్షన్‌లో కూడా 10 శాతం కోత పెట్టనున్నారు.
- అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ గ్రాంటు పొందుతున్న సంస్థ ఉద్యోగులకు, ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల మాదిరిగానే వారి జీతాల్లో కోత పెట్టాలని అధికారులతో చర్చించి ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సక్రమంగా లేకపోవడంతోనే కోత విధిస్తున్నట్లు గుర్తించాలని ఉద్యోగులు, రిటైర్డ్‌ ఉద్యోగులు సీఎం కేసీఆర్‌ సూచించారు. ఈ విషయం గుర్తించి సహకరించాలని కోరారు. విపత్కర పరిస్థితిలో తప్పలేదని.. అర్థం చేసుకోవాలని తెలిపారు.
Tags:    

Similar News