హరీష్ రావు డమ్మీ.. అంతా కేసీఆరే?

Update: 2019-12-19 10:38 GMT
రెండోసారి అధికారంలోకి వచ్చాక కేసీఆర్ ఎవ్వరిని పట్టించుకునే పరిస్థితుల్లో లేరని అర్థమవుతోంది. మంత్రివర్గాన్ని విస్తరించకుండా మొన్నటి జూలై వరకూ ఒక్కడే పాలించి అందరి నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. హరీష్ రావును పక్కనపెట్టారని అంతటా వ్యతిరేకత పెచ్చరిల్లిన నేపథ్యంలో చివరకు హరీష్ ను తీసుకొని ఆర్థిక మంత్రి పదవిని కట్టబెట్టారు. దీంతో హరీష్ కు అందలం దక్కిందని అందరూ అనుకున్నారు. కానీ ఇక్కడే ట్విస్ట్ నెలకొంది.

హరీష్ రావు ఇప్పుడు తెలంగాణ ఆర్థిక మంత్రిగా ఉత్సవ విగ్రహంగా మారిపోయారని పరిస్థితులను బట్టి చూస్తే అర్థమవుతోంది. 2020-21 తెలంగాణ బడ్జెట్ రూపకల్పన సమావేశం తాజాగా ప్రగతి భవన్ లో కేసీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. దీనికి సీఎస్ జోషి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావు సహా అధికారులంతా హాజరయ్యారు. కానీ స్వయంగా ఆర్థికమంత్రి అయిన హరీష్ రావు హాజరుకాకపోవడం అందరినీ షాక్ కు గురిచేసింది. కేసీఆర్ అన్నీ తానై బడ్జెట్ పద్దులను రూపొందించారట.. దీంతో హరీష్ రావు డమ్మీ అయిపోయారని పార్టీలో చర్చ జరుగుతోంది.

హరీష్ ఆర్థికమంత్రి అయ్యాక కూడా మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ ను కేసీఆరే ప్రవేశపెట్టారు. తెలంగాణ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు బడ్జెట్ రూపకల్పనలోనూ హరీష్ రావుకు ప్రాధాన్యం లేకుండా పోయింది. దీన్ని బట్టి హరీష్ రావును కేవలం ఉత్సవ విగ్రహంలా మార్చేశారని అర్థమవుతోందంటున్నారు. అందరూ డిమాండ్ చేశారని తీసుకున్నట్టు కనిపిస్తోందని విమర్శిస్తున్నారు.
Tags:    

Similar News