టీఆర్‌ఎస్‌ నేత కుమార్తె పెళ్లి.. వధువుకు కాకుండా తండ్రికి కేసీఆర్‌ గిఫ్టు!

Update: 2022-12-09 06:30 GMT
తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కు ఆగ్రహం వచ్చినా, అనుగ్రహం వచ్చినా తట్టుకోవడం కష్టమని ఆయనను బాగా తెలిసినవారు చెబుతుంటారు. తనకు అనుగ్రహమొస్తే వారిని అందలం ఎక్కించడం, ఆగ్రహమొస్తే అవతలకు విసిరేయడం కేసీఆర్‌ శైలి అని చెబుతారు. ఇప్పుడు కేసీఆర్‌ కు అనుగ్రహం కలగడంతో ఒక టీఆర్‌ఎస్‌ నేత పంట పండింది.

సాధారణంగా కేసీఆర్‌ ఎంతో ముఖ్యమైతే తప్ప వివాహాలకు, ఇతర కార్యక్రమాలకు వెళ్లరు. ఆయన తరఫున కేసీఆర్‌ కుమారుడు కేటీఆర్‌ వెళ్తుంటారు. అలాంటిది కేసీఆర్‌ ఒక సాధారణ టీఆర్‌ఎస్‌ నేత కుమార్తె పెళ్లికి వెళ్లారు. ఇదే పెద్ద ఆశ్చర్యం అనుకుంటే ఓవైపు కుమార్తె పెళ్లిలో ఆయన తండ్రి ఉంటే.. అప్పటికప్పుడే ఆయనను తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌గా ప్రకటించి మరింత ఆశ్చర్యపోయేలా చేశారు. అంతేనా అప్పటికప్పుడు ఉత్తర్వులను కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి చెప్పి జారీ చేయించారు.

మరి ఇంతలా కేసీఆర్‌ అనుగ్రహానికి పాత్రుడయిన ఆ నేత ఎవరనేగా మీ సందేహం..? కరీంనగర్‌ మాజీ మేయర్, టీఆర్‌ఎస్‌ నేత రవీందర్‌ సింగ్‌ తన కుమార్తె పెళ్లికి సీఎం కేసీఆర్‌ ను ఆహ్వానించారు. అయితే ఆయన ఎంతో అతి ముఖ్యమైతే తప్ప శుభ, అశుభ కార్యక్రమాలకు హాజరు కారు. దీంతో కేసీఆర్‌ తమ కుమార్తె పెళ్లికి రారనే అనుకున్నారు.

అయితే విచిత్రంగా కేసీఆర్‌.. రవీందర్‌ సింగ్‌ కుమార్తె పెళ్లికి హాజరయ్యారు. దీంతో రవీందర్‌ సింగ్‌ తోపాటు అతడి బంధువులు, స్నేహితులు, టీఆర్‌ఎస్‌ వర్గాలు ఆశ్చర్యపోయాయి.

ఈ ఆశ్చర్యంలో నుంచి తేరుకోక ముందే రవీందర్‌ సింగ్‌ కు పెళ్లి గిఫ్టును కూడా కేసీఆర్‌ ఇచ్చారు. ఆయనను రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్‌ కు చైర్మన్‌ గా నియమించారు. ఈ మేరకు అప్పటికప్పుడే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో మాట్లాడి ఉత్తర్వులు కూడా జారీ చేయించారు.

రవీందర్‌ సింగ్‌ ఫోన్‌ కు ఈ మేరకు మెసేజ్‌ రావడంతో ఆయన బిత్తరపోయారు. ఈ విషయం తెలుసుకున్న బంధువులు, ఆయన స్నేహితులు కూడా కేసీఆర్‌ సార్‌ తీరే వేరు అని ఆసక్తిగా చర్చించుకున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News