వాళ్ల‌కు గులాబీ బీఫారాలు చేతికి ఇచ్చేసిన సారు!

Update: 2019-04-22 04:18 GMT
చిన్న విష‌యాలుగా క‌నిపించినా.. అది చూపించే  ప్ర‌భావం ఎంత ఎక్కువ‌న్న‌ది మాట‌ల్లో చెప్ప‌లేమ‌ని చెప్పాలి. కేవ‌లం మాట హామీ త‌ప్పించి.. పార్టీలో ఇంకా చేర‌ని ప‌ద‌కొండు మంది టీడీపీ.. కాంగ్రెస్ ఎమ్మెల్యేల చేతుల్లో టీఆర్ ఎస్ పార్టీ బీఫారాలు పెట్టేసిన కేసీఆర్ నిర్ణ‌యం చూస్తే.. సార్ ముందుచూపును మెచ్చుకోవాల్సిందే.

అసెంబ్లీ ఎన్నిక‌ల అనంత‌రం టీడీపీ.. కాంగ్రెస్ పార్టీల త‌ర‌ఫున గెలిచిన ఎమ్మెల్యేల‌ను గులాబీ కారులో ఎక్కించేందుకు ప్ర‌య‌త్నాలు జ‌ర‌గ‌టం.. అందుకు త‌గ్గ‌ట్లే 11 మంది ఎమ్మెల్యేలు ఓకే చెప్పేయ‌టం.. త‌మ నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించ‌టం తెలిసిందే. మ‌రో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా త్వ‌ర‌లో వ‌స్తున్నార‌ని.. సంప్ర‌దింపుల ప‌ర్వం జోరుగా సాగుతోంది. ఇదిలా ఉండ‌గా.. తాజాగా వెలువ‌డిన స్థానిక ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ నేప‌థ్యంలో కేసీఆర్ తీసుకున్న‌నిర్ణ‌యం ఆస‌క్తిక‌రంగా మారింది.

అధికారికంగా పార్టీలో చేర‌న‌ప్ప‌టికి.. పార్టీలోకి వ‌స్తామ‌ని మాట ఇచ్చిన 11 మంది ఎమ్మెల్యేల‌కు టీఆర్ ఎస్ పార్టీ బీఫారాల్ని ఇచ్చేశారు. స్థానిక ఎన్నిక‌ల్లో అభ్య‌ర్థుల ఎంపిక‌ను స్థానిక గులాబీ నేత‌ల‌తో స‌మ‌న్వ‌యం చేసుకొని ఇవ్వాల్సిందిగా పార్టీ వారిని చెప్పింది. దీంతో.. అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా గౌర‌వంతో పాటు స్థానిక నాయ‌క‌త్వం మీద ప‌ట్టు రావ‌టానికి అవ‌కాశం క‌లుగుతుంది.  

పార్టీలో చేరతామ‌న్న మాట ఇచ్చిన 11 మంది కాంగ్రెస్‌.. టీడీపీ ఎమ్మెల్యేల‌కు పార్టీ బీఫారాలు ఇచ్చిన పార్టీ నాయ‌క‌త్వం.. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ త‌ర‌ఫున పోటీ చేసి ఓడిన అభ్య‌ర్థుల‌కు బీఫారాలు ఇచ్చిన స‌మాచారాన్ని అందించింది. అంతేకాదు.. ఎమ్మెల్యేల‌తో క‌లిసిమెలిసి ఓడిన అభ్య‌ర్థులు ప‌ని చేయాల‌న్న సూచ‌న‌ను చేసింది. మూడు నెల‌ల క్రితం ఎవ‌రి చేతుల్లో అయితే ఓడామో.. ఇప్పుడు వారి భుజం భుజం రాసుకుపూసుకు తిరుగుతూ ప‌ని చేయాల్సి రావ‌టంపై గులాబీ పార్టీ నేత‌లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఈ సంగ‌తి ఇలా ఉంటే.. బీఫారాలు చేతిలో పెట్టిన తీరుపై ఎమ్మెల్యేలు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. పార్టీలో ప‌ట్టు పెర‌గ‌టానికి ఈ చ‌ర్య ఎంత‌గానో సాయం చేస్తుంద‌న్న భావ‌న వారి మాట‌ల్లో వినిపిస్తోంది. తాజా ఎపిసోడ్ ను నిశితంగా చూస్తే.. ఎవ‌రిని ఎలా దారికి తెచ్చుకోవాలో కేసీఆర్ కు తెలిసినంత బాగా మ‌రెవ‌రికీ తెలీదేమో?
Tags:    

Similar News