త‌న ఇలాకాకు రాకుండా ప‌వ‌న్‌ ను కేసీఆర్ ఆపేశాడే

Update: 2017-12-17 13:57 GMT
జనసేన అధినేత - ప‌వ‌ర్ స్టార్‌ పవన్ కల్యాణ్ దూకుడుకు తెలంగాణ ముఖ్య‌మంత్రి - టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ బ్రేకులు వేశారా? త‌న ఇలాకాలో ప‌ర్య‌టించ‌డం ద్వారా ప‌వ‌న్ త‌న స‌త్తాను చాటుకునేందుకు సిద్ధ‌మైతే...గులాబీ ద‌ళ‌ప‌తి విజ‌య‌వంతంగా చెక్ పెట్టేశారా? అంటే అవుననే స‌మాధానం వ‌స్తోంది. ఉస్మానియా యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి మురళి కుటుంబాన్ని పరామర్శించడానికి ప‌వ‌న్ ఈనెల 14వ తేదీన ప‌వ‌న్ ప‌ర్య‌టించ‌నున్నార‌ని జ‌న‌సేన తెలిపిన విష‌యం గుర్తుండే ఉంటుంది. సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం దౌలాపూర్ గ్రామంలో మురళి ఇంటికి వెళ్లేందుకు ప‌వ‌న్ రెడీ అయ్యారు! అయితే చివ‌రి నిమిషంలో ఈ ప‌ర్య‌ట‌న‌కు ప‌రోక్షంగా సీఎం కేసీఆర్ బ్రేకులు వేయించారు!!

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ ఫిజిక్స్‌ ఫస్టియర్‌ చదువుతున్న మురళి ఆత్మ‌హ‌త్య క‌ల‌క‌లం రేకెత్తించిన సంగతి తెలిసిందే. ముర‌ళి బ‌ల‌వ‌న్మ‌ర‌ణంపై భిన్నాభిప్రాయాలు వినిపించాయి. తెలంగాణ ప్ర‌భుత్వం ఉద్యోగాల భ‌ర్తీలో చేస్తున్న‌ జాప్యం వ‌ల్లే ఆయ‌న ఆత్మ‌హ‌త్య చేసుకున్నార‌ని విద్యార్థులు ఆరోపించ‌గా....ఆయ‌న పేరుతో విడుద‌ల‌యిన ఆత్మ‌హ‌త్య లేఖ‌లో... ప‌రీక్ష‌ల ఒత్తిడికి త‌ట్టుకోలేక చ‌నిపోతున్నాన‌ని అని ఉంది. ముందుగా ప్ర‌క‌టించిన మేర‌కు ఆత్మహత్య చేసుకున్న ఉస్మానియా యూనివర్సిటీ పీజీ మొదటి సంవత్సరం విద్యార్థి ముర‌ళి కుటుంబాన్ని ప‌రామ‌ర్శించేందుకు  ప‌వ‌న్ రెడీ అయ్యారు. ఈనెల 14న ఆయ‌న స్వ‌గ్రామానికి వెళ్లేందుకు రెడీ అయ్యారు. అయితే ఈ ప‌ర్య‌ట‌న‌కు చివ‌రి నిమిషంలో బ్రేకులు ప‌డ్డాయి.

గజ్వేల్‌ పర్యటనకు సంబంధించి ప్రస్తుతం భద్రత కల్పించలేమని పోలీసులు తేల్చేశారు. ఐదు, ఆరుగురు పోలీసులకంటే ఎక్కువ భద్రత కల్పించలేమని జనసేనానికి అధికారులు చెప్పారు. భద్రత కారణంగా పవన్‌ గజ్వేల్‌ పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఈ ర‌కంగా ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న‌కు కేసీఆర్ ప‌రోక్షంగా బ్రేకులు వేయించార‌ని అంటున్నారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ గజ్వేల్‌ పర్యటనకు బ్రేక్ పడ‌గా...అంత‌కుముందే మురళి కుటుంబాన్ని మంత్రి హరీశ్ రావు పరామర్శించారు. మురళి ఇంటికి వెళ్లిన మంత్రి హ‌రీశ్‌ రావు ఆయ‌న కుటుంబాన్ని ఓదార్చారు. మురళి కుటుంబానికి రూ. ప‌ది ల‌క్ష‌ల‌ ఆర్థిక సాయం అందజేశారు. మురళి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి హరీశ్ రావు భరోసా ఇచ్చారు.

కాగా, ప‌వ‌న్ ప‌ర్య‌టించ‌డం ద్వారా తెలంగాణ రాజకీయాలు మ‌రింత హీటెక్కుతాయ‌ని భావించారు. ఇప్ప‌టికే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏపీలో ప‌ర్య‌టించి డీసీఐ కార్మికుల‌కు సంఘీభావం తెలిపారు. ప‌డ‌వ ప్ర‌మాద మృతుల కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించారు. త‌న పార్టీ కార్య‌క‌ర్త‌ల‌తో స‌మావేశం అయ్యారు. ఇదే రీతిలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇలాకాలో ఆయ‌న ప‌ర్య‌ట‌న ఉంటుంద‌ని ఊహించిన‌ప్ప‌టికీ కేసీఆర్ మార్క్ చాణ‌క్యంతో దానికి బ్రేకులు ప‌డిన‌ట్ల‌యింది.
Tags:    

Similar News