ఆర్టీసీ ఉద్యోగులకు కేసీఆర్ కొత్త గడువు.. ఏమిటంటే?

Update: 2019-11-03 04:37 GMT
నాలుగు వారాలకు ఒకట్రెండు రోజులు అటు ఇటుగా సాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరోమారు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కార్మికుల సమ్మె చట్టవిరుద్దమని డే వన్ నుంచి చెబుతున్న కేసీఆర్.. తాజాగా మరోసారి అదే విషయాన్ని బల్లగుద్ది మరీ చెప్పారు. గతంలో ఆర్టీసీ కార్మికులు సెల్ఫ్ డిస్మిస్ అయ్యారని.. విధులకు హాజరు కాకుండా పెద్ద తప్పు చేశారని.. వారిక ఆర్టీసీ ఉద్యోగులే కాదని మాట్లాడిన కేసీఆర్.. తాజాగా మాత్రం అందుకు భిన్నంగా లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నట్లుగా ప్రకటించారు.

ఆర్టీసీ కార్మికులు తమ బిడ్డలేనని.. వారు రోడ్డున పడాలని తాము అనుకోవటం లేదన్న మాటను చెబుతూనే.. కార్మిక సంఘాల మీద ఉన్న కోపాన్ని మొహమాటం లేకుండా ప్రదర్శించారు. యూనియన్ల మాయలో పడి బతుకుల్ని ఆగమాగం చేసుకోవద్దన్న ఆయన.. మీరు కష్టాల పాలై.. అన్నం లేకుండా ఉండాలన్న ఉద్దేశం లేదన్న ఆయన.. కఠినంగా అణచివేయాలన్న ఆలోచన కూడా తమకు లేదన్నారు.

కార్మికుల మీద తనకున్న అపారమైన కరుణ ఉన్న నేపథ్యంలో చివరి అవకాశం ఇస్తున్నట్లుగా వ్యాఖ్యలు చేశారు. కార్మికులు భేషరతుగా ఉద్యోగాల్లో చేరేందుకు మూడు రోజుల గడువు ఇస్తున్నట్లు వెల్లడించారు. మంగళవారం అర్థరాత్రి వరకూ భేషరతుగా ఉద్యోగాల్లో చేరితే రక్షణ.. మంచి భవిష్యత్తు ఉంటాయని ఊరించిన కేసీఆర్.. అందుకు భిన్నంగా వ్యవహరిస్తే మాత్రం మీ ఇష్టమని తేల్చేశారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేది లేదని మంత్రివర్గం నిర్ద్వంద్వంగా తోసిపుచ్చిందని.. ఆర్టీసీని విలీనం చేస్తే మరో చిన్నా చితకా 90 వరకు ఉన్న కార్పొరేషన్లను విలీనం చేయాల్సి ఉంటుందన్నారు. కోర్టుల అదే విషయాన్ని ప్రస్తావించాయని.. అది జరిగేపని కాదన్న ఆయన.. తాను బాగా లోతుగా ఆలోచించిన తర్వాతే విలీనం కుదరదనే నిర్ణయాన్ని తీసుకున్నామని.. తన నిర్ణయంలో మార్పు ఉండదని కుండబద్దలు కొట్టేశారు.  

శనివారం రాత్రి సుదీర్ఘంగా సాగిన కేసీఆర్ మీడియా సమావేశాన్ని చూస్తే.. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో గతంలో ఆయన నిర్వహించిన ప్రెస్ మీట్ కు.. తాజా ప్రెస్ మీట్ కు వ్యత్యాసం కొట్టొచ్చినట్లుగా కనిపించింది. గతంలో ప్రదర్శించిన బెట్టు కాస్త సడలినట్లుగా కనిపించినప్పటికీ.. మొండితనం మాత్రం ఏ మాత్రం తగ్గలేదన్న విషయం మాత్రం స్పష్టమైంది. మరి.. లాస్ట్ ఛాన్స్ అంటూ కేసీఆర్ ఊరింపులకు ఆర్టీసీ కార్మికులు ఎలా రియాక్ట్ అవుతారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారిందని చెప్పక తప్పదు.

Tags:    

Similar News