కేసీఆర్ ఎవరికి ఎలాంటి వార్నింగ్ లు ఇచ్చారంటే?

Update: 2019-10-13 05:52 GMT
తనకు ఎదురుచెబితే ఏ మాత్రం నచ్చని వారు చాలామందే కనిపిస్తారు. అలాంటిది తెలంగాణ రాష్ట్రానికి తిరుగులేని పాలకుడిగా ఇమేజ్ ఉన్న కేసీఆర్ కు చిరాకు కలిగేలా.. ఆయన ఇష్టానికి వ్యతిరేకంగా జరిగే సమ్మె ఆయనకు ఎంత కోపం తెప్పిస్తుంది? మరెంత ఆగ్రహాన్ని కలిగిస్తుంది? అన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే ఉండదు. తన అభీష్టానికి వ్యతిరేకంగా సాగుతున్న ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఏర్పాటు చేసిన కేబినెట్ సమావేశం ఆసక్తికరంగా సాగిందని చెప్పాలి.

దాదాపు ఆరున్నర గంటల పాటు సాగిన భేటీలో ఆర్టీసీ ఉద్యోగులు చేసే సమ్మెకు తాను బెదరనని.. భయపడనని చెబుతూనే.. కేసీఆర్ పలు వార్నింగ్ లు ఇచ్చేయటం ఆసక్తికరంగా మారింది. కార్మికుల సమ్మె తాటాకు చప్పుళ్ల లాంటివని.. పిల్లిమొగ్గలుగా అభిర్ణిస్తూ.. తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో.. ఉద్యమాన్ని మరింత పెరిగేలా ఆయన వ్యాఖ్యలు.. తీసుకునే నిర్ణయాలు ఉండటం గమనార్హం.

ఆర్టీసీ ఉద్యోగులు చేసే సమ్మెను నిర్వీర్యం చేయటమే లక్ష్యంగా పెట్టుకున్న కేసీఆర్.. ఉన్నతాధికారులకు.. పోలీసు బాస్ కు చెప్పాల్సిన విధంగా చెప్పేశారు. మూడంటే మూడు రోజుల్లో డిపోల్లో ఉన్న బస్సులు రోడ్ల మీదకు రావాలని.. నూటికి నూరు శాతం బస్సులు నడవాలని తేల్చేసిన ఆయన.. ఏం చేయాలో అది చేయాలని చెప్పారు.

ఇప్పటివరకూ చేస్తున్న సమ్మె మీద ప్రభుత్వం ఉదాసీనంగా ఉందని.. ఇకపై కఠినంగా వ్యవరిస్తామన్న వార్నింగ్ ఇచ్చేసిన కేసీఆర్.. ఆర్టీసీ బస్సులు నూటికి నూరు శాతం రోడ్ల మీదకు రావాలని తేల్చేశారు. ప్రతి ఆర్టీసీ డిపో.. అస్టాండ్ వద్ద పోలీసు బందోబస్తు పెంచాలని.. అన్నిచోట్ల సీసీ కెమేరాలు పెట్టాలని.. మహిళా పోలీసులను బందోబస్తు కోసం వినియోగించాలన్నారు.

ప్రజల్ని ఇబ్బందులకు గురి చేసే వారిని అదుపులోకి తీసుకోవాలని.. కేసులు నమోదు చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. చట్ట వ్యతిరేకత కార్యకలాపాలకు పాల్పడే వారిని గుర్తించి.. కేసులు పెట్టి కోర్టుకు పంపాలన్న ఆయన.. ఆర్టీసీ కార్మికుల సమ్మెను గుర్తించేదే లేదని తేల్చేశారు. వారితో తాము చర్చలు జరపమని.. ఉద్యోగుల్ని తాము డిస్మిస్ చేయలేదని.. చట్టవిరుద్ధంగా సమ్మె చేసి వారికి వారే ఉద్యోగాల్ని వదులుకున్నారంటూ పాత పాటను పాడేశారు.

యూనియన్ నాయకులు అత్యంత బాధ్యతారహితంగా వ్యవహరించి 48 వేలమంది ఉద్యోగాలు పోయేలా చేశారన్నారు. కార్మికుల్ని క్షమించే ప్రసక్తే లేదని చెప్పేస్తున్న తీరు చూస్తే.. ఇష్యూ మరింత ముదిరేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని చెప్పాలి. కార్మికులు చేస్తున్న సమ్మెకు భయపడేది లేదంటూనే.. బెదిరేలా వార్నింగ్ లు ఇవ్వటం.. అధికారులకు కఠినంగా వ్యవహరించాలని నొక్కి చెప్పటం చూస్తే.. ఇష్యూను ఎలాగైనా తాను కోరుకున్నట్లు చేయాలన్నదే కేసీఆర్ ఉద్దేశంగా చెప్పక తప్పదు.
Tags:    

Similar News